
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశ వ్యాప్తంగా వైద్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా... నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదించింది. వైద్య రంగంలో కీలక సంస్కరణల కోసమే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే లోక్‌షభ ఆమోదించిన నేపథ్యంలో... ఇక రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారనుంది. భారతీయ వైద్యమండలి చట్టం 1956 స్థానంలో.. ఇక నుంచి ఈ కొత్త చట్టం అమలుకానుంది. ఒకవైపు వైద్యుల నిరసన.. మరోవైపు విపక్షాల ఆందోళన... అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం తన పంతం నెగ్గించుకుంది. ప్రస్తుతం ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో.. జాతీయ వైద్య కమిషన్‌ను ఏర్పాటు చేయడం కోసం ఈ బిల్లును కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చింది.ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బిల్లుపై ప్రతిపక్షాలు పలు అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్‌ఎమ్‌సి బిల్లు ప్రయివేటు మెడికల్ కాలేజీలకు లబ్ధి చేకూరేలా, వైద్య విద్యను వ్యాపారంగా చేసేలా ఉందని ఆరోపించాయి. ఎన్‌ఎంసీ బిల్లు ఆమోదం పొందితే వైద్య విద్యలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, ఇన్‌స్పెక్టర్‌రాజ్‌కు తెరపడుతుందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ చెబుతున్నారు.ఇప్పటివరకు వైద్యవిద్య, మెడికల్ సంస్థలు, డాక్టర్ల రిజిస్ట్రేషన్ తదితర అంశాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చూసేది. వైద్య విద్యకు సంబంధించి 25 మంది సభ్యులు గల జాతీయ వైద్య కమిషన్ చూస్తుంది. ఈ సభ్యులను కేంద్రం నియమిస్తుంది. వైద్య విద్య, శిక్షణకు సంబంధించి ఆయా రాష్ట్రాల సమస్యలు, సూచనలకు కమిషన్ అవకాశం ఇస్తుంది. ఎన్‌ఎమ్‌సి బిల్లు ఆమోదంతో వైద్యవిద్యలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ఒకటే ఉంటుంది. ఎంబీబీఎస్ చదువు పూర్తి చేశాక మెడికల్ ప్రాక్టీస్ కోసం పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష పాస్ అయితేనే మెడికల్ ప్రాక్టీస్‌కు లైసెన్స్ లభిస్తుంది.దీని ఆధారంగా పీజీ అడ్మిషన్ లభిస్తుంది. ప్రయివేట్ మెడికల్ కళాశాలలో ఫీజును ఎన్‌ఎమ్‌సి నిర్ణయిస్తుంది. 50 శాతానికి పైగా సీట్లు, ఫీజులను నిర్ణయించే అధికారం ప్రయివేట్ మెడికల్ సంస్థలకు ఉంటుంది. ఆయుర్వేదం, హోమియోపతి వైద్యులకు అలోపతి వైద్యం చేసే అవకాశాన్ని ఈ బిల్లు కల్పించింది. దీన్ని ఐఎంఏ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు ఈ బిల్లును నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు దిగారు. ఈ బిల్లు ఆమోదం పొందితే నిరవధిక సమ్మెకు దిగుతామని రెసిడెంట్ వైద్యులు ఇప్పటికే హెచ్చరించారు.