YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అటకెక్కిన వివేకా కేసు

అటకెక్కిన వివేకా కేసు

కడప, జూలై 23, 
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరుగుతోంది? ఎటువంటి పురోగతి లేదు ఎందుకు? ఇంకా ఈ కేసు కొలిక్కి తేవాలంటే సిబిఐ కి ఎన్ని రోజులు పడుతుంది? తెర వెనుక ఏం జరుగుతోంది? రాజకీయ కోణంలోనే జాప్యం జరుగుతోందా? లేకుంటే పరోక్ష శక్తులు ఆటంకాలు చేస్తున్నాయా? ఇప్పుడు అన్ని వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. నిన్ననే సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పై విచారణ జరిగింది. ఆ సమయంలో సుప్రీంకోర్టు మూడు అంశాలను తెరపైకి తెచ్చింది. అసలు సిబిఐ ఇంకా విచారణ చేపట్టాల్సి ఉందా? అనే ప్రశ్న వేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియడంతో ఈ ప్రశ్న వేసింది.అయితే వైసిపి ప్రభుత్వ హయాంలో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం సహకరించలేదన్నది అప్పట్లో వచ్చిన ఆరోపణ. తిరిగి దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులను భయపెట్టే పరిస్థితులు ఉండేవని అప్పట్లో టిడిపి అనుకూల మీడియా వార్తలు ప్రచురించింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. కానీ కనీస స్థాయిలో వివేకానంద రెడ్డి హత్య కేసు ముందుకు సాగడం లేదు. దీనిని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారా? లేకుంటే 2029 ఎన్నికల సమయానికి మరింత బిగుసుకునేలా కేసు తెరపైకి తేనున్నారా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. అయితే అప్పుడు టిడిపి అధికారంలో ఉంది. సిఐడి విచారణకు ఆదేశించింది చంద్రబాబు సర్కార్. అయితే సిఐడి కాదని.. సిబిఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. దీంతో సిబిఐ విచారణ ప్రారంభించింది. ఆ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య అంశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రయోజనం చేకూర్చింది. సానుభూతి వర్కౌట్ అయింది. జగన్ అధికారంలోకి వచ్చారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు అవసరం లేదని తేల్చి చెప్పారు. దీంతో వివేక కుమార్తె సునీత రంగంలోకి దిగారు. న్యాయ పోరాటం చేయడంతో సిబిఐ విచారణ కొనసాగింది. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ, నిందితుల నుంచి దర్యాప్తు అధికారులకు బెదిరింపులు వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేయిస్తామని.. నిందితులకు శిక్ష పడేలా చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఈ కేసు విచారణలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు.ప్రస్తుతం వివేకానంద రెడ్డి కుమార్తె సునీత గట్టిగానే పోరాటం చేస్తున్నారు. తన తండ్రిని చంపిన నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు హోంమంత్రి అనిత తో పాటు బిజెపిని కూడా కలిశారు. కానీ ఆ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి చర్యలు ప్రారంభం కాలేదు. దీంతో వివేకానంద రెడ్డి హత్య కేసు వెనుక ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అయితే తప్పకుండా దీనిపై చర్యలు ఉంటాయని.. అదును చూసి కూటమి ప్రభుత్వం దెబ్బ కొడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ పని ఎప్పుడు జరుగుతుందో చూడాలి.

Related Posts