
వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం, హత‍్య ఘటన మరవకుముందే రాష్ట్ర రాజధానిలో అలాంటి ఘటనే మరోటి చోటుచేసుకుంది. సొంత మేనమామే ఓ చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పాపను ఆడిస్తానని చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుద్వేల్‌లో శుక్రవారం జరిగింది. కీచక మేనమామ బారినుంచి తప్పించుకుని వచ్చిన చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఇదిలాఉండగా.. వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండలో జరిగిన శ్రీహిత హత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శ్రీహిత ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మహిళాలోకం గళమెత్తింది. మహిళలు, చిన్నారులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ‘శ్రీహిత చట్టం’ తేవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తాను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని పేర్కొన్నారు. వరంగల్ ఘటనలో సీసీ ఫుటేజ్ ఆధారాలు ఉన్నా.. ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవడం లేదో ప్రభుత్వం చెప్పాలన్నారు.