YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఈశాన్యంలో వికసించిన కమలం   

Highlights

  • అసోం నుంచి మొదలు.. 
  • అయోమయంలో కాంగ్రెస్‌
  • ఖంగుతిన్న వామపక్షకూటమి
ఈశాన్యంలో వికసించిన కమలం   

ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ  తన విజయ పరంపర కొనసాగిస్తోంది. ఐదేళ్ల క్రితం వరకు ఈ ప్రాంతంలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ క్రమంగా ఒక్కో రాష్ట్రంలో అధికార పీఠాన్ని అందిపుచ్చుకోవడంతో కమలనాథుల్లో నూతన ఉత్సాహాన్నినింపింది. అస్సాం, మణిపూర్‌ రాష్ట్రాల్లో పార్టీ గెలుపుతో  మొదలెట్టిన బీజేపీ జైత్రయాత్ర  వామపక్ష కంచుకోట త్రిపురను సైతం  కైవసం చేసుకుంది. బెంగాలీ ఓటర్లు అధికంగా ఉన్న త్రిపురలో ప్రజలు ఎక్కువ భాగం విద్యావంతులు కావడంతో గెలుపు ఆషామాషీ వ్యవహారం కాదు. నాగాలాండ్‌లోనూ భాజపా ఉన్న కూటమి విజయం వైపు దూసుకుపోయింది. మేఘాలయాలో హంగ్‌ ఏర్పడటంతో అక్కడ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
ప్రధాని మోదీ ప్రభావం..
పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ.. తదితర చర్యలపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దేశంలో జనాభా రీత్యా పెద్ద రాష్ట్రమైన యూపీలో విజయం,గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో గెలుపుతో మోదీ ఖ్యాతి మరింత పెరిగింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌గెలుపొందినా స్థానిక పరిస్థితుల కారణంగానే గెలుపొందినట్టు విశ్లేషకులు విశ్లేషించారు. తాజా కేంద్రబడ్జెట్‌లో పేదలు, రైతాంగంపై దృష్టి పెట్టడం కూడా తాజా త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో విజయం సాధించేందుకు దోహద పడిందని చెప్పవచ్చు. ఇక మేఘాలయాలోనూ అధికారాన్ని పొందేందుకు పావులు కదుపుతుండటంతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. కేంద్రస్థాయిలో అవినీతి ఆరోపణలు లేకుండా పాలన సాగించడంపై విద్యావంతులు ఆకర్షితమవుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 20 సీట్లకు పైగా గెలుపొందేందుకు కమలనాథులు ఇప్పటి నుంచే పథకం సిద్ధం చేస్తున్నారు.
అస్సాం నుంచి మొదలు.. 
ఈశాన్యంలో అస్సాం పెద్ద రాష్ట్రం, ఇక్కడ మొత్తం 126 స్థానాలుండగా భాజపా కూటమి మెజార్టీ సాధించి అధికారాన్ని అందుకుంది.భాజపా యువనేత హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో భాజపా ఈశాన్య రాష్ట్రాల్లో క్రమంగా పట్టు సాధిస్తోంది. మంచి వ్యూహకర్తగా శర్మకు పేరువుంది. ఆయనతో పాటు భాజపా కార్యదర్శి రాంమాధవ్‌, త్రిపుర నేత విప్లబ్‌కుమార్‌... తదితరులు పార్టీ ప్రగతికి విశేషంగా కృషి చేయడంతో విజయంసాధ్యమైంది.
ఖంగుతిన్న వామపక్షకూటమి 
 త్రిపుర ఎన్నికల్లో భాజపా గెలుపు చారిత్రాత్మకమైనదనే చెప్పాలి.  గత 25 సంవత్సరాల నుంచి అక్కడ వామపక్ష కూటమి అధికారంలో ఉంది. సీఎం మాణిక్‌ సర్కార్‌ పనితీరు బాగుంది. అయితే అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. దీంలో పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు తక్కువగా ఉన్నాయి. కొత్తగా ఓటుహక్కు పొందిన యువఓటర్లు, మెజార్టీ బెంగాలీ ఓటర్లను ఆకట్టకునేందుకు భాజపా యత్నించింది. ఉద్యోగులకు జీతాలు పెంచుతామని హామీ ఇవ్వడం, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీలు  ఫలించాయి.దీంతో పాటు ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపాకు అధికారం అప్పగిస్తే అభివృద్ధి జరుగుతుందని వాగ్దానం చేశారు. ఈ ప్రయత్నాలు ఫలించడంతో వామపక్ష కోటపై భాజపా విజయ కేతనం ఎగరవేసింది. బెంగాల్లో వరుసగా రెండు సార్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ చేతిలో పరాజయం పాలైన వామపక్షకూటమికి త్రిపురలోనూ అధికారం చేజారిపోవడం ఇబ్బందికరమే.
అయోమయంలో కాంగ్రెస్‌... 
ఈశాన్యరాష్ట్రాల్లో కాంగ్రెస్‌ క్రమంగా బలహీనపడుతోంది. 2013లో త్రిపురలోజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 36 శాతంపై ఉండగా తాజా ఎన్నికల్లో 2 శాతం లోపు పడిపోవడం గమనార్హం. అధికారంలో ఉన్న మేఘాలయాలోనూ త్రిశంకుసభ ఏర్పడటంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కష్టతరంగా మారాయి. పార్టీవర్గాల్లో కుమ్ములాటలు, కేంద్రనాయకత్వం క్రియశీలకంగా జోక్యం చేసుకోకపోవడం, అంతంత మాత్రంగా ప్రచారం నిర్వహించడం, నిధుల లేమి... తదితర కారణాలతో కాంగ్రెస్‌ ప్రభావం వేగంగా తగ్గిపోతోంది. 

Related Posts