
ప్రియుడి మోజులో కట్టుకున్న వాడిని వారం రోజులకే చంపేసిందో నవవధువు. పెళ్లికి రెండేళ్ల నుంచి అతడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న యువతి పెళ్లి కావడంతో ప్రియుడితో కలిసి ఉండలేనని భావించి అతడితోనే భర్తను హత్య చేయించింది. వారం రోజుల తర్వాత కేసును చేధించిన పోలీసులు ప్రియుడితో పాటు యువతిని అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధాలతో భర్తలను దారుణంగా హత్య చేయించిన స్వాతి, జ్యోతి, సరస్వతి లాంటి జాబితాలోనే కొత్తగా చేరింది నాగలక్ష్మి. తూర్పుగోదావరి జిల్లా కరపకు చెందిన పేకేటి సూర్యనారాయణ ఎంఎస్సీ చదివి మండపేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి వేపకాయలపాలెం గ్రామానికి చెందిన నాగలక్ష్మితో మే 15న వివాహం జరిగింది. మే 21వ తేదీ మధ్యాహ్నం భార్యతో కలిసి వేపకాలయపాలెంలోని అత్తారింటికి వెళ్లిన సూర్యానారాయణ సాయంత్రం వేళ ఓ పని ఉందని, 8గంటలకల్లా వచ్చేస్తానని భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రయినా సూర్యనారాయణ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడి గ్రామమంతా గాలించినా ఫలితం లేకపోయింది. 22వ తేదీ ఉదయం పెనుగుదురు-పాతర్లగడ్డ మార్గంలో పంట పొలాల వద్ద సూర్యనారాయణ బైక్ కనిపించడంతో సమీపంలో వెతికగా సమీపంలోనే మృతదేహం లభించింది. తల నరికి అత్యంత కిరాతకంగా హత్య చేసి గడ్డి కప్పి ఉంచడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాకినాడ గ్రామీణ సీఐ పి.ఈశ్వరుడు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. గ్రామంలో పలువురిని విచారించగా నాగలక్ష్మి అక్రమ సంబంధం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె ప్రియుడు రాధాకృష్ణను అదుపులోకి తీసుకు విచారించగా నేరాన్ని అంగీకరించాడు. తమ అక్రమ సంబంధానికి భర్త ఎక్కడ అడ్డొస్తాడోనన్న ఆందోళనతో నాగలక్ష్మి సూచనతో సూర్యనారాయణను హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు రాధాకృష్ణతో పాటు నాగలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.