YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సాహిత్యం

అక్షరాల చక్రవర్తి...

Highlights

  • చక్రవర్తుల రాఘవాచారి
  • నిలువెత్తు స్ఫూర్తి                                   
అక్షరాల చక్రవర్తి...

లోతైన విశ్లేషణ, పదునైన వ్యాఖ్యానం, ఏ రంగంలో ఏ అంశంపైనైనా సాధికారిత, నిబద్ధత, అతి సాధారణ జీవితం, కలుపుగోలుతనం, చక్కని స్నేహభావం తదితర ప్రత్యేకతలన్నీ కలగలిస్తే ఆయనే చక్రవర్తుల రాఘవాచారి. ఈ పేరు చేబితే చాలామందికి గుర్తురాదు. సి రాఘవాచారి అంటే కొంతమందికీ, "సి రా" అంటే ఇంకొంచెం మందికి,  విశాలాంధ్ర రాఘవాచారి అంటే అందరికీ తెలుస్తుంది. అందరికీ అర్థమవుతుంది. జర్నలిస్టు జీవితకాలపు నిరంతర విద్యార్థి. రాఘవాచారి అధ్యయనం విస్తారం, వైవిధ్యభరితం. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూలోనూ ఆయనకు ప్రవేశమేకాదు, పాండిత్యమూ ఉంది. భారత రామాయణాలు మొదలుకొని ప్రాచీన సాహిత్యాన్ని, మార్క్సిస్టు గ్రంథాలను, యూరోపియన్‌ సాహిత్యాన్ని, వివిధ దేశాల రాజ్యాంగాలను ఆయన ఆపోశనపట్టారు. అలవోకగా ఆయా సందర్భాల్లో ఆయా అంశాలను వివిధ గ్రంథాల నుంచి ఉటంకించడం ఆయన విశిష్ఠత.  తెలుగువారికి చిరపరిచయమైన చక్రవర్తుల వారు ఇద్దరు.  ఒకరు రాజకీయ దురంధరులు చక్రవర్తుల రాజగోపాలాచారి కాగా... రెండో వారు మన  చక్రవర్తుల రాఘవాచారి.

రాఘవాచారి విశాలాంధ్రకు 1972 లో సంపాదకత్వం స్వీకరించి మూడు దశాబ్దాలు నిర్విఘ్నంగా కొనసాగించి కీర్తి గడించారు.  విశాలాంధ్ర సంపాదకుడిగా ఆయన బాధ్యతల నుంచి తప్పుకొని దశాబ్దమున్నర గడచినా.. ఇప్పటికీ ఆయన విశాలాంధ్ర రాఘవాచారిగా జనం మదిలో, హృదిలో నిలిచిపోయారంటే ఆ పత్రికతో ఆయనకున్న అనుబంధం అంటుంది. ఏ తెలుగు దినపత్రికల సంపాదకులకు లభించని అరుదైన గౌరవం అది.  విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకులుగా ఉండి, ఎన్నోన్నో సంపాదకీయాలు తనదైన శైలిలో నిర్మించి ఆ పత్రికకే గొప్ప సొబగు తెచ్చిన వ్యక్తి. విజయవాడలో ఆయన లేని సభ దాదాపు ఉండదంటే అతిశయోక్తి కాదు. రేడియోలో ఆయన ప్రసంగించని అంశం ఉండదు. చరిత్ర లోతుల్ని శోధించి గంభీరంగా మాట్లాడే నేర్పున్నవారు. 
 
వరంగల్లు జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో వరదాచార్యులు - కనకవల్లి దంపతులకు 1939 సెప్టెంబరు 10వ తేదీన జన్మించిన రాఘవాచారి శ్రీవత్స గోత్రీకులు. పూర్తి వైష్ణవ సాంప్రదాయంలో  పెరిగిన ఈయన తొమ్మిది మంది సంతానం లో, అయిదుగురు అన్నదమ్ములలో చివరి వాడు. చిన్నప్పుడు అందరూ ‘రాఘవన్’అని పిలిచేవారు. తల్లిగారిది కృష్ణాజిల్లా మానికొండ దగ్గర బొకినాల గ్రామం. ఆనాటి పద్ధతిలో ఇంట్లోనే విద్య నేర్చారు. అమ్మ తమిళం నేర్పింది. ఆంధ్రనామ సంగ్రహం, రుక్మిణీ కల్యాణం బాల్యం లోనే చదివేశారు  అన్నయ్యలతో పాటు గుంటూరు జిల్లా పొన్నూరులో ఉండి అక్కడి భావనారాయణ సంస్కృత కళాశాలలో సంపత్కుమారాచార్య, చల్లా సత్యనారాయణ శాస్త్రి వద్ద పంచకావ్యాలు నేర్చారు. 15వ యేటికల్లా  ఉర్దూ, సంస్కృతంలో రాటుదేలారు.  

1951లో హైదరాబాద్ లోని లాల్ గుడా రైల్వే స్కూల్ లో హైస్కూల్ విద్య పూర్తీ చేశారు. 1953 నుండి 'విశాలాంధ్ర' పత్రికను చదవటం ప్రారంభించారు. నిజాం కాలేజి లో పియుసి మొదటి బాచ్ లో చేరి ఉస్మానియా పరిధిలో 6వ రాంక్ సాధించారు. ప్రీ ఇంజనీరింగ్ పాసైనా ఇంజనీరింగ్ లో చేరకుండా బి ఎస్ సి లో చేరి చదివి ఉత్తీర్ణులయ్యారు.  1961లో ఉస్మానియాలో ‘లా కోర్సు’ చదివి, ఎల్.ఎల్ ఏం కూడా పూర్తీ చేశారు. ఇక్కడే రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి ఆర్ట్స్ కాలేజి విద్యార్ధి ప్రెసిడెంట్ మాజీ కేన్ద్ర మంత్రి ఎస్. జయపాల్ రెడ్డి వీరిద్దరూ సన్నిహితంగా మెలిగారు. రాఘవాచారిని 'ఆంధ్రా'అని, 'చైనీస్ కమ్యూనిస్ట్’ అనీ సహచరులు పిలిచేవారు. ధర్మ శాస్త్రాధ్యయనం ‘’జూరిస్ ప్రుడెన్స్’’ అంటే విపరీతమైన అభిమానం. ఇది చాలా కష్టమైన పాఠ్యాంశమైనా పట్టుదలగా దానినే ఎంచుకొని 1964లో ఉత్తీర్ణులయ్యారు. 

వరంగల్ నుంచీ ఎం ఎస్ ఆచార్య నిర్వహణలో వెలువడే 'జనధర్మ'ను కూడా చదివే వారు. తొలిరచన జనధర్మ పత్రికలో ప్రచురితం అయింది. కాలేజీ చదువులోనే -క్రీడాభిరామం- లో "ఓరుగల్లు వర్ణన"వ్యాసం రాసి ప్రశంసలందు కొన్నారు. అప్పటినుంచీ పాత్రికేయం వైపు దృష్టి మళ్ళింది. విద్యార్థి దశలోనే  ఈయనపై మక్దూం మొహియుద్దిన్, శ్రీశ్రీ ప్రభావం  పడింది. క్రికెటర్ జయసింహ, దర్శకుడు శ్యాం బెనెగల్,  చేకూరి రామారావు, జే బాపురెడ్డి, ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం, అంపశయ్య నవీన్, ముదిగొండ వీరాభద్రయ్య వీరి సహ విద్యార్ధులు. న్యాయవాద వృత్తి స్వీకరించకుండా జర్నలిజంపై దృష్టి సారించారు. భారత రాజ్యాంగం, ఇతర దేశాల రాజ్యా౦గాలను తులనాత్మకంగా పరిశీలింఛి విషయాలను కరతలామలకం చేసుకొన్నారు. విషయాలన్నీ ఆయన మునివేళ్లపై నర్తిస్తుంటాయి.

ఆజానుబాహు దేహం, అరవింద దళాయ తాక్షం, మిసిమి పసిమి ఛాయ దేహం, స్పురద్రూపం, ఆకట్టుకొనే చూపు, నెమ్మది స్వభావం, సరళ స్నేహ హృదయం,  తెల్లని గిరజాల జుట్టూ, అంతకంటే మల్లెపూవు తెల్లదనం పాంటూ- చొక్కా, వేదికకూ, వేదిక ముందూ అలంకారం, మహా నిశిత పరిశీలనం, పరిశోధనం, అనర్గళ వాగ్వైభవం, చాందస భావాలకు దూరం, అయినా సనాతన ధర్మం సాహిత్యం పై విపరీతమైన అభిమానం, పూర్తి కమ్యూనిస్ట్ అయినా, విశ్వనాధ అన్నా, ఆయన సాహిత్యమన్నా వల్లమాలిన అభిమానం, అభిరుచి ఉన్నవారే.  విద్యార్హి దశలోనే కమ్య్యునిస్టు భావజాలం అలవడింది. మహాకవి శ్రీశ్రీ అంటూ ఆయన తన కాలేజీ రోజుల్లోనే విశ్లేషణాత్మకంగా వ్యాసం రాశారు. గుంటూరు జిల్లాకు చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు కనపర్తి నాగయ్య కుమార్తె జ్యోత్స్నను వివాహమాడారు. 

విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉస్మానియా లా కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షునిగా వ్యవహరించారు.  విద్యార్థిగా న్యాయశాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేట్‌ చేసిన ఆయన రాజకీయాలు, చరిత్ర, సాహిత్యం, సంస్కృతి, సామాజిక అంశాలు ఆయనకు కరతలామలకం. ఆయన కేవలం చదవడమే కాదు, దాన్ని మదిలో నిక్షిప్తం చేసుకుంటారు. అదే జ్ఞానం. ఆయన జ్ఞానపకశక్తి అమోఘం. ఐక్యూ టెస్టు చేసి ఉంటే ఐన్‌స్టీన్‌కూ సరిసమానంగా ఉండి ఉంటారేమో అనడంలో అతిశయోక్తి కాదు. అందుకే ఆయనను తోటి జర్నలిస్టులు, రచయితలు, వివిధ వర్గాల మేధావులు 'నడుస్తున్న విజ్ఞానసర్వస్వం' అని ముద్దుగా పిలుచుకుంటారు.  ఇన్ని లక్షణాలను పేర్కొనటం కంటే కమ్యూనిస్టు జర్నలిస్టు రాఘవాచారిగా అభివర్ణించవచ్చు అని కొందరు పేర్కొంటారు.

ఆయనే తరచూ “నేను మొదట కమ్యూనిస్టును, ఆ తర్వాత జర్నలిస్టు అయ్యాను..” అనే వారు. కాబట్టే ఆయన ఆలోచనలో, రాతలో, మాటలో ఇతరుల కన్నా భిన్నత్వం, సామాజిక దృక్పథం ప్రతిబింబిస్తాయి. సంపాదకీయాల్లో నూ అవే  ప్రతిబింబించేవి. వామపక్ష భావాలున్నా, సిద్ధాంతరీత్యా, ఆచరణరీత్యా ఆయన కమ్యూనిస్టు అయినా ఇతర సిద్ధాంతాలు, విశ్వాసాలను నమ్మే వ్యక్తులతో కూడా ఎంతో స్నేహంగా ఉండడం ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకత. నొప్పించక, తానొవ్వక అన్నట్లు వ్యవహరించినా తమ అభిప్రాయాలు, విశ్వాసాలలో ఆయన ఏనాడూ రాజీపడకుండా కచ్చితంగా వ్యవహరిస్తారు. వార్తపత్రిక సంపాదకుడికి ఏ లక్షణాలు ఉండాలో ప్రముఖ ఆంగ్ల పాత్రికేయుడు హెన్రీ వాటర్‌సన్‌ నిర్వ చిస్తూ, 'విస్తృత అధ్యయనం, గొప్ప తెలివితేటలు, దేనికీ జంకని ధీరత్వం' సంపాదకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలన్నారు. ఆ సలక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న మహావ్యక్తి రాఘవాచారి. ఉస్మానియా  విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో రాఘవాచారి జర్నలిజం విజిటింగ్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 

పాత్రికేయులూ ఈ సమాజంలో భాగమే తప్ప భిన్నంకాదు, ప్రత్యేకంకాదు అని రాఘవాచారి జర్నలిస్టుల సభలు, సమావేశాల్లో హెచ్చరిస్తుంటారు. వినయ, విచక్షణ, వివేచనతో పాత్రికేయులు మెలిగినప్పుడే రాణించగలు గుతారని హితవు పలుకుతారు. నేటి కొందరు పాత్రికేయుల వింత ధోరణి చూసినప్పుడు ఆయన మాటలు ఎంతటి అక్షర సత్యాలనేది అర్థమవుతుంది.  పాత్రికేయులు కూడా సమాజంలో పౌరులే. వారికి కొమ్ములు లేవు. అందరిలాగే వారు కూడా సమాజాన్ని పీడించే రుగ్మతలకు లోనవుతుంటారు. సమాజంలోని బలహీనతలు వారిని వెన్నంటుతుంటాయి. రాజకీయ నాయకత్వంలో సమాజంలోని కొంతమంది పెద్దమనుషుల్లో ఏ లొసుగులు, బలహీనతలు, లోపాలు ఉన్నాయని రాస్తుంటారో అవన్నీ తమలో కూడా ఎంతో కొంత ఉండవచ్చునని పత్రికా రచయితలు మరచిపోతున్నారేమోననిపిస్తుంది.. అని అనేక సందర్భాలలో వెన్నుతట్టి మరీ గుర్తుచేసేవారు. 

పాత్రికేయుడు సమాజాన్ని అధ్యయనం చేయాలి, దానిలోని లోటుపాటులు ఎత్తిచూపుతూ సరిదిద్దేందుకు ఒక సాధనంగా మారాలంటారు. అంతేగాక సమాజంపైపడి బతికే పాత్రికేయం వృత్తి విలువలను దిగజార్చుతుందని హెచ్చరిస్తారు. ఈనాటి చాలామంది ప్రాతికేయులు ఈ విషయంలో ఆత్మపరిశీలన  చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఎందుకు ప్రస్తావించుకోవాలంటే విలువలు, ప్రమాణాలతో కూడిన పత్రికా వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే పాత్రికేయులంటే చులకన భావన తలెత్తుతుందని ఆయన భావన.  ఆయన సంపాదకీయాలను 'జర్నీఇన్‌టు వరల్డ్‌' గా పేర్కొనవచ్చు. అరవిందుని సావిత్రి గురించి ఎంత ఆసువుగా మాట్లాడగలరో ఆంగ్లికన్‌ జ్యూరిస్‌ ప్రుడెన్స్ గురించి అంతే అనర్గళంగా విశదీకరించగలరు. 

ఆయన సంపాదకీయాల ప్రధాన లక్ష్యం సామాజిక ప్రయోజనమే. అతిశయోక్తులు, సంచలనాలు, రెచ్చగొట్టే ధోరణులు, భయానక వాతావరణాన్ని సృష్టించే మాటలు, వ్యాఖ్యలు ఆయన సంపాదకీయాల్లో భూతద్దం పెట్టి వెదికినా కనిపించేవి కాదు. మనిషిలో ఆలోచన, వివేచన కల్పించడమే ఆయన సంపాదకీయాల ధ్యేయంగా ఉండేది. 1972 నుంచి తెలుగువారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య పరిమాణాలను గురించి చర్చించాల్సి వచ్చినా, విశ్లేషించాల్సి వచ్చినా, రాఘవాచారి సంపాదకీయాలను ప్రస్తావించాల్సిందే. శ్రమజీవుల పక్షాన నిలబడి అక్షరాగ్నులు సంధించడంలోనూ, కమ్యూనిస్టు సిద్ధాంత చర్చలోనూ, సంగీతనిధి ఎం ఎస్‌ సుబ్బులక్ష్మిని స్మరించడంలోనూ, భక్తపోతన సాహిత్యాన్ని విశ్లేషించడంలోనూ.. దేనిలోనైనా ఆయన సంపాకీయాలు కొలబద్దలుగా నిలుస్తాయి. 

పత్రికాస్వేచ్ఛ, విలువలు, ప్రవర్తనా నియమావళి, సంస్కరణలు, పాలకులు ఆర్డినెన్స్‌లు, అవాంఛనీయ ధోరణులు, గుత్తాధిపత్యం ధోరణులపై ఆయన రాసిన సంపాదకీయాలు వెలకట్టలేనివి. పత్రికా స్వాతంత్య్రం పేరిట యజమానులు చేస్తున్న అక్రమాలను ఆయన నిర్ద్వంద్వంగా ఖండించారు. పత్రికల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ఎవరి నుంచి అవరోధం కలుగుతున్నది. వాటిని నివారించడం ఎలా అన్నది నిస్సందేహంగా కీలకమైన ప్రశ్నలే. కానీ అంతే కీలకమైన ఈ స్వేచ్ఛాస్వాంతత్య్రాలు ఏ ప్రజాప్రయోజనాల సాధనకు వినియోగపడాలన్న ప్రశ్నకూడా. పత్రికా స్వాతంత్య్రంపై ఈ అవగాహన లేకుండా జరిగే చర్చల వల్ల పత్రికలు సాంఘిక పురోగమనానికి దోహదం చేయడంలో వాటి కర్తవ్యాల పరిపూర్తికి తగిన సమాధానం లభించదు, అని ఆయన ఏనాడో స్పష్టంచేశారు. ఆయన సంపాకీయాల్లో డొంకతిరుగుళ్లు ఉండవు.. సూటిగా భావవ్యక్తీకరణ ఉంటుంది. అరవై అయిదేళ్ల విశాలాంధ్ర ప్రస్థానంలో దాదాపు సగం కాలం ఆయన సంపాదకీయ మార్గదర్శనంలో ఆ పత్రిక తన రూపురేఖలు తీర్చిదిద్దుకొంది.

ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పేట్రియాట్‌ ఆంగ్ల పత్రికలో పనిచేశారు. సమాచార, పౌరసంబంధాల శాఖ పునర్వ్యస్థీ కరణకు ప్రభుత్వం నియమించిన డాక్టర్‌ నరేంద్ర లూథర్‌ కమిటీలో సభ్యులుగా వ్యవహరించారు. అనేక అవార్డులు, రివార్డులు పొందారు. రాఘవాచారి సంపాదకుడే కాదు, అంతకుమించి వక్త. ఆయన సభ ఉందంటే ప్రత్యేకంగా హాజరయ్యే వారి సంఖ్య ఇప్పటికీ ఉంది. ఏ విషయం మీద, ఏ సందర్భంలో మాట్లాడినా అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా, చమత్కారoగా ప్రసంగించడం ఆయన ప్రత్యేకత. ఆధ్యాత్మిక సభలకు వెళ్లినా ఎక్కడ తన విశ్వాసాలు, సిద్ధాంతాలనుంచి పక్కకు తొలగేవారు కాదు, అదే సమయంలో ఆ భావాలు ఉన్నవారిని నొప్పించేవారు కాదు, కానీ తాను చెప్పదలచిన విషయాన్ని చురుక్కుమనేలా అంటించేవారు.

విశ్వాసాల, నిబద్ధతా ప్రకటనే సాహిత్యం, అన్నాడు, యేట్స్‌. దీన్నే రాఘవాచారికి అన్వయించవచ్చు. విశ్వాసాల, నిబద్ధతా ప్రస్థానమే ప్రాతికేయ వృత్తి గా రాఘవాచారి ఆచరించి చూపారు. అనారోగ్యం ఆయన మనోధైర్యం ముందు చిన్నబోయింది.. ఆయనకే సెల్యూట్‌ చేసింది. ఆయన నిత్య చైతన్యంతో నిలిచే మనిషి. నిలువెల్లా తెలుపు, ముఖంపై చిరునవ్వుతో హైదరాబాద్, విజయవాడ వీధుల్లో అతి సాధారణంగా కనిపించే ఆధునిక రుషి. పాత్రికేయులకే కాదు, కమ్యూనిస్టులకు, మేధావులకు, నిజాయతీగా బతకాలని బలంగా నమ్మే ప్రతి ఒక్కరికీ ఆయన నిలువెత్తు స్ఫూర్తి.   
                                                                                                            -- నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ పాత్రికేయులు

Related Posts