
విజయవాడ, జూలై 11
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నది మీరే. పాపాలు చేసిన మీరు నాకు శాపాలు పెట్టడం ఏంటి? ఇప్పుడు దొంగే దొంగా దొంగ అన్నట్టు, ఎందుకీ నాటకాలు జగన్ అని ప్రశ్నించారు. 2020-21లో ఫస్ట్ బ్యాచ్ ప్రారంభం కాగా.. యూనివర్సిటీకి సొంత బిల్డింగ్, ఫుల్ టైం ఫ్యాకల్టీ కూడా లేకుండా 3 ఏళ్లు నడిపింది వైసీపీ ప్రభుత్వం అన్నారు. ‘కనీసం ఫుల్ టైం ఫ్యాకల్టీ కూడా లేకుండా కన్సల్టెంట్లతో యూనివర్సిటీ నడిపించి, విద్యార్ధుల జీవితాలతో జగన్ ఆడుకున్నారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకుండా మీరు చేసిన నిర్వాకం వల్ల మూడు బ్యాచుల విద్యార్థులు 2020- 21, 2021-22 & 2022-23 బ్యాచ్ లకి సంబంధించిన వారు నష్టపోయారు. దీని ప్రభావం ఈ ఏడాది ADCET పై పడింది. పర్మిషన్ కోసం వచ్చిన కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA), యూనివర్సిటీని 2024 జులై 1, 2 సందర్శించి, కనీస సౌకర్యాలు కూడా లేవంటూ యూనివర్సిటీలో లోపాలపై అదే ఏడాది జులై 26న నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 8వ తేదీన వైసీపీ ప్రభుత్వం దానిపై వివరణ ఇచ్చింది. క్యాడర్ వైజ్ ఫ్యాకల్టీ లేదు అంటూ 2020- 21, 2021-22, 2022-23 బ్యాచ్ లకు అనుమతులు ఇచ్చేది లేదని అక్టోబర్ 10వ తేదీన COA తెలిపింది. నవంబర్ 20న యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లని తాత్కాలిక పధ్ధతిలో నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ జులై 2, 2025న అనుమతిని మంజూరు చేసి, ఇదే విషయాన్ని జులై 3, 2025న COA కి తెలిపిందని’ నారా లోకేష్ పేర్కొన్నారు.కనీస సిబ్బంది లేని కారణంగా APSCHEకి లేఖలు పంపి, ADCET 2025కి కన్వీనర్‌ను నియమించాలని కోరింది కూటమి ప్రభుత్వం. యూనివర్సిటీ శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. వైసీపీ హయాంలో ఇచ్చిన రెగ్యులర్ అధ్యాపక నియామక నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దాంతో విద్యార్ధులు నష్ట పోకుండా సిబ్బందిని నియమించటానికి కూటమి సర్కార్ చర్యలు తీసుకుంది. వైసీపీ హయాంలో కనీసం రెగ్యులర్ స్టాఫ్ లేకుండా కన్సల్టెంట్లతో నడిపారు. కనీసమైన సౌకర్యాలు, భవనాలు కూడాలేకుండా యూనివర్సిటీ నడిపింది మీరు. మీ పాపాలను సరి చేస్తూ కూటమి ప్రభుత్వం విద్యార్ధులకు అండగా నిలుస్తుంది - మంత్రి నారా లోకేష్
జగన్ చేసిన విమర్శలు ఇవే..
టీడీపీ ప్రభుత్వం JNAFAUని విభజించడంలో విఫలమైందని, వైసీపీ ప్రభుత్వం 2020–21లో కడపలో YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించిందని జగన్ పేర్కొన్నారు. ‘AICTE, UGC అనుమతులు వచ్చాయి. కానీ కరోనా సమయంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (CoA) తనిఖీలు నిర్వహించలేదు. తరువాత మేం ఒప్పించడంతో, CoA అక్టోబర్ 2023లో కమిటీ ఏర్పాటు చేసింది. మొదటి మూడు బ్యాచ్‌లకు ఆమోదం కోసం గత ఏడాది జూలై 1న తనిఖీ జరిగింది. వైస్-ఛాన్సలర్ నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో ఆమోదం ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్ల మొదటి బ్యాచ్ కోసం, కనీసం ఇప్పుడైనా స్పందిస్తారని ఆశిస్తున్నాను. 2023–24, 2024–25 బ్యాచ్‌లకు CoA అనుమతులు మా హయాంలో పొందాం. కూటమి ప్రభుత్వం కొత్త విద్యార్థులను జాయిన్ చేసుకోవడానికి ఇప్పటివరకు ADCET పరీక్షను కూడా నిర్వహించలేదు. ADCET కోసం కన్వీనర్‌ను నియమించలేదు. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి.. అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి’ అని మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.