
ఉగ్రవాద సంస్థతో లింకున్న వ్యక్తులను కూడా ఉగ్రవాదులగా ప్రకటించనున్నారు. దీనికి సంబంధించిన యూఏపీఏ బిల్లును ఇవాళ రాజ్యసభలో పాస్ చేశారు. చట్టవ్యతిరేక కార్యక్రమాల నియంత్రణ సవరణ బిల్లుకు ఇవాళ రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించారు. 147 మంది అనుకూలంగా, 42 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఉగ్రవాదానికి ఎటువంటి మతం లేదని, మానవాళికి ఉగ్రవాదులు వ్యతిరేకమని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలు రూపొందించేందుకు అందరూ సహకరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో తెలిపారు. అయితే యాంటీ టెర్రరిజం బిల్లును స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయాల్సిన అవసరం లేదు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో 104 మంది సభ్యులు నెగటివ్ ఓటింగ్ చేశారు. మరో 85 మంది అనుకూలంగా ఓటేశారు. చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే ఓ వ్యక్తిని ఉగ్రవాదిగా తేల్చేందుకు నాలుగు స్థాయిల విచారణ తర్వాతనే ప్రకటన చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. ఒక ఉగ్ర సంస్థను నిషేధిస్తే, దాంట్లో పనిచేసిన వ్యక్తి మరో ఉగ్రవాద సంస్థను ప్రారంభిస్తారని, అందుకే ఆ వ్యక్తిని ఉగ్రవాదిగా వెంటనే ప్రకటించాలని మంత్రి చెప్పారు. ఓ వ్యక్తే ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గోంటాడని, ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం సమస్యగా మారిందని, అమెరికా, చైనా, పాకిస్థాన్, ఇజ్రాయిల్, ఈయూ, యూఎన్ కూడా వ్యక్తులను ఉగ్రవాదులగా ప్రకటిస్తుందన్నారు.