
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జమ్మూకశ్మీర్‌కు అదనంగా మరో 28 వేల పారామిలటరీ బలగాలను తరలించాలని కేంద్రం నిర్ణయించినట్లు వస్తున్న వార్తలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇవాళ(ఆగస్టు-2,2019)కేంద్ర హోం మంత్రిత్వశాఖ క్లారిటీ ఇచ్చింది. జమ్మూకశ్మీర్‌కు 10 వేల అదనపు బలగాలు పంపాలని గత నెల 26న కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దీనికి అదనంగా మరో 28,000 బలగాలను పంపుతూ కేంద్రం నిర్ణయించినట్టు వచ్చిన పుకార్లను కేంద్రం కొట్టిపారేసింది. ఇందులో ఎంతమాత్రం నిజం లేదని హోం శాఖ వర్గాలు వివరణ ఇచ్చాయి.100 కంపెనీల అదనపు పారామిలటరీ బలగాలను జమ్మూకశ్మీర్ పంపేదుకు వారం రోజుల క్రితం ఇచ్చిన ఆదేశాల ప్రకారం బలగాలు తమతమ స్టేషన్లకు చేరుకునే ప్రక్రియ మొదలైనట్టు హోం శాఖ వర్గాలు తెలిపాయి. పారామిలటరీ బలగాల మోహరింపు, కదలికలకు సంబంధించినవి ఎప్పుడూ పబ్లిక్ డొమైన్‌లో చర్చనీయాంశాలు కావన్నారు. కేంద్ర బలగాల ప్రవేశం, ఉపసంహరణ అనేవి నిరంతర, డైనమిక్ ప్రక్రియ అని, అంతర్గత భద్రత, శిక్షణ, తదితర అవసరాలను బట్టే ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.ప్రస్తుతం దాదాపు 85 వేల మంది కేంద్ర బలగాలను జమ్ము కశ్మీర్‌లో మోహరించారు. అమర్‌నాథ్ యాత్ర జరుగుతున్న సమయంలో దేశంలోకి అక్రమ చొరబాట్లు, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను అడ్డుకొనేందుకు వీరు నిరంతరం పహారా కాస్తున్నారు.జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 35ఏ,ఆర్టికల్ 370 రద్దుపై వస్తున్న ఊహాగానాలతో కశ్మీర్ లోయలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం అదనపు బలగాలను తరలింపునకు సీ-17 హెఫీ లిఫ్ట్ విమాన సర్వీసులను రంగంలోకి దింపింది.