YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చెరువులతోనే గుత్ప, అలీసాగర్ నుంచి నీళ్లు

చెరువులతోనే గుత్ప, అలీసాగర్ నుంచి నీళ్లు
రబీ సీజన్‌లో గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల కింద పంటలు సాగు చేద్దామని భావించిన రైతాంగానికి ప్రభుత్వ నిర్ణయం ఆశనిపాతంలా మారింది. ఇదివరకటి తరహాలోనే ఈసారి కూడా పంటలకు ఈ లిఫ్టుల ద్వారా సాగునీటిని సమకూరుస్తారని ఆశిస్తూ, పంటలు విత్తేందుకు అన్నదాతలు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న తరుణంలో, ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదని ప్రభుత్వం కరాఖండీగా తేల్చి చెబుతూ చేతులెత్తేసింది. గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల నీటిని కేవలం చెరువులు నింపుకునేందుకు మాత్రమే వదలడం జరుగుతుందని స్పష్టం చేశారు. అది కూడా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిని పాటిస్తూ ఈ నెల 5 నుండి ఫిబ్రవరి 16వ తేదీ వరకు మూడు విడతల్లో రెండు టీఎంసీల వరకు నీటిని విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందించారు. నిజానికి గత నెల 14వ తేదీన రాష్ట్ర రాజధానిలో జరిగిన శివం కమిటీలో అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ద్వారా కూడా ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇరిగేషన్ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించగా, ఆయకట్టు పంటలకు నీరందించే వెసులుబాటు లేనందున కేవలం చెరువులు నింపేందుకే విడుదల చేయాలని అనుమతించింది. శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లో తగినంత నీటి నిల్వలు లేని కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు. 1091 అడుగులు, 90టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఎస్సారెస్పీలో ప్రస్తుతం 1071.80, 32టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ అరకొర మిగులు జలాల నుండే ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగు జలాలు అందించడంతో పాటు, మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి అవసరాల కోసం దాదాపు 6 టీఎంసీల వరకు నీటిని అట్టి పెట్టాల్సి వస్తోంది. మరో ఐదు టీఎంసీలను డెడ్‌స్టోరేజీగా పరిగణిస్తారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టు పంటలకు నీరందించే పరిస్థితి ఉండదని అంచనాకు వచ్చిన ప్రభుత్వం, కేవలం చెరువులను నింపేందుకు మాత్రమే నీటిని విడుదల చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో చెరువుల కింద పంట భూములు కలిగి ఉన్న కొద్దిమంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరనుండగా, మిగతా వేలాది ఎకరాల భూములు పడావుగానే మిగిలిపోయే దైన్య పరిస్థితి నెలకొంది. ఈ రెండు ఎత్తిపోతల పథకాల కింద సుమారు లక్ష ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ఇదివరకు ఇది నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధి కిందే ఉండేది. అయితే నిజాంసాగర్ నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పడిపోయి 17.8టీఎంసీలకే పరిమితం అవడం, అది కూడా ఈ జలాశయం పూర్తిస్థాయిలో నిండని కారణంగా ఆయకట్టు విస్తీర్ణం అంతకంతకూ పడిపోతూ 2లక్షల ఎకరాలకే పరిమితమైంది. నిజాంసాగర్ ఆయకట్టును స్థిరీకరించాలనే ఉద్దేశ్యంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ తీరంలో గోదావరి నదిని ఆనుకుని అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఈ లిఫ్టులు అందుబాటులోకి వచ్చిన నాటి నుండి ప్రతీసారి ఖరీఫ్‌లో, అప్పుడప్పుడూ రబీలో కొద్దోగొప్పో ఆయకట్టు పంటలకు నీటిని అందిస్తూ వస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో మాత్రం ఎస్సారెస్పీలో నీటి నిల్వలు గణనీయంగా దిగువకు పడిపోవడంతో నీటి లభ్యత లేదనే సాకుతో ప్రభుత్వం పై రెండు లిఫ్టుల ద్వారా కేవలం చెరువులను నింపేందుకు నీరు విడుదల చేయాలని నిర్ణయించింది

Related Posts