YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా ఆంధ్ర ప్రదేశ్

‘బరి’ తెగించారు..

‘బరి’ తెగించారు..

మురమళ్లలో తిరునాళ్లను తలపించిన కోడిపందేలు

కోడి పందేలను తిలకించి ఎంజాయ్ చేసిన సినీరాజకీయ ప్రముఖులు వీళ్లే!

 సంక్రాంతి పండుగ ముసుగులో పందెపురాయుళ్లు ‘బరి’తెగించి మరీ రెచ్చిపోయారు. కోడిపందేలను అడ్డుకుంటామన్న పోలీసు అధికారుల హెచ్చరికలు గాలిలో కలిసిపోవడంతో మూడ్రోజులపాటు కోడిపందేలు, గుండాట, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగాయి. ఇక మురమళ్లలో జరిగిన కోడిపందేలు, గుండాట వంటి అసాంఘిక కార్యక్రమాలు తిరునాళ్లను తలపించాయి.

తెలుగు రాష్ట్రాల నలుమూలలనుంచి రాజకీయ నాయకులు, జనం తరలిరావడంతో మురమళ్ల కిక్కిరిసింది. సంక్రాంతి పండుగ ముసుగులో జరిగిన అసాంఘిక కార్యక్రమాల పేరిట రూ.50కోట్లు పైబడి చేతులు మారిందని అంచనా వేస్తున్నారు. ఐ.పోలవరం మండలం మురమళ్లలో జరిగిన కోడిపందేల్లో ఎటుచూసినా నోట్లు కట్టలే దర్శనమిచ్చాయి. మురమళ్ల ప్రధాన బరికి సంబంధించి మినీస్టేడియంలా తీర్చిదిద్దడంతో అందరూ పందేలను తిలకించారు. ఇక వీఐపీ గ్యాలరీనుంచి ప్రముఖులు, ముఖ్యనాయకులు కోడిపందేలను ఆసక్తిగా వీక్షించారు. ప్రధాన కోడిపందెంబరిలో మొదటిరోజు ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్లు, డ్రోన్‌ కెమెరాలు వంటి అధునాతన సౌకర్యాలు పోలీసు అధికారుల ఆదేశాలతో తర్వాత రెండ్రోజులు తొలగించారు. మురమళ్ల ప్రధాన బరితోపాటు మరో నాలుగు బరుల్లో కోడిపందేలు నిర్వహించారు. మండలంలో కొమరగిరి, పాత ఇంజరం, పెదమడి మొక్కతోట, గుత్తెనదీవి గ్రామాల్లో కోడిపందేలు, గుండాటలు యథేచ్ఛగా సాగాయి.

పందేలను తిలకించిన ప్రముఖులు

మురమళ్లలో జరిగిన కోడిపందేలను పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తిలకించారు. ప్రముఖుల రాకతో మురమళ్లలో సందడి వాతావరణం నెలకొంది. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి తోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త బీహార్‌కు చెందిన పొలమూరి రఘురామకృష్ణంరాజు పందేలను తిలకించారు. మాజీమంత్రి పినిపే విశ్వరూప్‌, మాజీ ఎమ్మెల్యేలు చెల్లి వివేకానంద, కుడుపూడి చిట్టబ్బాయి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావుతోపాటు ద్వితీయశ్రేణి రాజకీయజనం పందేలను తిలకించారు. సినీరంగానికి చెందిన నటీమణి హేమ, నటుడు సమీర్‌కూడా మురమళ్ల కోడిపందెంలో పాల్గొని సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిస్తూ ప్రేక్షకుల్లో జోష్‌ నింపారు. సినీనటి హేమ కోడిపందేలు కాసి హల్‌చల్‌ చేశారు.

జోరుగా గుండాట 

సంక్రాంతి సందర్భంగా గుండాట వంటి జూద క్రీడావినోదం జోరుగా సాగింది. మురమళ్ల కోడిపందేల శిబిరం వద్ద 30వరకు గుండాట బోర్డులు ఏర్పాటుచేయడంతో యువత అటువైపు ఆకర్షితులయ్యారు. మురమళ్లతోపాటు పాత ఇంజరం, కొమరగిరి, పెదమడి మొక్కతోట, గుత్తెనదీవి గ్రామాల్లో పండుగ మూడ్రోజులు జరిగిన గుండాటవల్ల రూ.2కోట్ల మేర చేతులు మారినట్టుగా భావిస్తున్నారు.

ఆహా ఏమిరుచులు

మురమళ్ల కోడిపందేలవద్ద ప్రముఖులకు రుచికరమైన వంటకాలు అందించి అతిథి మర్యాదలు చేశారు. వీఐపీ గ్యాలరీలో ఉన్న ప్రముఖులతోపాటు ముఖ్యమైన నాయకులు కూడా పసందైన మైమరిపించే మాంసాహార రుచులు అందించారు. మటన్‌, చికెన్‌ బిర్యానీతోపాటు హైదరాబాద్‌ ధమ్‌బిర్యానీ, చింతకూర పచ్చిరొయ్యల కర్రీ, నాటుకోడి చికెన్‌ఫ్రై.. వంటి వంటకాలు తయారుచేసి అతిథులకు రుచిచూపించారు. వెండినత్తళ్లు ఫ్రై, రామల పులుసు, సీఫుడ్‌ వంటి ఆహార పదార్థాలు ప్రముఖులకు రుచిచూపించారు. రాగిసంకటి, నాటుకోడిపులుసు ప్రత్యేక హైలెట్‌గా నిలిచాయి. వీఐపీ గ్యాలరీలో పందేలను తిలకిస్తున్నంత సేపు బూరెలు, సున్నుండలు, రవ్వలడ్డూ, పూతరేకు, మామిడితాండ్ర, బెల్లం పోకుండ, గోరుమిటీలు, కొబ్బరి అరిసెలు వంటి వంటకాలు రుచిచూపించి అతిథుల నోరు తీపిచేశారు. పుచ్చకాయ, యాపిల్‌, ద్రాక్ష, కమలాఫలం, జామకాయ వంటి పండ్లు షరామామూలే. కోనసీమలో విరివిగా లభించే కొబ్బరిగుడ్లు, తేగలు వంటి వాటిని నిరంతరంగా అందించారు.

రూ.3వేలనుంచి రూ.6వేలు పలికిన కోస

కోడిపందేలు జరుగుతున్నాయంటే కోసకు ఉండే గిరాకీ అంతా ఇంతా కాదు. పందెంలో తనువు చాలించిన కోడిని కోస అని పిలుస్తారు. కోసమాంసం రుచికరంగా ఉండడంతో దానికోసం రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు ఎగబడుతూ ఉంటారు. ఈ యేడాది కోస రూ.3వేల నుంచి రూ.6వేల వరకు ధర పలికింది. రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారులు కోసను అధిక ధరకు కొనుగోలు చేసి వారికి నచ్చినవారికి పంపిస్తూ ఉంటారు

Related Posts