
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో తెలంగాణలో మహిళలపైన, బాలికలపైన అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు నిత్యకృత్యమయ్యాయని,మహిళలపట్ల రక్షణ చర్యలు తీసుసుకోవాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది.ఈ మేరకు శనివారం రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి కి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ళ శారదనేతృత్వం లో మహిళా నేతలు వినతి పత్రం మర్పించారు.మహిళల రక్షణ విషయం లో పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు బయట తిరగాలన్నా భయాందోళనకు గురి కావాల్సి వస్తుంది. ఇటీవల యాదాద్రి జిల్లా హజీపూర్‌లో మర్రి శ్రీనివాస్ రెడ్డి అనే ఒక ఉన్మాది చేసిన వరస అత్యాచారాలు, హత్యలు తెలంగాణ యావత్తు ఉలిక్కి పడేలా చేసింది. ఎంతోకాలంగా శ్రీనివాస్ రెడ్డి వరసగా చేస్తున్న అఘాయిత్యాల విషయంలో పోలీసులు అప్రమత్తగా ఉండకపోవడంతో చాల దారుణాలు జరిగాయి. ఒక్క హజీపూరే కాదు, రాష్ట్రంలో చాల ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయని పేర్కొన్నారు.బుధవారం నాడు మేము హజీపూర్‌కు వెళ్లి వచ్చాము. అక్కడ మర్రి శ్రీనివాస్ రెడ్డి అఘాయిత్యాలకు ఇంకా కొంతమంది సహకరించారని బాధితులు తెలిపారు. ఇక్కడ పోలీసులు కొంత అప్రమత్తంగా ఉంటే అఘాయిత్యాలకు ఇంత హోరంగా జరిగేది కాదు. కానీ పోలీసులకు ఉన్న పని వత్తిడో, లేక మహిళల సమస్యల పట్ల చిత్తశుద్ది లేకపోవడమో కానీ మహిళల ఫిర్యాదుల విషయంలో చాల నిర్లక్ష్యంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నా ఎలాంటి ముందుడుగు వేయలేదని పేర్కొన్నారు.రాష్ట్రంలో యాదాద్రిలో, ధర్మపురిలో బాలికలను వ్యభిచార గృహాలలో బలవంతంగా చేర్చి వ్యాపారం చేయించిన సంఘటనలు మనం చూశాము. ముక్కు పచ్చలారని బాలికలను బలవంతంగా వ్యభిచార గృహాలలో చేర్చి వారికి స్టెరాయిడ్స్ ఇచ్చి వ్యాపారం చేయించడం ఎంత దారుణం, అలాగే నగరంలోని చుట్టు పక్కల ప్రాంతాలలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలలో మహిళలను అపరహరించి అత్యచారాలు, హత్యలు చేయడం కూడా నిత్యకృత్యం అయింది. ఇలాంటి సంఘటనలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ప్రధానంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, కిడ్నాప్‌లు, హత్యలు, అపహరణల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకొని నేరాలను అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నాము. ప్రేమించలేదని ఉన్మాదులుగా మారి బాలికలపైన పెట్రోల్ పోసి నిప్పు అంటించడం, వేట కోడవళ్ళతో నరికిచంపడం, ఆసిడ్ దాడులు చాల చూశాము. దీంతో రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు కనీస భద్రత, రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో ఇప్పటికైనా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకొని మహిళల భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.