YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

వీడిన ఆదిత్య మర్డర్ మిస్టరీ

వీడిన ఆదిత్య మర్డర్ మిస్టరీ

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కృష్ణాజిల్లా చల్లపల్లి బీసీ హాస్టల్‌లో మూడో తరగతి విద్యార్థి దాసరి ఆదిత్య హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. అదే హాస్టల్‌ ఉంటున్న సందీప్ అనే పదో తరగతి విద్యార్థే ఈ హత్య చేసినట్లుగా నిర్ధారించారు. ఆదిత్యను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అయితే అలాంటి ఆధారాలేమీ దొరకకపోవడంతో హాస్టల్‌లోని విద్యార్థులు, సిబ్బందిని విచారించారు. ఈ సందర్భంగా సందీప్ అనే టెన్త్ విద్యార్థి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. చల్లపల్లిలోని నారాయణరావునగర్‌కు చెందిన గిరిజన బాలుడు దాసరి ఆదిత్య సోమవారం రాత్రి బీసీ హాస్టల్‌ వద్ద దారుణహత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ఆదిత్య కనిపించకపోవడంతో వార్డెన్, వాచ్‌మెన్, తోటి విద్యార్థులు అంతా గాలించారు. బాత్‌రూమ్ వద్ద విగతజీవిగా ఉన్న ఆదిత్యను చూసి అంతా షాకయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హాస్టల్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదిత్య అన్న అశోక్ ఇదే హాస్టల్‌లో ఉంటూ ఏడో తరగతి చదువుతున్నాడు. అతడితో పాటు ఫస్ట్‌ ఫ్లోర్‌లోని గదిలో ఉండే పదో తరగతి విద్యార్థి సందీప్‌తో ఆదిత్య సోమవారం గొడవ పడ్డాడు. సోమవారం రాత్రి కూడా ఇద్దరూ మరోసారి ఘర్షణ పడటంతో హాస్టల్ వార్డెన్, వాచ్‌మెన్ వారించారు. అదేరోజు రాత్రి సందీప్ బాత్‌రూమ్‌కి వెళ్తూ ఆదిత్యను తోడు తీసుకెళ్లాడు. ఆ తర్వాత తాను ఒక్కడే తిరిగివచ్చి గదిలో పడుకున్నాడు. పోలీసుల విచారణలో ఈ విషయం వెల్లడి కావడంతో పోలీసులు సందీప్‌ను విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఆదిత్య తనను అందరి ముందూ తిట్టడంతో పరువు పోయినట్లు భావించానని, అందుకే అర్ధరాత్రి వేళ బాత్‌రూమ్‌కి తీసుకెళ్లి బ్లేడ్‌తో పీక కోసినట్లు అంగీకరించాడు. హత్య సమయంలో రక్తం మరకలు దుస్తులపై పడడంతో, వాటిని తన సూట్‌కేస్‌లో దాచి వేరే దుస్తులు ధరించి వచ్చి పడుకున్నట్లు చెప్పాడు. దీంతో ఎన్నో అనుమానాలు వ్యక్తమైన ఈ కేసును పోలీసులు ఒక్కరోజులోనే చేధించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన చల్లపల్లి బీసీ హాస్టల్‌ విద్యార్థి హత్య ఘటనపై కృష్ణా కలెక్టర్‌ ఇంతియాజ్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వాచ్‌మెన్ నాగరాజు, వార్డెన్ రామరాజును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.

Related Posts