YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

లోకసభకు కేసీఆర్ సలహాదారుడు రాజీవ్ శర్మ..?

లోకసభకు కేసీఆర్ సలహాదారుడు రాజీవ్ శర్మ..?
లోక్‌సభకు పోటీ చేసేందుకు గులాబీ నేతలు పోటీపడుతున్నారు. పలువురు సిట్టింగులకు ఈ దఫా ఉద్వాసన తప్పదని తేలడంతో ఆయా స్థానాల మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహా దారుగా ఉన్న మాజీ సీఎస్‌ డాక్టర్‌ రాజీవ్‌శర్మ.. త్వరలోనే రాజకీయ నాయకుడి అవతారం ఎత్తబోతున్నారా..? ఆయన్ను పార్లమెంటు బరిలో దింపేందుకు సీఎం కేసీఆర్‌ యోచిస్తు న్నారా..? అంటే అవుననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. సామాజిక సమీకరణాలతోపాటు విద్యాధికులు అధికంగా ఉండే మల్కాజిగిరి నుంచి రాజీవ్‌ శర్మను పోటీకి దించితే గెలుపు సునాయసమవుతుందని సీఎం భావిస్తున్నట్టు వినికిడి. సీనియర్‌ ఐఏఎస్‌ అయిన ఆయన.. గతంలో కేంద్ర ప్రభు త్వంలో పనిచేశారు. ఆయనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు.. పార్టీకి బాగా ఉపయోగపడతాయని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. ఈ విధంగా ఒకవైపు టీఆర్‌ఎస్‌ అధినేత.. ఎంపీ సీట్లపై లెక్కలేసుకుంటుంటే, మరోవైపు పార్లమెంటు బరిలోకి దిగేందుకు ఆ పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నది.సిట్టింగుల్లో అత్యధిక మందికి సీట్లు ఇస్తామంటూ కేసీఆర్‌ చెబుతున్నప్పటికీ.. కనీసం ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చనున్నారని తెలిసింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ మారడంతో అక్కడ కొత్త వారిని బరిలో దింపనున్నారు. ఈ క్రమంలో మండలి చైర్మెన్‌ స్వామిగౌడ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం మరో రెణ్నెల్లలో ముగియనుంది. దీంతో చేవెళ్లకు స్థానికుడైన స్వామిగౌడ్‌ను అక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశముంది. పంచాయతీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం కుదించిన నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్న బీసీలను మచ్చిక చేసుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని గులాబీ బాస్‌ భావిస్తున్నారు. అయితే ఇదే టికెట్‌ కోసం మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి సైతం ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని తెలిసింది. తాండూరు నుంచి ఓటమి పాలైన ఆయన.. ఈసారి ఎంపీగా గెలవటం ద్వారా తన సత్తా చాటాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి.. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో అక్కడి నుంచి రాజీవ్‌శర్మను బరిలోకి దింపేందుకు కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఇదే సీటుపై కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి కూడా ఆశలు పెట్టుకున్నారు. దీంతో వారు సీఎం దృష్టిలో పడేందుకు తహతహలాడుతున్నారు. ఫిబ్రవరిలో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యుల్‌ విడుదల కానుందన్న వార్తల నేపథ్యంలో వారు ఇప్పటి నుంచే అలర్ట్‌ అవుతున్నారు. టికెట్లు దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలను మొదలుపెట్టారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రముఖులతోపాటు చివరి నిమిషంలో టికెట్లు దక్కని వారు సైతం పార్లమెంటుకు పోటి చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఉప్పల్‌ ఎమ్మెల్యే సీటును ఆశించి భంగపడ్డ హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మెహన్‌ సైతం మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ద్వారా టికెట్‌ దక్కించుకోవచ్చన్న ఆశతో ఆయన ఉన్నారు. 
దీంతోపాటు పెద్దపల్లి స్థానానికి తీవ్ర పోటీ నెలకొన్నట్టు తెలిసింది. చెన్నురు నుంచి ఎమ్మెల్యేగా బాల్క సుమన్‌ ఎన్నిక కావడంతో ఆ సీటు మాజీ ఎంపీ వివేక్‌కు దక్కడం ఖాయమని అందరూ భావించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివేక్‌ పలు నియెజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులకు వ్యతిరేకంగా పనిచేశారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆయనకు కాకుండా మరొకరికి టికెట్‌ కేటాయిస్తారనే ప్రచారం ఊపందుకున్నది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఇక్కడి నుంచి బరిలో దింపొచ్చనే టాక్‌ వినబడుతున్నది. ఆయనతోపాటు బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌గా ఉన్న మల్లేపల్లి లక్ష్మయ్య, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మెన్‌గా ఉన్న ఘంటా చక్రపాణి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. వీరుగాకుండా చివరి నిమిషంలో కొత్త పేర్లు తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ దఫా టికెట్‌ దక్కకపోవచ్చు. మొన్నటి ఎన్నికల్లో ఆ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఘోర ఓటమికి పొంగులేటే కారణమంటూ పార్టీ అభ్యర్ధులంతా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అయితే పొంగులేటి మాత్రం ...కేటీఆర్‌ ద్వారా టికెట్‌ దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఆయనకు టికెట్‌ ఇవ్వకపోతే.. మాజీ మంత్రి తుమ్మలగానీ, జలగం కుటుంబ సభ్యుల్లోంచి ఒకరికిగానీ టికెట్‌ దక్కే అవకాశాలున్నాయి. ఇక మహబూబ్‌నగర్‌ ఎంపీ జితెందర్‌రెడ్డి పరిస్థితి కూడా ఇదే మాదిరిగా ఉంది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల ఓటమికి ఆయనే కారణమనే వాదనలు వినపడుతున్నాయి. అందువల్ల ఈసారి జితేందర్‌కు టికెట్‌ కష్టమనే ప్రచారం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశమున్న దరిమిలా సదరు నేతకు టికెట్‌ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి అంశాలన్నింటిపై క్లారిటీ రావాలంటే మరింత సమయం పడుతుందటున్నారు విశ్లేషకులు.

Related Posts