
హైదరాబాద్, జూలై 22,
తెలంగాణ బీజేపీ లో ఇద్దరు నేతల మధ్య పోరు పార్టీలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. కానీ ఈ విషయంలో ఇప్పటికీ పార్టీలో పెద్దలు మాత్రం మౌనం వహిస్తున్నారు. అందుకు కారణాలు ఏమీ ఉంటాయోనని రాజకీయ విశ్లేషకులు తర్జన భర్జన పడుతున్నారు.భారతీయ జనతా పార్టీ కి ఒక స్పష్టమైన వ్యూహం ఉంటుంది. బలమైన అధిష్టానం, కోర్ కమిటీ ఆ పార్టీని ముందుకు నడిపిస్తుంది. అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉండే కట్టప్పలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పార్టీ అధిష్టానానికి తలొగ్గి నడిచే వారికి, వారి సూచనలు పాటిస్తూ, వారు అనుసరించే వ్యూహంలో భాగంగా తీసుకునే కఠినమైన నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఏ సందర్భంలో ఏ అవకాశం, పదవి ఇవ్వాలని నిర్ణయాలు ఉంటాయి. అవి అర్థం చేసుకొని పార్టీలో నిలదొక్కుకుని నడిచే వారికి మాత్రం సమయం, సందర్భం బట్టి అవకాశం కల్పిస్తారు. వాటిని చక్కగా ఉపయోగించుకునే వారు ఆ పార్టీలో ఉన్నత స్థానానికి ఎదుగుతారనేది నిర్వివాదాంశం.ఒక సామాన్య కార్యకర్త ఏబీవీపీలో పనిచేసి కరీంనగర్ కార్పొరేటర్ గా ఉన్న బండి సంజయ్ కుమార్ ను అధిష్టానం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వడం, పరాజయం పాలైన ఆయనకు వెంటనే ఎంపీ గా మరో అవకాశం కల్పించి గెలిపించుకున్నారు. 2023 ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన అధిష్టానం నిర్ణయాన్ని దిక్కరించలేదు. కనీసం ఆ నిర్ణయంపై పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. అదే ఆయన్ను ఆ ఎన్నికలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్తి ఓడినా, రెండోసారి ఎంపీ గా పోటీ చేసి గెలిచిన తరువాత కేంద్ర మంత్రిగా నియమించింది. పార్టీ ఒక కార్యకర్తను నాయకునిగా ఎలా తీర్చిదిద్దుతుందో బండి రాజకీయ ప్రస్తానం చూస్తే అవగతమౌతుంది.ఏడుసార్లు బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా హుజులారాబాద్ నుంచి ఎన్నికైన ఈటల తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు కుడిభుజంగా నడిచి పార్టీని ఆడుకున్న నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. 2014 లో మొదటిసారి రాష్ట్ర కేబినెట్ లో నెంబర్ 2 స్థానంలో ఉన్న ఆయన్ను రెండోసారి ఎన్నికల అనంతరం పొమ్మనలేక పొగపెట్టారు. ముక్కుసూటిగా వ్యవహరించే ఈటల పార్టీలో జరిగే పరిణామాలపై స్పష్టంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఒక వర్గానికి కంటగింపయ్యారు. కేటీఆర్ ను సీఎం చేయాలనే విషయంలో ఈటల ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టేశాడు. అదే ఆయనను పార్టీ నుంచి పంపించేందుకు కారణమని పార్టీ శ్రేణులు అభిప్రాయపడ్డారు. కానీ పార్టీ నుంచి బయటికొచ్చిన ఆయన కాంగ్రెస్ లో చేరుతాడని ఊహించారు. కమ్యూనిస్టు భావజాలం గల ఈటల బీజేపీ లో చేరడం, ఆ పార్టీలో ఆశ్చర్యానికి గురిచేశాయి. తదుపరి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి తన సత్తా చాటుకున్నాడు. ఆ సమయంలో తన వెంట నడిచే అనుచరగణం పూర్తిగా బీజేపీలో చేరడంతో హుజురాబాద్ పరిధిలోని మండలాల్లో బీజేపీకి బలమైన నాయకత్వంతో ముందుకు నడిచింది. కానీ అక్కడ ఇదివరకే పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులకు, ఈటల తో చేరిన నాయకులకు మధ్య మాత్రం సయోధ్య కొరవడింది. దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యక్షంగా పడింది. రెండు ప్రాంతాల్లో పోటీ చేసి ఓడిన ఈటల తన ఓటమికి కారణాలను తెలుసుకునే సమయంలోనే మల్కాజ్ గిరి ఎన్నికలలో ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. కానీ తన రాజకీయ ప్రస్థానానికి వేదికగా నిలిచిన హుజురాబాద్ లో అనుచరులు ఎదుర్కొంటున్న సమస్యలు వారు నేరుగా వచ్చి తెలిపేవరకు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. పార్టీ వ్యవహారాల్లో తలమునకలై ఉన్న సమయంలో సొంత నియోజకవర్గంలో విపరీత పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ముందున్న ఈటల ను కాదని రాంచందర్ రావు ను ఎంపిక చేయడం వెనుక కథ ఏదైనా కుట్ర కోణం దాగుందని భావించారు. ఒకవైపు సొంత నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ఒక ప్రచారం జరగడం, మరోవైపు తాను అనుకున్న స్థాయిలో పార్టీ గుర్తించినట్లు ఈటల భావించడంతోనే పరోక్షంగా ఒక నాయకుడిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ మాటలు కేంద్ర మంత్రి బండిని ఉద్దేశించి అన్నారని జరిగిన ప్రచారంతో, ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని బండి తన అనుచర గణానికి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఈటల ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయడంపై కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలను బహిరంగంగా ప్రస్తావించడం బీజేపీ సీరియస్ గా తీసుకుంటుంది. పార్టీలో ఎన్ని వర్గాలున్నా, బయటికి మాత్రం అందరూ సమష్టి గా ముందుకు వెళ్లాలని, ఏ మనస్పర్ధలు ఉన్నా అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని పార్టీ సూచిస్తుంది. అయితే వీరిద్దరి ఎపిసోడ్ ను పార్టీ ఏవిధంగా చూస్తుందో, వారు నిర్ణయం తరువాతే తెలుస్తోంది.