
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్నాటక సీఎంగా బీఎస్ యడ్యూరప్ప నాలుగవసారి బాధ్యతలు స్వీకరించారు. ఆరు గంటలకు సీఎంగా యడ్డీ ప్రమాణం చేశారు. మే 2018లో జరిగిన ఎన్నికల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే రాజీనామా చేశారు. అయితే మెజారిటీ నిరూపించకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. తాజాగా మాజీ సీఎం కుమారస్వామి కూడా బలపరీక్షలో ఓడడంతో.. యడ్డీకి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. 225 స్థానాలు ఉన్న కర్నాటక అసెంబ్లీలో బీజేపీ వద్ద ఇప్పుడు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ సాయంత్రం జరిగే యడ్డీ ప్రమాణస్వీకారోత్సవానికి ఎవరూ వెళ్లకూడదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు తెలిపారు. ఎమ్మెల్యేలను కొనడంలో బీజేపీ దిట్ట అని జేడీఎస్ పార్టీ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఆరోపించారు. ఇది చరిత్రలో చీకటి రోజు అని ఆ పార్టీ పేర్కొన్నది.
సెంటిమెంట్ ఫలించింది
కర్ణాటకలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని గవర్నర్ వాజూభాయ్ వాలా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారుముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నది బీ ఎస్ యడ్యూరప్ప కాదు, బీ ఎస్ యెడియూరప్ప ఆ పదవిని చేపట్టబోతున్నారు.ఈ పేర్లు వేరైనా, నేత మాత్రం ఒకరే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయేది బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీ ఎస్ యడ్యూరప్పే.యడ్యూరప్ప ఆంగ్లంలో తన పేరులోని స్పెల్లింగ్‌లో ఒక ‘డీ’ని, ఒక ‘వై’ని తొలగించడంతో ప్రస్తుతం ఆయన పేరు యెడియూరప్ప అయింది. యెడియూరప్ప అనే స్పెల్లింగ్‌ను ఆయన గతంలో చాలా కాలంపాటు ఉపయోగించారు. షికారిపుర పురపాలక సంఘం సభ్యుడిగా 1975లో ఎన్నికైనపుడు కూడా యెడియూరప్ప అనే ఉండేది. ఈ స్పెల్లింగ్‌ను ఆయన 2007లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉపయోగించారు. ఆ తర్వాత సంఖ్యా జ్యోతిష్కుల సలహా మేరకు యడ్యూరప్ప అనే స్పెల్లింగ్‌ను ఉపయోగించేవారు.2018 మేలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీ ఎస్ యడ్యూరప్ప షికారిపుర నుంచి ఎన్నికయ్యారు. అప్పట్లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో కూడా ఆయన పేరు బీ ఎస్ యడ్యూరప్ప అని ఉంది. తాజాగా నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో ఆయన పేరు బీ ఎస్ యెడియూరప్ప అని ఉంది. ఈ స్పెల్లింగ్‌ల మార్పు కొంత వరకు ఆసక్తిని రేకెత్తిస్తోంది.