
హైదరాబాద్, మే 6,
ఏడేళ్ల నిరీక్షణ.. ఎన్నో మొక్కులు.. మరెన్నో ఆశలు.. చివరకు ఆమె కడుపు పండింది. కవలల రూపంలో ఆనందం తలుపు తట్టింది. తొమ్మిది నెలలు కాదు.. తన బిడ్డలను జీవితాంతం కడుపులో పెట్టుకుని పదిలంగా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నది. కానీ.. ఆ ఆశలు ఐదు నెలలకే అడియాసలయ్యాయి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలించిందన్నట్టుగా.. విధి ఆమెకు తీరని కడుపుకోతను మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఘటన.. ఆ తల్లిదండ్రులకే కాదు.. విన్న ప్రతి ఒక్కరి గుండె తరక్కుపోయేలా చేస్తోంది.ఎలిమినేడు గ్రామానికి చెందిన బట్టి కీర్తి.. ఏడేళ్లుగా అమ్మతనం కోసం పరితపించింది. తన నిరీక్షణ ఫలించి తన కడుపు పండింది. కడుపులో ఇద్దరు చిన్నారులు పెరుగుతున్నారని తెలిసిన క్షణం ఆమె ఆనందానికి అంతే లేదు. ఎదురుచూడగా ఎదురుచూడగా వచ్చిన గర్భం కావటంతో.. ఖర్చయినా ఫర్వాలేదని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐదు నెలలుగా ఆమె చికిత్స పొందుతోంది. కడుపులో కవలలున్నారని గుర్తించిన డాక్టర్.. కీర్తికి కొన్ని కుట్లు వేసి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. డాక్టర్ చెప్పినట్టుగానే.. కీర్తి కూడా చాలా జాగ్రత్తలు పాటించింది. ఆమె బిడ్డల్ని నవమాసాలు మోసింది. కడుపులో కవల పిల్లలు ఉన్నారని.. వారిని రెండు చేతుల్తో ఎత్తుకునే క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంది. కాన్పు కోసం ఎప్పుడూ తాను చూపించుకునే ఆస్పత్రికే వెళ్లింది. నొప్పులు వస్తూండటంతో అడ్మిట్ అయింది. అయితే డాక్టర్ లేడు. ఆ డాక్టర్ కు వచ్చే ఉద్దేశం కూడా లేదు. అలాంటప్పుడు వేరే ఆస్పత్రికి అయినా రిఫర్ చేయాలి లేదా..అందుబాటులో ఉన్న నిపుణుడైన వైద్యుడిని అయినా వచ్చేలా చేయాలి. కానీ ఆ డాక్టర్ కక్కుర్తి పడ్డారు. వాట్సాప్ లో ఆపరేషన్ చేశారు. ఇది వికటిచింది. ఫలితంగా ఆ తల్లి గర్భంలో ఉన్న కవలలు భూమి మీదకు రాకుండానే కన్నుమూశారు. ఈ ఘోరం హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నంలో జరిగింది. విజయలక్ష్మి ఆస్పత్రి ఉంది. అందులో అన్ని విభాగాలకూ వైద్యం చేసే డాక్టర్ ఉన్నారు. ఆయన జనరల్ ఫిజిషియన్ అయినప్పటికీ అన్నీ వైద్యాలూ చేస్తున్నారు. తన ఆస్పత్రిలో కాన్పులకూ ఏర్పాట్లు చేశారు. కన్సల్టెంట్ డాక్టర్లు ఉన్నారని బోర్జులు పెట్టుకున్నారు కానీ ఎవరు వస్తారో.. ఎవరు రారో రోగులకు తెలియదు. కాస్త దగ్గరగా ఉంటుందని ఆ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకున్న ఓ గర్భిణి మహిళ.. కాన్పు కోసం అక్కడే చేరడం పెను విషాదానికి దారి తీసింది. కడుపులో కవల పిల్లలు ఉండటంతో హఠాత్తుగా ఆమెకు నొప్పులు వచ్చాయి. అప్పటికే కాన్పు సమయం దగ్గర పడుతూండటం, నొప్పులు పెరగడంతో కుటచుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అక్కడి నర్సులు డాక్టర్ కు సమాచారం ఇచ్చారు. ఉన్న పళంగా అయితే తాను రాలేనని కానీ తాను చెప్పినట్లుగా చేయాలని నర్సులకు చెప్పారు. నర్సులు ఆమెను ఆపరేషన్ ధియేటర్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ చెప్పినట్లుగా పొట్టకోసి ఆపరేషన్ చేశారు. అయితే వైద్యం అంటే.. అదీ ఆపరేషన్ అంటే.. వాట్సా ప్ లో చేయడం సాధ్యం కాదు. చిన్న తప్పు జరిగినా ప్రాణాలు పోతాయి. అదే జరిగింది. తప్పు జరిగిపోయింది. ఆ కవలలు ఇద్దరూ చనిపోయారు. ఈ తల్లి తన బిడ్డల్ని కోల్పోవడంతో తీవ్రంగా ఆవేదన చెందింది. చివరికి ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో కలకలం రేగింది. డీఎంహెచ్‌వో ఆస్పత్రిలో విచారణ చేశారు. చివరికి నిజంగానే ఆ డాక్టర్ వాట్సాప్ వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాడని నర్సులకు కొంత ట్రైనింగ్ ఇచ్చి వాట్సాప్ లో ఆపరేషన్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని తేలింది. దాంతో ఆ ఆస్పత్రిని సీజ్ చేశారు. డాక్టర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.