YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వరదొస్తే అంతే..

వరదొస్తే అంతే..

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సాగు నీరందించి లక్షలాది ఎకరాల సాగు భూములను సస్యశ్యామలం చేసే తోటపల్లి జలాశయం అన్నదాతల పాలిట కల్పవల్లి. ఇంతటి ప్రాధాన్యమున్న ప్రాజెక్టు నిర్వహణ ఎలా ఉండాలి.. ఎప్పుడైనా భారీస్థాయిలో వరదనీరొస్తే అందుకు తగ్గట్టుగా అక్కడి పరిస్థితులున్నాయా అంటే లేవనే చెప్పాలి.. ఇందుకు తాజాగా వచ్చిన వరద పోటుకు ప్రాజెక్టు వద్ద పరిస్థితులే అద్దం పడుతున్నాయి.. కోతకు గురైన మట్టికట్టలే పనుల తీరుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.. చేసిన పనుల కారణంగా వరద వచ్చినప్పుడల్లా ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈనెల 7,8 తేదీల్లో ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు తోటపల్లి జలాశయంలో నాగావళి వరదనీరు భారీగా వచ్చి చేరింది. దీంతో సుమారు 55 వేల క్యూసెక్కుల అదనపు నీరు సముద్రంలోకి విడిచిపెట్టారు. వచ్చిన నీరు వచ్చినట్లే నదిలో వదిలేయడంతో నీటి పోటుకు కుడి, ఎడమ మట్టికట్టలు కోతకు గురయ్యాయి. 2017లో ఇదే పరిస్థితి నెలకొనడంతో 2018 నీరు-చెట్టులో రూ.4 కోట్లతో తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేశారు. అయినప్పటికీ వరదలు వచ్చినప్పుడల్లా మట్టికట్టలు కోతకు గురికావడం, సమస్య పునరావృతం కావడం షరామామూలే అయ్యింది. దీంతో పాటే రెగ్యులేటరు గేట్లు ఎత్తి దించేందుకు విద్యుత్తు సరఫరా చేసే తీగలు, రక్షణ గొట్టాలు తెగిపోతున్నాయి. జారే మట్టికట్టపై విద్యుత్తు తీగలను ఏర్పాటు చేయడంతో నీటితాకిడికి గట్టు బలహీనమై తీగలు తెగిపోతున్నాయి. దీంతో సరఫరా నిలిచి గేట్లు నిర్వహణ కష్టమవుతుంది. వరదలు తగ్గిన అనంతరం తెగిన తీగలు సరిచేస్తున్నారు. అరకొర సిబ్బందితో నిర్వహణ కష్టమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. వరదల సమయంలో ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి దించేందుకు రాత్రిపగలు అన్నతేడాలేకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండి పనిచేసేందుకు కష్టమవుతుంది.
తోటపల్లి జలాశయం నుంచి విడుదలైన అదనపు నీటి ఉద్ధృతిని గట్లు తట్టుకునేలా ఏడాది కిందట పాత వంతెన వరకు మట్టికట్ట నిర్మించారు. అయినప్పటికీ తుపాను వరదలొచ్చినప్పుడల్లా మట్టి కరిగి మళ్లీ కొట్టుకుపోతోంది. వరద పోటు తట్టుకునేందుకు పాతవంతెన పక్క నుంచి నీరుపోయేందుకు వీలుగా యంత్రాలతో భారీ గండి కొట్టారు. వరదలు తగ్గుముఖం పట్టి వర్షాకాలం పూర్తయితే మళ్లీ మట్టిగట్టును సరిచేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అయినప్పటికీ పెద్ద ఎత్తున గట్టు కోతలతో చేసిన పనులు మళ్లీ చేయాల్సిన పరిస్థితి. ఏళ్లకాలం సేవలందించాల్సిన మట్టి గట్లు ఏడాదికే ఇలా కరిగిపోవడంతో నాణ్యతపైనా రైతులు విమర్శలు చేస్తున్నారు.
నాగావళి నదిలో రెగ్యులేటరుకు కొంత దూరంలో పెద్దపెద్ద బండలు ఉన్నాయి. వీటిని తొలగిస్తే వరదనీటి ఉద్ధృతి కారణంగా కుడి మట్టికట్టకు ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వీటిని నిర్మూలించకపోవడంతో వరదలు వచ్చినప్పుడు మొదటి, రెండు గేట్లు పూర్తిగా పైకి ఎత్తే వీలులేకుండా పోతుంది. ఎత్తయిన రాళ్లను తొలగించేందుకు నిపుణుల పర్యవేక్షణలో మందుగుండు సామగ్రితో పేల్చాలి. కాని బాంబుల వల్ల స్పిల్‌వేకు ప్రమాదం పొంచి ఉందనే అనుమానం అటుగా అడుగులు వేయడం లేదు. దిగువకు నీరు వదిలేటప్పుడు తిరిగి వెనక్కి వచ్చే అవకాశంతో కొద్దికొద్దిగా మట్టి నదిలో జారిపోవడంతో రానురాను స్పిల్‌వేపై ఒత్తిడి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమస్య పరిష్కారానికి మట్టికట్టలకు ఇరువైపులా పోటు ఏర్పడే ప్రాంతం వరకు రాతితో రక్షణ గోడలు నిర్మించే ఆలోచన చేయాల్సి ఉన్నా అధికారులు అటుగా ఆలోచనలు చేయడం లేదు.

Related Posts