
గూగుల్ పే ఖాతాలోంచి....రూ. 51 వేలు మాయం
వాసుదేవన్ నాయర్
ఈనాడు, విశాఖపట్నం: విశాఖలోని షీలానగర్‌కు చెందిన నౌకాదళ సివిలియన్ ఉద్యోగి వాసుదేవన్ నాయర్‌కు చెందిన గూగుల్ పే ఖతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 51 వేల నగదు ఉపసంహరించారు. నాయర్ గత ఆదివారం మధ్యాహ్నం స్విగ్గి ద్వారా స్పెషల్ చికెన్ బిరియానీ, ఫ్రైడ్‌రైస్‌కు ఆర్డర్ ఇచ్చారు. ఎన్.ఎ.డి.వద్ద ఉన్న పంజాబీ దాబా నుంచి వాటిని తీసుకురావాలని పేర్కొని రూ. 310 గూగుల్ పే ద్వారా చెల్లించారు. డెలివరీబోయ్ రెండు పార్శిళ్లను వాసుదేవన్‌కు అందించాడు. ఒక ప్యాకెట్‌లో స్పెషల్ చికెన్ బిర్యానీకి బదులుగా సాధారణ అన్నం, గుడ్లు ఉండడంతో వెంటనే పంజాబీ దాబాకు ఫోన్ చేశారు. వారు సమాధానమిస్తూ తాము సరిగానే ఐటమ్స్ ఇచ్చామని, స్విగ్గి బోయ్ ఏమైనా మార్చి ఉంటారేమో కనుక్కోవాలని సూచించారు. వాసుదేవన్ అంతర్జాలంలో శోధించి స్విగ్గి కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. తప్పిదానికి చింతిస్తున్నామని చెప్పి విషయం కనుక్కొని మళ్లీ సమాధానం చెబుతామన్నారు. ఐదు నిమిషాల అనంతరం వాసుదేవన్‌కు ఫోన్ వచ్చింది. తప్పిదం జరిగిన విషయం వాస్తవమేనని అంగీకరించి, ఆ నగదు తిరిగి చెల్లించేస్తామని చెప్పారు. ఒక సంక్షిప్త సందేశం పంపుతామని దాన్ని గూగుల్ పే ఖాతాకు అనుసంధానమై ఉన్న ఫోన్ నెంబరు నుంచి మళ్లీ ఫోన్‌కు ఎస్.ఎం.ఎస్. చేయాలని సూచించారు. నిజమేనని నమ్మిన వాసుదేవన్ అలాగే చేశారు. ఆ తరువాత గంట వ్యవధిలోనే గూగుల్ ఖాతాతో అనుసంధానమై ఉన్న సిండికేట్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 20 వేలు ఒకసారి, రెండోసారి మరో రూ. 20 వేలు, ఆ తరువాత మరో రూ. 5 వేలు చత్తీస్‌గఢ్‌లో ఉన్న ఓ వ్యక్తి ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఆ తరువాత అదే గూగుల్ పే ఖాతాకు అనుసంధానమై ఉన్న ఐ.సి.ఐ.సి.ఐ. ఖాతా నుంచి రూ. 5 వేలు ఒకసారి, రూ.వెయ్యి రెండోసారి బదిలీ అయ్యాయి. తన బ్యాంకు ఖాతాల నుంచి నగదు డ్రా అయినట్లు పత్రాలను సంపాదించి శుక్రవారం ఆయన సైబర్‌క్రైం సి.ఐ. గోపీనాథ్‌ను ఆశ్రయించగా ఆయన కేసు నమోదు చేశారు.
గూగుల్ సంస్థకు నోటీసులు పంపుతున్నాం....
గూగుల్ శోధనలో సైబర్ నేరగాళ్లు వివిధ సంస్థల కాల్‌సెంటర్ నెంబర్లంటూ తప్పుడివి పెట్టారు. వాటికి ఫోన్ చేస్తుంటే అవి నేరుగా సైబర్ నేరగాళ్లకు వెళ్తున్నాయి. వారు బాధితులతో మాట్లాడి ఫోన్ సమాచారాన్ని దొంగిలించే లింక్‌లను పంపుతున్నారు. ఆయా లింక్‌లను మళ్లీ వారికి పంపితే మన ఫోన్ నెంబరుకు అనుసంధానమై ఉన్న గూగుల్‌పే/ఫోన్‌పే తదితర ఇ-వ్యాలెట్‌లన్నీ వారి ఫోన్‌కు అనుసంధానమైపోతాయి. వారే నేరుగా మన ఇ-వ్యాలెట్ నుంచి లావాదేవీలను చేసుకోవచ్చు. ఈ పద్ధతిలోనే వాసుదేవన్ నుంచి కంచన్ మండల్ అనే చత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి నగదు కాజేసినట్లు తెలిసింది. సైబర్‌నేరగాళ్లు తమ నెంబర్లను గూగుల్ శోధన అంతర్జాలంలో పెట్టి మోసం చేస్తున్నందుకుగానూ గూగుల్ సంస్థకు నోటీసులు పంపుతున్నాం. ఇ-వాలెట్‌లు ఉపయోగిస్తున్న వారు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇ-వాలెట్‌కు అనుసంధానమై ఉన్న ఫోన్ నెంబరు నుంచి పరిచయం లేని వ్యక్తులు పంపే లింక్‌లను మళ్లీ తిరిగి పంపకూడదని గుర్తుంచుకోవాలి. ఫోన్‌కు వచ్చే ఒ.టి.పి. నెంబర్లను కూడా ఎవరికీ చెప్పకూడదు. బ్యాంకు అధికారులు కూడా ఒ.టి.పి. నెంబరు అడగరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- గోపీనాథ్, సి.ఐ., సైబర్‌క్రైం