YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చావు తప్పి కళ్ళు లొట్ట బోయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధులందరికి పరాభవం

చావు తప్పి కళ్ళు లొట్ట బోయిన  కాంగ్రెస్     ముఖ్యమంత్రి అభ్యర్ధులందరికి పరాభవం
 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు గట్టి షాక్‌నిచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్‌ అగ్రనేతలుగా పేరొందిన పలువురు ఈసారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న పలువురు నేతలు సైతం సొంత నియోజకవర్గాల్లో పరాభవం ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ దిగ్గజాలుగా పేరొందిన గత సీఎల్పీ మాజీ నేత, మాజీ హోంమంత్రి జానారెడ్డి, ఇటీవల టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి.. ప్రచారంలో పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా వెలుగొందిన ఫైర్‌బ్రాండ్‌ రేవంత్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ, పరాజయమే ఎరుగని సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి తదితరులు ఓటమిపాలయ్యారు. అలాగే మాజీ మంత్రి, నల్లగొండ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఓటమి పాలైనారు.. అగ్రనేతలంతా భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడం కాంగ్రెస్‌ పార్టీని కలవరపరిచే అంశం. గెలుస్తారనుకున్న షబ్బీర్‌ అలీ, సర్వే సత్యనారాయణ.. తదితరులు ఓటమి దిశగా సాగుతుండటం, పలువురు ఓటమి పాలు కావడం కాంగ్రెస్‌ పార్టీని దిగ్భ్రాంతపరుస్తోంది.హఠాత్తుగా వచ్చిన ముందస్తు ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ, టీజేఎస్, సీపీఎం తదితర పార్టీలతో మహాకూటమిగా ఏర్పడి.. ఎన్నికల్లోకి వెళ్లినప్పటికీ.. ఫలితాల్లో మాత్రం ఆ పార్టీ తీవ్ర నిరాశే ఎదురైంది. మహాకూటమి ఏమోగానీ, చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్‌ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. గెలుస్తాయనుకున్న సీనియర్‌ నేతల స్థానాలు సైతం కారు ప్రభంజనంలో కొట్టుకుపోయాయి. వరుసగా గెలుస్తూ వస్తూ.. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న పలువురు నేతలు సైతం సొంత నియోజకవర్గాల్లోనే గల్లంతు అయ్యారు.కాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలను వారి సొంత నియోజకవర్గంలో ఓడించడానికి టీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహంతో వెళ్లింది. హస్తం సీనియర్‌ నేతల నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ అంటేనే ఒంటికాలితో లేచే నేతలను టార్గెట్‌ చేసింది. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ, జానారెడ్డి, జీవన్‌రెడ్డి తదితర నేతలను ఓడించేందుకు అత్యంత పటిష్టమైన వ్యూహాలతో వెళ్లింది. మొత్తానికి కాంగ్రెస్‌ అగ్రనేతలను ఓడించాలన్న గులాబీ అధినేత కేసీఆర్‌ వ్యూహం పూర్తిగా ఫలించినట్టు కనిపిస్తోంది. జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సిహా, జీవన్‌రెడ్డి వంటి హేమాహేమీలే కాదు..దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల  ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలో సత్తా చాటిన కాంగ్రెస్‌.. తెలంగాణలో మాత్రం ఘోరంగా చతికిలపడింది.  

Related Posts