YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

తొలిసారి సర్ గార్‌ఫీల్డ్ సోబెర్స్ ట్రోఫీ కైవసం!

 తొలిసారి సర్ గార్‌ఫీల్డ్ సోబెర్స్ ట్రోఫీ కైవసం!

ఐసీసీ అవార్డులు కొల్లగొట్టిన కోహ్లీ..

2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఐసీసీ అత్యుత్తమ అవార్డు అందుకున్నాడు. టెస్ట్, వన్డే, టీ20లలో విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాడికి ఐసీసీ అందించే సర్ గార్‌ఫీల్డ్ సోబెర్స్ ట్రోఫీని కోహ్లీ తొలిసారి సొంతం చేసుకున్నాడు. గతేడాది ఈ అవార్డును టీమిండియా స్టార్ స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ అందుకున్నాడు. దీంతో పాటు ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును కూడా కోహ్లీ అందుకున్నాడు. ఈ అవార్డు అందుకోవడం కోహ్లీకి ఇది రెండోసారి. గతంలో 2012లో తొలిసారి ఈ అవార్డు అందుకున్నాడు. 2017లో కోహ్లీ చెలరేగిపోయాడు. టెస్ట్, వన్డే, టీ20లలో చెలరేగి ఆడాడు. 76.84 సగటుతో ఆరు సెంచరీలు నమోదు చేశాడు.

టీమిండియా యువ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఐసీసీ టీ20 ఫర్‌ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. గతేడాది బెంగళూరులో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో 25 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ టెస్ట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐసీసీ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక కాగా, ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్ ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. పాక్ ఆటగాడు హసన్ అలీ ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా, దక్షిణాఫ్రికాకు చెందిన మారియిస్ ఎరాస్‌మస్ ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యారు. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికవగా, చతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్‌లకు కూడా చోటు దక్కింది. ఐసీసీ వన్డే జట్టుకు కూడా కోహ్లీనే కెప్టెన్ కాగా, జస్ప్రిత్ బుమ్రాకు చోటు లభించింది.

Related Posts