YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పన్నెండు అంశాలతో జనసేన మ్యానిఫెస్టో

పన్నెండు అంశాలతో  జనసేన మ్యానిఫెస్టో
జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ విడదల అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరిట ఈ డాక్యుమెంట్ విడుదల అయింది. విజన్ డాక్యుమెంట్ లో 12 అంశాలు ఉంచిన పవన్,ఈ అంశాలు కేవలం మచ్చుతునక మాత్రమేనంటూ డాక్యుమెంట్ లో పేర్కొన్నారు. ఈ అంశాలు సాహసోపేత నిర్ణయాలు అని తెలుసు. కానీ మనసుంటే మార్గముంటుంది అని విశ్వసిస్తున్నా అంటూ పవన్ ప్రకటనలో పేర్కోకొన్నారు. 
అత్యున్నత పర్వతమూ 
అతి దీర్ఘ నదీప్రవాహమూ 
అతి లోతైన సముద్రము 
అతి దూరపు నక్షత్రము 
ఉన్నప్పుడు అత్యుత్తుమ 
మానవుడెందుకు ఉండడు ..? అని ప్రముఖ కవి  గుంటూరు శేషేంద్ర శర్మ తన ఆధునిక మహా భారతం గ్రంధంలో రాశారు. ఇటువంటి అత్యున్నత మహానీయులైన మానవులు ఉండబట్టే మనం స్వాతంత్ర్యాన్ని సాధించుకోగలిగాము. బలమైన రాజ్యాంగాన్ని తీసుకురాగలిగాము.  ఎంతోమంది మహనీయులు, వారి జీవితాన్ని అర్పించి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేటట్టు చేసి, బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి మనందిరికీ విముక్తి కలిగించారు. మహోన్నతమైన గుణాలను కలిగిన మేధావులు ఎన్నో సంవత్సరాలు పాటు మధించి, శోధించి 1950 లో భారత రాజ్యాంగాన్ని రచించి, భావి తరాలకు దశ దిశలను, విధివిధానాలను పొందుపరిచారు. మేధోసంపన్నుడు, దూరదృష్టి గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సారధ్యంలో ఎందరో నిష్ణాతులు రాజ్యాంగ రచనా క్రతువులో పాల్గొని మనదేశానికి రూపురేఖలు తీర్చిదిద్దారు. భారత రాజ్యాంగ లక్ష్యం మరియు సిద్ధాంతాలను ప్రియాంబుల్ ( ప్రవేశిక ) లో ఈ క్రింది విధంగా పొందుపరిచారు. 
భారతదేశపు ప్రజలమైన మేము భారతదేశాన్నిఈ విధంగా తీర్చిదిద్దుతాము:
• సార్వభౌమత్వం : స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశం
• సామ్యవాదం : ఉత్పత్తి అయిన సంపద సమాన పంపిణీ 
• లౌకికం : మతపరమైన వివక్ష లేని దేశం 
• ప్రజాస్వామ్యం : ప్రజల చేత, ప్రజల కోసం ప్రభుత్వం ఎన్నుకోబడుతుంది
• గణతంత్రం : నాయకుడు వంశపారంపర్యంగా వచ్చే వ్యక్తి కాదు. ఎన్నిక ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి
• న్యాయం : సామాజిక, ఆర్దిక, రాజకీయ న్యాయం ప్రజలందరికీ సమానం
• స్వేచ్ఛ :  భావ వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధన స్వేచ్ఛను అందరూ కలిగి ఉంటారు 
• సమానత్వం : హోదా, అవకాశాలలో సమానత్వం మరియు వాటిని ప్రోత్సహించడం
• కూటమి  : వ్యక్తి గౌరవం మరియు దేశం యొక్క ఏకత్వం, సమగ్ర తలకు భరోసా
కానీ వాస్తవానికి ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పక్షాలవారు ప్రియాంబుల్ కు తూట్లు పొడిచారు. సంపూర్ణమైన అభివృద్ధి నుంచి ప్రజలను దూరం చేశారు. ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా విడదీశారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట ప్రజల మధ్య భేదభావాలను సృష్టించారు.  భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తిని కాలరాశారు. చెప్పింది చేయం.. చేసేది చెప్పం అన్న రీతిలో పాలకులు వంచన రాజకీయాలతో దేశాన్ని ఏలుతున్నారు. ఎన్నికల సమయంలో ఆర్భటంగా మేనిఫెస్టోని ప్రకటించే రాజకీయ పక్షాలు.. ఎన్నికల తర్వాత వాటిని మొక్కుబడిగానైనా అమలు చేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. రాజకీయ జవాబుదారీతనం ఏ రాజకీయ నాయకుడులోనూ వీసమెత్తు గోచరించదు. మేనిఫెస్టో అమలును అతిక్రమించడం వల్ల సంపద అందరికి సమానంగా చేరడం లేదు. కొన్ని కుటుంబాలు, వారి బంధువులు, వారి కనుసన్నల్లో మెలిగే సిండికేట్లు వేలకోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారు. అభివృద్ధి ఫలాలు అతి కొద్ది మందికే చేరడంతో ఆర్థికంగా బలమైన వారు మరింత బలవంతులుగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు మరింత బలహీనులుగా మారి కుల, మత, ప్రాంత వివక్షలతో కూనరిల్లుతున్నారు. దీనికి చట్టసభలకు ప్రాతినిద్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పార్లమెంటుకు ప్రాతినిద్యం వహిస్తున్న ఎంపీలు అయితేనేమి, శాసనసభ, శాసనమండలికి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితేనేమి వ్యక్తిగతంగా, సమిష్టిగా బాధ్యత వహించాల్సి ఉంది. ప్రజాస్వామ్యానికి పీఠాలైన చట్ట సభల్లో శాసనకర్తలు కొద్దిమంది బాగుకోసం కోట్లాది మంది ప్రయోజనాలను పణంగా పెట్టడం జాతికే తీరని ద్రోహం.   
ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా అది కొన్ని వ్యాఖ్యల సమ్మేళనంలా ఉంటోంది. రాజకీయ విలువలు ఈ రోజు ఏవిధంగా దిగజారిపోయాయంటే ఒక రాజకీయ పార్టీ తన మేనిఫెస్టో లో ప్రకటించిన వాగ్ధానాలను ఎన్నికల తర్వాత కనీసం మాట మాత్రానికైనా గుర్తుకు తెచ్చుకోదు. గద్దెనెక్కే సమయంలో చట్టాలకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు. ఆచరణలో చట్టాలకు తూట్లు పొడుస్తారు. ఉదాహరణకు భూసేకరణ చట్టం - 2013ను టీడీపీ ప్రభుత్వం నీరుగార్చేసింది. రైతులను భూమిలేని వారిగా చేసింది. అదేవిధంగా  భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్ధానం చేసి ఆ తర్వాత వెన్నుపోటు పొడిచింది. ఇది ఏ రకం రాజ్యాంగ స్ఫూర్తి..? 
నేను డ్యాము లెందుకు కడుతున్నానో, భూము లెందుకు దున్నుతున్నానో, నాకు తెలీదు !
నా బ్రతుకొక సున్న కానీ నడుస్తున్నా ! వ్రేళ్ళు కాళ్ళయి నడిచే చెట్టు మనిషి.. చెట్టుగా ఉంటే ఏడాదికొక వసంతమన్నాదక్కేది .. మనిషినై అన్ని వసంతాలూ కోల్పొయాను ! అంటారు  గుంటూరు శేషేంద్ర శర్మ గారు తన ఆధునిక మహా భారతం గ్రంధంలో... 
ఈ పరిస్థితుల నుండి ప్రజలను రక్షించాలి. వారికి మంచి ప్రమాణాలతో కూడిన జీవనాన్ని అందించాలి. తాగడానికి పరిశుద్ధమైన నీరు, కలుషితంకాని గాలి, ఆరోగ్యకరమైన పరిసరాలు.. ఇవి ప్రతి ఒక్కరికీ దక్కేలా జనసేన పాటు పడుతుంది. ప్రజలందరికీ ముఖ్యంగా ఆడపడుచులకు పూర్తి భద్రతతో కూడిన పౌర సమాజాన్ని నిర్మించాలి... ఇది జనసేన దృఢ సంకల్పం. మానవాళి నిరాశ, నిసృహలకు లోనుకాకుండా వారి జీవితాల్లో వసంతం తీసుకురావడం మా లక్ష్యం. ఈ దిశలోనే జనసేన మేనిఫెస్టో ఉండబోతుంది. సార్వజనీనకంగా ఉండే మేనిఫెస్టో సంపూర్ణ ప్రతిని త్వరలోనే విడుదల చేస్తాం. ఈ నాటి ఈ ప్రతి కేవలం విజన్ డాక్యూమెంట్ మాత్రమే. మేనిఫెస్టోలోని కొన్ని మచ్చుతునకలు ఇవి..
1. మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు  
2. గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు 
3. రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో 2500 - 3500 వరకు నగదు 
4. బీసీలకు అవకాశాన్ని బట్టి 5%  వరకు రిజర్వేషన్లు పెంపుదల
5. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు 
6. కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు 
7. ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం
8. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్ 
9. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్ధులకు వసతిగృహాలు
10. ముస్లింల అభివృద్ధికి సచార కమిటీ విధానాలు
11. ప్రభుత్వ ఉద్యోగుల  పీసీఎస్  విధానం రద్దు 
12. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు 
మేము చెప్పే విషయాలు సాహసోపేత నిర్ణయాలని తెలుసు. కాని మనసుంటే మార్గముంటుంది అని బలంగా విశ్వసిస్తున్నాను. ఈ చిరుదీపం కోట్లాది మందికి వెలుగునిస్తుందని ఆశిస్తన్నామని అయన డాక్యుమెంట్ లో పేర్కోన్నారు. అంతకన్నాముందు పవన్  జనసేన మ్యానిఫెస్టో ను సోమేశ్వర జనార్ధనస్వామి ముందు ఉంచి పూజలు జరిపించారు. బుధవారం నాడు విజయవాడలో జనసేన, వామపక్షాల సంయుక్త మ్యానిఫెస్టో విడుదల చేసే అవకాశం వుందని పార్టీ వర్గాల సమాచారం.

Related Posts