YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

మొండి బాకీలపై ఆర్.బి.ఐ ఉక్కుపాదం

మొండి బాకీలపై ఆర్.బి.ఐ ఉక్కుపాదం

- జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జె.ఎల్.ఎఫ్)ను రద్దు 

- 'సరి' కొత్త వ్యవస్థకు రూపకల్పన 

మొండి బాకీల సత్వర పరిష్కారానికి, ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్స్రీ కోడ్ (ఐ.బి.సి)లో నిర్దేశించిన నిబంధనలతో ఇప్పుడున్న మార్గదర్శక సూత్రాలను సంలీనం చేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ) సవరించిన చట్రాన్ని సోమవారం విడుదల చేసింది. స్ట్రెస్సడ్ ఆస్తులను త్వరగా గుర్తించి, నివేదించడానికి ఈ కొత్త మార్గదర్శక సూత్రాలు నిర్దిష్ట చట్రాన్ని కలిగి ఉన్నాయి. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్స్రీ కోడ్ 2016 చట్టాన్ని తీసుకొచ్చిన దృష్ట్యా, చితికిన ఆస్తుల పరిష్కారానికి ప్రస్తుత మార్గదర్శక సూత్రాల స్థానంలో స్నేహపూర్వకమైన, సులభతరమైన జనరిక్ చట్రాన్ని తీసుకురావాలని నిర్ణయించాం’’ అని ఆర్.బి.ఐ సోమవారం పొద్దుపోయాక జారీ చేసిన ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. స్ట్రెస్సడ్ ఖాతాల పరిష్కారానికి సంస్థాగత యంత్రాంగంగా ఉన్న జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జె.ఎల్.ఎఫ్)ను రద్దు చేయాలని ఆర్.బి.ఐ నిర్ణయించింది. ఏవైనా పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలుపరచకపోతే వాటికి చెందిన అన్ని ఖాతాలు కూడా సవరించిన చట్ర పాలన పరిధిలోకే వస్తాయని నోటిఫికేషన్ వెల్లడించింది. 
సవరించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం, రుణ ఖాతాలలో ప్రారంభ దశలో ఉన్న ఒత్తిడిని, వాయిదా మొత్తాన్ని ఎగవేయగానే గుర్తించాల్సి ఉంటుంది. ఎన్ని విడతలు బకాయిలు కట్టలేకపోయారో ఆ కాలాన్ని ఆధారం చేసుకుని, చితికిపోయిన ఆస్తులను వర్గీకరించుకోవాలి. ఈ చట్రం కింద చితికిన ఆస్తుల పరిష్కారానికి బోర్డు ఆమోదించిన విధానాలన్నింటినీ రుణ దాతలైన బ్యాంకులన్నీ అమలులోకి తేవాలి. పరిష్కారానికి గడువులు విధించాలని ఆ నోటిఫికేషన్ కోరింది. ‘‘రుణగ్రస్తుని సంస్థ ఖాతాలో ఏ బ్యాంకుకైనా సరే ఎగవేత కనిపించిన వెంటనే, రుణ దాతలైన బ్యాంకులన్నీ -ఒంటరిగానైనా సరే లేదా సంయుక్తంగానైనా-ఆ ఎగవేతను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలి’’ అని నోటిఫికేషన్  సూచించింది.
 
పరిష్కార ప్రణాళికలో ఏ విధమైన చర్యైలెనా/ప్రణాళికలైనా/పునర్నిర్మాణమైనా ఉండవచ్చునని ఆర్.బి.ఐ తెలిపింది. రుణ గ్రహీత సంస్థ బకాయిలన్నింటినీ చెల్లించగానే ఖాతాను క్రమబద్ధం చేసే పనికే రుణ దాత అయిన బ్యాంకు పరిమితం కాకూడదని పేర్కొంది. ఏ సంస్థలకని అప్పు తీసుకున్నారో వాటిని బకాయిపడగానే బ్యాంకులు ఇతర సంస్థలకు/పెట్టుబడిదార్లకు అమ్మేయవచ్చు. యాజమాన్యంలో మార్పు తీసుకురావచ్చు లేదా యాజమాన్యాన్ని పునర్నిర్మించవచ్చు. చితికిన ఆస్తుల పరిష్కారానికి సవరించిన చట్రం కాలబద్ధ ప్రణాళికలు నిర్దేశించింది. పెద్ద ఖాతాలకు సంబంధించి పరిష్కార ప్రణాళికను నిర్దేశించిన గడువుల లోపల అమలుపరచలేకపోతే, రుణ దాతలైన బ్యాంకులు 2016 ఐ.బి.సి కింద, నిర్దేశిత గడువు ముగిసిన 15 రోజుల లోపల, ఒంటరిగా లేదా సంయుక్తంగా, దివాలా దరఖాస్తు దాఖలు చేయవలసి ఉంటుంది. పెద్ద ఖాతాలపై కేంద్ర సమాచార భాండాగారానికి (సి.ఆర్.ఐ.ఎల్.సికి) బ్యాంకులన్నీ అప్పుల వివరాలు సమర్పించాలి. నెలవారీ ప్రాతిపదికపై ఆర్.బి.ఐకి ప్రధాన నివేదిక సమర్పించాలి. ఈ విధానం 2018 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. 
అంతేకాకుండా, (రూ. 5 కోట్లు అంతకుమించి) రుణాలు ఎగవేసిన రుణగ్రస్త సంస్థల గురించి వారం వారం సి.ఆర్.ఐ.ఎల్.సికి బ్యాంకులు తెలియజేయాలి. ప్రతి శుక్రవారం పని వేళలు ముగిసే సమయానికి ఈ వారాంతపు నివేదికను పంపాలి. ఒకవేళ శుక్రవారం సెలవు రోజైతే, దానికి ముందు పనిరోజునాడే నివేదిక పంపాలి. అటువంటి మొదటి వార నివేదికను 2018 ఫిబ్రవరి 23తో ముగుస్తున్న వారానికి అందజేయాలి. ఐ.బి.సిలో నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా మార్గదర్శక సూత్రాలను అనువుగా రూపొందించే ఉద్దేశంతో ఈ పని చేసినట్లు ఆర్.బి.ఐ తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థలోని మొండి బాకీల పరిష్కారానికి ఇప్పుడున్న యంత్రాంగాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. స్ట్రెస్సడ్ అసెట్లను సత్వరం గుర్తించి, నివేదించడానికి నూతన మార్గదర్శక సూత్రాల్లో నిర్దిష్ట వ్యవస్థ ఉంది. 

Related Posts