YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అసెంబ్లీని ముట్టడించనున్న రైతులు 

Highlights

  • ముంబైకి తరలివచ్చిన రైతులు 
  • అప్రమత్తమైన  పోలీసులు 
అసెంబ్లీని ముట్టడించనున్న రైతులు 

 మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభను సోమవారం  రైతులు  ముట్టడించనున్నారు. వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, అటవీ భూములను గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు బదిలీ చేయాలని వామపక్ష అనుబంధిత అఖిల భారత కిసాన్సభ (ఎఐకెఎస్) ఈ విధానసభ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందుకు నాశిక్ నుండి ఐదు రోజుల క్రితం ముంబయికి బయల్దేరి 35 వేల మంది రైతుల భారీ ర్యాలీ ముంబయి నగరానికి చేరుకుంది. నగరంలోని కెజె సోమయ్య గ్రౌండ్ కు  బయల్దేరటానికి ముందు వారు ముంబయి-థానే సరిహద్దు ప్రాంతంలో మకాం చేశారు.  దీనితో  ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొనేందుకు తాము విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు.ఈ  నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ స్థంభించే అవకాశాలున్నాయని పోలీసులు ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని సూచించారు. 


      శాసనసభ వెలుపల రైతులను కలిసి వారి డిమాండ్లను వినేందుకు రాష్ట్ర మంత్రి గిరిష్ మహాజన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.   వ్యవసాయ రుణాల మాఫీ, భూమి హక్కుల బదిలీ వంటి అంశాలకు తమకు జీవన్మరణ సమస్యగా మారాయని భారీ సంఖ్యలో ఎఐకెఎస్తో జత కలిసిన ఆదివాసీలు చెబుతున్నారు. ఆదివారం తాను ఇక్కడ రాష్ట్ర మంత్రి గిరిష్ మహజన్ను కలిసినపుడు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని ఎఐకెఎస్ అధ్యక్షుడు అశోక్ ధవాలే చెప్పారు. తాము తమ ముట్టడి కార్యక్రమాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తామని, నగర వాసులకు ఎటువంటి ఇబ్బందీ కలిగించమని ఆయన హామీ ఇచ్చారు. తాము తొలుత 25 వేల మంది రైతులతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పుడు 50 వేల మందికి పైగా వున్నారని, సోమవారం నాటి కార్యక్రమంలో ఇది మరింత పెరగవచ్చని ఆయన వివరించారు. అయితే తాము నగర ప్రజలను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఉదయం 11 గంటల తరువాత తాము తమ ర్యాలీని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. మంగళవారం సాయంత్రం ఈ ర్యాలీని ప్రారంభించిన రైతులకు మార్గమధ్యంలో అనేకమంది రైతులు జత కలిసారు. వీరు తమతో తెచ్చుకున్న పరిమిత స్థాయి ఆహారపదార్ధాలతోనే తమ ర్యాలీని కొనసాగిస్తూ రాత్రి సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లోనే విశ్రమించేవారు. తిరిగి సూర్యోదయానికి ముందే ర్యాలీని ప్రారంభించిన రైతులు మధ్యాహ్నం వరకూ నిర్విరామంగా కొనసాగించేవారు. ఐదు రోజుల ఈ సుదీర్ఘ ప్రయాణంలో అందరూ ఉత్సాహంతో పాల్గొన్నారని, ఎవరూ ఏ సమయంలోనూ, ఏ దశలోనూ నిరుత్సాహ పడలేదని ప్రదర్శకుల్లో ఒకరైన జిదాబారు గైక్వాడ్ అనే మహిళా రైతు చెప్పారు. భూమి యాజమాన్య హక్కులు తమ పేర బదిలీ చేస్తే తాము పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటామని తాను ముఖ్యమంత్రికి చెప్పదల్చుకున్నట్లు ఆమె మీడియాకు వివరించారు. సంపూర్ణ వ్యవసాయ రుణమాఫీతో పాటు స్వామినాథన్ కమిషన్ నివేదికను యధాతథంగా అమలు చేయాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని ఎఐకెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజిత్ నవాలే చెప్పారు. శుక్రవారం రాత్రి రైతులను కలిసిన శివసేన నేత ఏకనాధ్ షిండే వారికి తమ మద్దతునుప్రకటించారు. వీరితో పాటు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, రాజ్థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేనలు కూడా రైతులకు తమ మద్దతును ప్రకటించాయి.

#Maharashtra: Latest visuals of All India Kisan Sabha protest which has reached Mumbai's Azad Maidan. The protest will proceed to state assembly later in the day. pic.twitter.com/Dp5hsKU1Rc

— ANI (@ANI) March 12, 2018

Related Posts