YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

క్రికెట్ కు గౌతీ గుడ్ బై.. భావోద్వేగానికి గురైన గంభీర్..!!

క్రికెట్ కు గౌతీ గుడ్ బై..  భావోద్వేగానికి గురైన గంభీర్..!!
మాజీ ఓపెనర్, వరల్డ్ కప్ హీరో గౌతం గంభీర్‌. అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెబుతూ అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపై ఏ ఫార్మాట్‌లోనూ కొనసాగనని గౌతీ స్పష్టం చేశాడు. మంగళవారం (డిసెంబర్ 4) రాత్రి తన ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల్లో ఓ వీడియో పోస్టు చేశారు. టీమిండియాకు మళ్లీ ఆడాలనే తన కల, రిటైర్మెంట్ నిర్ణయానికి దారి తీసిన 
పరిస్థితులను గురించి వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. కంటతడి పెట్టించే ఆ వివరాలు గంభీర్ మాటల్లోనే.. మీ అందరితో నేనో ఆలోచన పంచుకోవాలనుకుంటున్నా.. ఎన్నో పగళ్లు రాత్రుళ్లు ఈ ఆలోచన నాతో ఉంది. నన్ను వెంటాడుతోంది. ఎక్కడికెళ్లినా ఓ అదనపు బరువులా నాతో ప్రయాణించింది. ప్రాక్టీస్ చేస్తున్నా.. ఆడుతున్నా.. భోజనం చేస్తున్నా.. మైదానంలో, డ్రెస్సింగ్‌ రూమ్‌లో, ఇంట్లో అన్నింటా నాతోనే ఉంది. నెట్స్‌లో నాకు బంతులు విసిరే బౌలర్‌లా వెంటాడింది. చివరికి నా భోజనాన్ని కూడా భయంకరంగా మార్చేసింది. టీమిండియా, కేకేఆర్‌, ఢిల్లీ డేర్ డెవిల్స్ దేనికి ఆడినా.. ఈ ఆలోచన నాతో ప్రయాణించింది. ప్రతిసారీ గౌతీ నీ ఆట ముగిసిందని చెప్పింది. 2014 ఐపీఎల్‌లో వరసగా 3 సార్లు డకౌటైనప్పుడు నా చెంప చెళ్లుమనిపించింది. అదే ఏడాది ఇంగ్లాండ్‌ పర్యటనలో, మళ్లీ 2016లో కష్టాల్లో పడిపోయా. రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌ టెస్టులో నన్ను తప్పించారు. అప్పుడు నా ఆత్మవిశ్వాసాన్ని వెతుక్కుంటూ వెళ్లా. గౌతీ నీ పనైపోయిందని అభిమానుల అరుపుల్లో విన్నా. కానీ, నా ఆట ముగియలేదని గట్టిగా ప్రతిఘటించా. నా శరీరాన్ని మళ్లీ తీవ్రంగా కష్టపెట్టా. నా అంతరాత్మ అరిచినప్పుడు నాపై నాకే కోపం వచ్చింది. దివాళా తీసినట్టు అనిపించింది. అలాంటి కష్ట సమయాల్లో మీ ఆదరాభిమానాలే నన్ను తట్టి లేపాయి.
మళ్లీ గెలవాలనుకున్నా..పట్టుసాధించాలనుకున్నా..2017 రంజీ సీజన్‌లో బాగా పరుగులు చేసిన తర్వాత నాకిష్టమైన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఎంతో ఆత్మవిశ్వాసంతో వచ్చా. అప్పుడు నా ఆట బాగుందనిపించింది. ‘గౌతీ నీ ఆట ముగిసింది’ అనే అరుపులు ఉండవనుకున్నా. అయితే అది తప్పని తేలింది. ఢిల్లీ తరఫున వరసగా 6 మ్యాచుల్లో నా ప్రదర్శన బాలేదు. ఈసారి ఆ వ్యతిరేక అరుపులు మరింత బిగ్గరగా వినిపించాయి. ఇక నిజంగానే నా సమయం ముగిసిందని అప్పుడే అనుకున్నా. 15 ఏళ్లకు పైగా క్రికెట్‌లో ఉన్నా. దేశానికి ప్రాతినిథ్యం వహించా. ఇక ఈ అందమైన ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. ఎన్నో భయాలు, బాధలు, కష్టాలు, నొప్పులున్నా.. దేశం తరఫున మళ్లీ మళ్లీ ఆడాలనుకున్నా. సెంచరీలు చేయాలనే కోరికలు నెరవేరుతాయని ఆశించా. రెండు ప్రపంచకప్‌ టోర్నీలు, రెండు కీలక ఫైనల్ మ్యాచ్‌లలో టాప్‌ స్కోరర్‌గా నిలిచా. నా కలలు నెరవేరాయి. అవును.. మీ అందరి కోసం ప్రపంచకప్‌ గెలవాలన్న నా కల నెరవేరింది. నా కథ ఎవరో రాస్తున్నారని నేనెప్పుడూ అనుకునేవాణ్ని. ప్రస్తుతం ఆ కథకుడి కలంలో సిరా అయిపోయిందేమో! ఆయన ఎన్నో అద్భుతమైన అంశాలను రాశారు. అందులో ఒకటి భారత్‌ టెస్టుల్లో నంబర్‌వన్‌ జట్టుగా అవతరించడం. ఐసీసీ 2009 టెస్టు బ్యాట్స్‌మన్‌ ట్రోఫీని చూసినప్పుడల్లా నాకు ఎంతో ఉద్వేగం కలుగుతుంది. న్యూజిలాండ్‌లో చారిత్రక సిరీస్‌ విజయం, ఆస్ట్రేలియాలో సీబీ సిరీస్‌ విజయం తలచుకున్నప్పుడల్లా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు నాకెంతో సంతృప్తి ఉంది. నా ప్రయణంలో ఎన్నో అర్థవంతమైన భాగస్వామ్యాలు ఉన్నాయి. అవి మీతోనే. అభిమానులతోనే. మీరే భారత్‌కు నిజమైన మద్దతుదారులు. అందుకే మిమ్మల్ని భాగస్వాములుగా పిలుస్తా. అసలైన క్రికెటర్లను మీరే తయారుచేశారు. మీరు లేకుంటే భారత క్రికెట్‌కు దేహం లేనట్టే. నా కుటుంబం నాకు అండగా నిలిచింది. నేను ఆడేటప్పుడు నాన్న నా ఆటను చూసేవారు కాదు, ఎంతో ఒత్తిడిచెందే వారని ఆయన స్నేహితులు చెబితే విన్నా.నాన్నా మీరికి రిలాక్స్ అవండి. నాకంతా అమ్మే. అమ్మా.. నన్ను క్షమించు. అమ్మకు కృతజ్ఞతలు. నా భార్యకు ధన్యవాదాలు. నా సుఖాల్లో కంటే కష్టాల్లోనే ఆమె నాతో ఎక్కువగా ఉంది. నా కోల్‌కతా భాగస్వాములకు ప్రత్యేక అభినందనలు.. నా ప్రేమ ఎప్పటికీ వారితో కొనసాగుతుంది. బీసీసీఐ, క్యూరేటర్లు, మైదానం సిబ్బంది, డ్రెస్సింగ్‌ రూమ్‌ సహాయకులకు ధన్యవాదాలు. నన్ను మెరుగైన బ్యాట్స్‌మన్‌గా రూపొందించిన నెట్స్‌ బౌలర్లకు ధన్యవాదాలు. నా కోచ్‌ సంజయ్‌ భరద్వాజ్‌ నా వెలుగునీడల్లో నా వెన్నంటే ఉన్నారు. గురువుగారూ.. నేను మిమ్మల్ని గర్వపడేలా చేశానో లేదో తెలియదు గానీ నా శక్తివంచన లేకుండా కృషి చేశానని భావిస్తున్నా.. అందరికీ ధన్యవాదాలు.

Related Posts