YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్న కవిత

కాంగ్రెస్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్న కవిత

హైదరాబాద్, జూలై 11
భారత రాష్ట్ర సమితి వ్యవహారాల్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చిచ్చు రేపింది. బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకు రావాలని కేబినెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం రాగానే జాగృతి అధ్యక్షురాలు కవిత సంబరాలు చేసుకున్నారు. జాగృతి పోరాటంతోనే కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చిందని రిజర్వేషన్లు ఇచ్చిందని.. ఇది తమ పోరాట ఫలితమేనని చెప్పుకొచ్చారు. కవిత సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ నిర్ణయాన్ని సమర్థించారు. కవిత స్పందనతో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. తాను బీఆర్ఎస్ పార్టీనేనని కవిత చెబుతున్నారు. తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని కూడా చెబుతున్నారు.  ఇటీవల ఓ మీడియా చానల్ కు ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో బీఆర్ఎస్‌కు తన కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువగా ఇచ్చానని..తాను కూడా వారసురాలినేనని స్పష్టం చేశారు.  ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై సంబరాలు చేయడం ఆసక్తి రేపింది. ఇదే బీఆర్ఎస్ విధానం అనుకుంటారేమోన్న ఆందోళనలతో వెంటనే ఇతర బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.  ఆర్డినెన్స్ తోనే బీసీ రిజర్వేషన్లు ఎలా వస్తాయని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసి నోటిఫికేషన్లు ఇస్తే.. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంటాయని ... అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమవుతాయని అంటున్నారు. అధికారికంగా  42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు.  
ఓ వైపు కవిత స్వాగతించడం.. మరో వైపు బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించడం.. ఆ పార్టీలో ఉన్న గందరగోళ పరిస్థితిని మరోసారి బయట పెట్టినట్లయింది. కవిత  రాత్రికిరాత్రి సంబరాలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ చేసిందన్న భావన ఆ పార్టీ ముఖ్య నేతల్లో కూడా ఉంది. కానీ ఇప్పటికిప్పుడు కవిత విషయంలో ఎలాంటి చర్యలు, కామెంట్లు చేసే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు. కవిత మాత్రం తన రాజకీయాలు తాను చేసుకుంటూ వెళ్తున్నారు.
కవితకు ఏం సంబంధం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఆ ఘనతను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీసుకోవడం ఏమిటని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.ఈ నిర్ణయం వెనుక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆశయం ఉందని ఆయన పేర్కొన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందని అన్నారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తోందని వివరించారు.బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీకి, కవితకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. తాము చేసిన పనికి ఆమె క్రెడిట్ తీసుకోవడం ఏమిటని నిలదీశారు. కవితను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ పదేళ్లు ఏం చేశారో చెప్పకుండా ఆమె బీసీ పాట పాడుతున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ గాంధీ అజెండా, రేవంత్ రెడ్డి నిబద్ధత అని ఆయన స్పష్టం చేశారు.
రైల్ రోకో నిలిపివేస్తామన్న కవిత
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం సంతోషకరమని, అయితే తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అందుకే ఈ నెల 17న తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆమె తెలిపారు.ఆర్డినెన్స్ జారీ చేసిన వెంటనే రిజర్వేషన్లను అమలు చేయగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు ఎందుకు వేచి చూసిందని కవిత ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే అలా చేశారని తాము భావిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు చేస్తోందని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రాజ్యాంగ సవరణ జరిగితే బీసీలకు రాజకీయంగా హక్కులు లభిస్తాయని కవిత అన్నారు. విద్య, ఉద్యోగాల గురించి కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, కాబట్టి తలుచుకుంటే ఒక్క నిమిషంలో రాజ్యాంగ సవరణ చేసి ఇవ్వవచ్చని అన్నారు. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తప్పులన్నీ కాంగ్రెస్ పైకి నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారేమోనని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆమె అన్నారు.బీసీ బిల్లును షెడ్యూల్ -9లో పెట్టాలని, దీని కోసం బీసీ బిడ్డ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఆర్డినెన్స్ తీసుకువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందున, ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణను గమనించి, అందుకు అనుగుణంగా తాము నిర్ణయం తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

Related Posts