YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆగస్టు 23న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు

ఆగస్టు 23న ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

 టిటిడి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగస్టు 23వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.  గోకుల నందనుడు, బృందావన విహారి, ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. సనాతన హిందూ ధర్మ ప్రచారమే ప్రధాన లక్ష్యంగా స్వీకరించిన టిటిడి హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహించనుంది.
 సాక్షాత్తు శ్రీ కృష్ణగోలోకాన్ని తలపించే విధంగా టిటిడి శ్రీవేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లను చేయనుంది. భారీగా పందిళ్ళు, మామిడితోరణాలు, పూమాలలతో అలంకారాలు చేపట్టనుంది. గోశాలలోని గోసంపదను అందంగా అలంకరించి భూలోక గోకులంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముత్యాల రంగవల్లికలతో తీర్చిదిద్దుతున్నారు.           గోశాలకు విచ్చేసే భక్తులు గోశాలలో బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. హైందవ ధర్మంలో గోవును ''గోమాత''గా వ్యవహరిస్తూ అత్యంత ఉత్కృష్టమైన స్థానంలో నిలిపి ముక్కోటి దేవతలకు ప్రతీకగా గోవును కొలుస్తారు. అటువంటి గోవుకు మేతదానం చేస్తే మహాపుణ్యఫలమని భక్తుల భావన, నమ్మకం. కావున టిటిడి సందర్శకులకు గోశాలలోని గోవులకు గ్రాసాన్ని అందించి గోమాత మరియు స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
 గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 6.00 నుండి 10.00 గంటల వరకు వేణుగానం, తిరుమల వేదపాఠశాల విద్యార్థులచే వేదపారాయణం, టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజనలు, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 10.15 నుండి 11.15 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి నిర్వహించనున్నారు. ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుండి శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Related Posts