
హైదరాబాద్
కూకట్ పల్లి నియోజకవర్గానికి జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు నెలకు 4 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్న 80 లక్షలు ఇచ్చి అభివృద్ధి చేయమంటే ఎలా జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. గడిచిన 18 నెలల్లో అభివృద్ధి చేయడం మరచి బ్యానర్లు పెట్టి డబ్బులు వృధా చేశారు తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు. తనని నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు స్థలాలను ఇప్పటికే 1000 కోట్ల రూపాయలకు పైగా అమ్మేశారని, మరో 5000 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాల పైన రేవంత్ రెడ్డి కన్నువేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి కేపి.హెచ్.బి కాలనీ లో 18 గజాలు, 36 గజాలను సైతం వదలడం లేదని అన్నారు. రోడ్డు నెంబర్ 2 లో గుడికి ఆనుకొని ఉన్న స్థలాన్ని సైతం అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, మంచినీటి పైప్లైన్ తో పాటు నూతన డ్రైనేజీ నిర్మాణాలు సైతం చేపట్టామని ఇప్పుడు వీరు మాత్రం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వంద ఫీట్ల రోడ్డు చూపెట్టి హౌసింగ్ బోర్డ్ అధికారులు ప్రజలను మోసం చేస్తూ వేలం వేస్తున్నారని స్థలాన్ని చూసేసరికి 40 ఫీట్ల రోడ్డు చూపెడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన బుద్ధిని మార్చుకోకపోతే కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు.