YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

రోగాలకు మందు..గోమూత్రం

రోగాలకు మందు..గోమూత్రం

-  ఆయుర్వేదంలో గోమూత్రం అనేది అంతర్భాగ మే..

- ఆయుర్వేద విస్తరణకు కృషి.. యూపీ ఆయుర్వేద విభాగం డైరెక్టర్ డాక్టర్ ఆర్‌ఆర్ చౌదరి

గోమూత్రంతో నేలను శుభ్రంచేసే ద్రవాన్ని తయారుచేసేందుకు ప్రతిపాదించిన ఉత్తరప్రదేశ్ ప్రభు త్వం.. ఇప్పుడు మరో అడుగువేసింది. గోమూత్రం వినియోగించి ఔషధాలను తయారుచేసింది. ఆయుర్వేద ప్రాధాన్యతను విస్తరించేందుకు కృషి చేస్తున్నది. గోమూత్రాన్ని ఉపయోగించి ఆయుర్వేద విభాగం ఎనిమిది రకాల ఔషధాలను తయారుచేసింది. ఈ ఔషధాలతో కాలేయ వ్యాధులు, కీళ్ల నొప్పులు, వ్యాధి నిరోధక శక్తి లోపించడం వంటి సమస్యలు దూరం అవుతాయి అని యూపీ ఆయుర్వేద విభాగం డైరెక్టర్ డాక్టర్ ఆర్‌ఆర్ చౌదరి  మీడియాకు తెలిపారు. ఈ విభాగానికి లక్నో, ఫిలిబిత్‌లో ఫార్మసీలతోపాటు ఇతర ప్రైవేటు యూనిట్లు ఉన్నాయని, ఇక్కడ గోమూత్రం, ఆవుపాలు, నెయ్యిని ఉపయోగించి ఆయుర్వేద ఔషధాలను తయారుచేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో బండా, ఝాన్సీ, ముజఫర్‌నగర్, అలహాబాద్, వారణాసి, బరేలి, లక్నో, ఫిలిబిత్‌లో మొత్తం ఎనిమిది ఆయుర్వేద వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ ఆయుర్వేదంపై డిగ్రీ కోర్సులు నడుస్తున్నాయి. దీంతోపాటు నిత్యం వేలాదిమంది రోగులు వివిధ చికిత్సల కోసం ఆయా వైద్య కళాశాలలకు వస్తున్నారు అని చౌదరి తెలిపారు. 


ఒక్క లక్నోలోని ఆయుర్వేద దవాఖానకు ఔట్ పేషెంట్ విభాగం కింద రోజుకు 700 నుంచి 800 మంది రోగులు వస్తున్నారని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో గోమూత్రం అనేది అంతర్భాగం. గోమూత్రంతోపాటు ఇతర ఆవు ఉత్పత్తులను ఉపయోగించి ఎనిమిది రకాల మందులను తయారుచేస్తున్నాం. ఇతర వ్యాధుల నివారణకు కూడా ఈ ఔషధాలను విస్తరించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. గోమూత్రం, ఇతర ఆవు ఉత్పత్తులు ఎంతో ఉపయోగకరమని అధ్యయనాలూ చెప్తున్నాయి అని తెలిపారు. త్వరలోనే కొత్త ఫార్మసీలను ప్రారంభించేందుకు, ఆయుర్వేద వైద్య కళాశాలల్లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్, ఎండీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

ఔషధాల తయారీకి గోమూత్రం వినియోగంపై.. కేంద్రం 2017 జులైలో ఆరెస్సెస్, వీహెచ్‌పీతో సంబంధాలు ఉన్న ముగ్గురితోపాటు వివిధ రంగాల్లో నిపుణులైన 19 మంది సభ్యులతో కమిటీ వేసింది. పంచగవ్య (ఆవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యి) అనేది.. పోషకాహారం, ఆరోగ్యం, వ్యవసాయపరంగా ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుందో కూడా గుర్తించాలని అప్పట్లోనే ప్రభుత్వం సర్కులర్‌లో పేర్కొన్నది.
 

Related Posts