YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

స్వైన్ సైరన్

 స్వైన్ సైరన్
స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల్లో  హెచ్‌1ఎన్‌1 కేసులు 82 నమోదయ్యాయి. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన బాధితులు  ఎనిమిది మంది ఉన్నారు. బాధితులు హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు కోలుకున్నారు.. ఇద్దరు మృత్యుఒడికి చేరుకొన్నారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ‘ఫ్లూ’ విస్తరించకుండా అధికారులు వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. గత నెల రోజుల్లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 
ఐదుగురు, కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు స్వైన్‌ఫ్లూ బారినపడి చికిత్స  పొంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇక రెండు వారాల క్రితం కమ్మర్‌పల్లి మండలానికి చెందిన ఓ యువకుడు  చికిత్స పొందుతూ మృతి చెందగా.. వారం క్రితం కోటగిరి మండలానికి చెందిన ఓ మహిళ ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఇటీవలే కన్నుమూసింది.. చలికాలం కావడంతో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని నెల క్రితమే వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను అప్రమతం చేశారు.
స్వైన్‌ఫ్లూతో ఇప్పటికే ఇద్దరు చనిపోవడంతో వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై దృష్టి సారించారు. వారి కుటుంబీకులకు, చుట్టుపక్కల వారికి వ్యాధి బారిన పడకుండా ఫ్లూవీర్‌ మాత్రలను అందజేశారు. ప్రస్తుతానికి మృతుల కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఉభయ జిల్లాలకు అవసరమైన స్వైన్‌ఫ్లూ మాత్రలు, ద్రావణాలు అందుబాటులో ఉంచినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 1500 ప్లూవీర్‌ మాత్రలు, చిన్నపిల్లలకు ప్లూవీర్‌ ద్రావణాలను,  కామారెడ్డిలో 1000 ఫ్లూవీర్‌ మాత్రలు, సిరప్‌లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాల్లో సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శీతకాలం ప్రారంభం కావడంతో స్వైన్‌ఫ్లూ కారక హెచ్‌1ఎన్‌1 వైరస్‌ ఉద్ధృతికి అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. కానీ వ్యాధి బారిన పడ్డవారికి ఆక్సిజన్‌, వెంటిలేటర్లు మెరుగైన వైద్యం అందించాల్సి ఉంటుంది. కానీ ఉభయ జిల్లాల్లోని ఆసుపత్రుల్లో ఈ సౌకర్యాలు లేవు. వ్యాధి ప్రబలితే రోగులను హైదరాబాద్‌కు పంపాల్సిందే. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ద్రవ ఆక్సిజన్‌ సిలిండర్‌ ఏర్పాటు చేసి రెండు నెలలు గడిచినా నేటికి ప్రారంభానికి నోచుకోలేదు.

Related Posts