YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న టెక్‌ ఉద్యోగాల కోత

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న టెక్‌ ఉద్యోగాల కోత

న్యూ దిల్లీ జూలై 3
;ప్రపంచవ్యాప్తంగా టెక్‌ ఉద్యోగాల కోత  కొనసాగుతున్నది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్‌ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను   తొలగిస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా 2019లో మొదలైన ఈ కోతలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి.ఈ ఏడాది కూడా వందలాది కంపెనీలు.. లక్షలాది మంది ఉద్యోగులను తొలగించాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ లాంటి దిగ్గజ కంపెనీలు విడతల వారీగా లేఆఫ్స్‌ ప్రకటించాయి. ఖర్చుల తగ్గింపు, కంపెనీల పునర్‌వ్యవస్థీకరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యాప్తి వంటి కారణాలతో ఈ ఏడాది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా టెక్ ఉద్యోగాలకు కోత పడింది. దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ కూడా నిన్న వేలాది మందిపై వేటు వేసింది. ప్రధానంగా Xbox, గేమింగ్ యూనిట్లలో 9,100 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.
మైక్రోసాఫ్ట్‌లో 9 వేల మందికి ఉద్వాసన
వ్యయ నియంత్రణలో భాగంగా సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 4 శాతానికి తక్కువ కాకుండా తొలగించాలని నిర్ణయించింది. దీంతో సుమారు 9 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ తొలగింపులు Xbox, గేమింగ్ విభాగాల్లో ఉండనున్నాయి. గత 18 నెలల కాలంలో మైక్రోసాఫ్ట్ చేపట్టనున్న నాలుగో అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదే కావొచ్చని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి.కాగా, మైక్రోసాప్ట్‌ ఈ ఏడాది మే నెల మధ్యలో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తమ సిబ్బందిలో మూడు శాతం మందికి లేఆఫ్‌లు ఇచ్చింది. అంటే దాదాపు 6వేల మందిని తొలగించింది. 2023లో 10 వేలమందికి ఉద్వాసన పలికిన అనంతరం ఇదే రెండో అతిపెద్ద తొలగింపు. మేనేజ్‌మెంట్‌ స్థాయిలను తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యమని సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక ఈ ఏడాది జనవరి, జూ‌న్‌ నెలల్లో కూడా పనితీరు ఆధారంగా కొంతమందిని సంస్థ తొలగించిన విషయం తెలిసిందే. డైనమిక్‌ మార్కెట్‌లో పోటీదారుగా నిలవడానికి, కంపెనీ పునర్‌ నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవడానికి కోతలు తప్పడం లేదని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. ‘మార్కెట్‌లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూన్నాం’ అని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.
ఇంటెల్‌లో 20 శాతం కోత
మరోవైపు, చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం వరకు కోత విధించేందుకు సిద్ధమవుతోంది. జూలై మధ్యలో ఈ తొలగింపులు ఉండనున్నట్లు తెలిసింది. చిప్ డిజైన్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు లేఆఫ్స్‌కు ప్రభావితం కానున్నారు. సమర్థతను పెంచి, చిన్న బృందాలతో వేగంగా పనిచేయడమే తమ లక్ష్యమని కంపెనీ నూతన సీఈవో లిప్-బు టాన్ పేర్కొన్నారు. అమెజాన్, గూగుల్, మెటా వంటి ఇతర అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. అమెజాన్ తన బుక్స్, కిండిల్ విభాగాలతో పాటు పలు ఇతర టీమ్‌లలో వందమంది వరకూ ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో మరింత మందిని తొలగించేందుకు అమెజాన్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఖర్చు తగ్గింపు ప్రణాళిలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14,000 మందిని తగ్గించాలని యోచిస్తోంది. అంటే దాదాపు 13 శాతం అన్నమాట.
ఐబీఎమ్‌లో 8 వేల మందిపై వేటు..
టెక్‌ దిగ్గజం ఐబీఎమ్‌ కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను (IBM Layoffs) తొలగించినట్లు సమాచారం. దాదాపు 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలిసింది. లేఆఫ్స్‌కు గురైన వారిలో ఎక్కువ భాగం హెచ్‌ఆర్‌ విభాగం (HR department) నుంచే ఉన్నట్లు తెలిసింది. ఆటోమేషన్ ప్రచారంలో భాగంగా ఐబీఎమ్‌ ఇటీవలే హెచ్‌ఆర్‌ సిబ్బందిలో కొంత భాగాన్ని ఏఐ (AI) వ్యవస్థలతో భర్తీ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 200 మంది స్థానాలను ఏఐతో భర్తీ చేశారు.
ఇన్ఫోసిస్‌లోనూ..
భారత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా అంతర్గత పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన 240 మంది ఎంట్రీ-లెవల్ ఉద్యోగులను తొలగించింది. కొన్ని నెలల క్రితం ఇదే కారణంతో దాదాపు 300 మంది ఫ్రెషర్లను తొలగించడం గమనార్హం. వీరిలో చాలామంది రెండేళ్లకు పైగా నిరీక్షించి 2024 చివర్లో ఉద్యోగంలో చేరినవారే కావడం గమనార్హం. గూగుల్ కూడా తన ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్‌ విభాగాల్లో వందలాది మందిని తొలగించింది. టిక్‌టాక్‌ దాని డబ్లిన్‌ కార్యాలయంలో 300 మందిని (10 శాతం) తొలగించింది. ఇక ఓలా ఎలక్ట్రిక్‌ కూడా ఐదు నెలల్లో దాదాపు వెయ్యి మందిపై వేటు వేసింది. హెచ్‌పీలో 2 వేల మందిని, సేల్స్‌ఫోర్స్‌ వెయ్యి మంది ఉద్యోగులపై వేటు వేశాయి. బ్లూ ఆరిజన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో వెయ్యి మందిని తొలగించింది. సిమెన్స్‌ 5,600 మందిపై వేటు వేసింది.టెక్ కంపెనీలు ఒకవైపు ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ, మరోవైపు ఏఐ సంబంధిత నైపుణ్యాలు ఉన్నవారికి పెద్దపీట వేస్తున్నాయి. చాలా కంపెనీలు ఏఐ, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా తమ కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించుకుంటున్నాయి. దీంతో సాధారణ ఉద్యోగాలకు గండిపడుతోందని, ఏఐ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Related Posts