YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆధార్‌ స్థానంలో ‘వర్చువల్‌ ఐడీ’

ఆధార్‌ స్థానంలో ‘వర్చువల్‌ ఐడీ’

కొత్త విధానం తీసుకొచ్చిన యూఐడీఏఐ

ఆధార్‌ కార్డులోని వివరాల గోప్యతపై ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో యూఐడీఏఐ కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. సిమ్‌ వెరిఫికేషన్‌ లేదా ఇతర కేవైసీ అవసరాల కోసం ఇకపై ఆధార్‌కార్డుకు బదులు ‘వర్చువల్‌ ఐడీ’ని సమర్పిస్తే సరిపోతుంది. ఇది 16 అంకెలుగా ఉంటుంది. ఇది కూడా ఆధార్‌తో సమానమేనని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి వర్చువల్‌ ఐడీని క్రియేట్‌ చేసుకోవచ్చు. జూన్‌ ఒకటి నుంచి అన్ని సంస్థలూ తప్పనిసరిగా దీనిని ఆమోదించాల్సి ఉంటుంది. కాదూ కూడదని ఎవరైనా నిరాకరిస్తే వారిపై చర్యలు ఉంటాయని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో యూఐడీఏఐ హెచ్చరించింది. దీనివల్ల ఆధార్‌ కార్డులోని సమాచారం ఎవ్వరికీ తెలిసే అవకాశం ఉండబోదని భావిస్తోంది. ఈ మధ్య రూ. 500లకే ఆధార్‌ వివరాలు బహిర్గతం అని వార్తలు రావడంతో కలకలం రేగింది. అలాంటి అవకాశం లేదని యూఐడీఏఐ స్పష్టం చేసినా...భద్రతా కారణాల రీత్యా వర్చువల్‌ ఐడీని తీసుకొచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కేవైసీ విధానంలో ఎవరికి ఎంత సమాచారం అవసరమో అంతే తెలిసేలా కొత్త విధానం ఉంటుందని వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 119 కోట్ల మందికి ఆధార్‌కార్డులు జారీ అయ్యాయి. వీరంతా వర్చువల్‌ ఐడీ కోసం కుస్తీ పట్టాల్సి ఉంటుంది.

వర్చువల్‌ ఐడీ ఎలా?

యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఒక వ్యక్తి ఎన్ని వర్చువల్‌ ఐడీలనైనా క్రియేట్‌ చేసుకోవచ్చు. దీనిద్వారా వ్యక్తి పేరు, ఫొటో, చిరునామా మాత్రమే కనిపిస్తాయి. అదే ఆధార్‌ అయితే మొత్తం వివరాలు తెలిసిపోతాయి. ఒకసారి వర్చువల్‌ ఐడీ సంపాదిస్తే అది నిర్దేశిత కాలం వరకూ ఉంటుంది. కాదూ మార్చుకోవాలని భావిస్తే పాత ఐడీ పోతుంది. ఇలా ఒక వ్యక్తి ఎన్నిసార్లు అయినా వర్చువల్‌ ఐడీలను పొందవచ్చు. కాకపోతే చివరిసారిగా అతను సంపాదించిన ఐడీయే మనుగడలో ఉంటుంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై ఇప్పటికే అధీకృత ఆధార్‌ సెంటర్‌లకు ఆదేశాలిచ్చారు.

Related Posts