
హైదరాబాద్, జూలై 7,
తెలంగాణలో ఇప్పటికే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి సత్తా చాటాలన్న వ్యూహాలు, ప్రణాళికలలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఆయా పార్టీలలో ఆశావహులు తమతమ ప్రయత్నాలు షురూ చేసేశారు. అయితే జూబ్లీహిల్స్ కు మాత్రమే కాదు.. రాష్ట్రంలో మరో అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక అనివార్యమన్న పరిస్థితులు నెలకొన్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకపోయినప్పటికీ.. ఉప ఎన్నిక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు కారణం రాజసింగ్ తీరు పట్ల బీజేపీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహంగా ఉందని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని నేడో, రేపో బీజేపీ అసెంబ్లీ స్పీకర్ ను కోరే అవకాశాలున్నాయనీ అంటున్నారు. తెలంగాణ బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖరాయాలన్న నిర్ణయం జరిగిపోయింది. మొదటి నుంచీ రాజాసింగ్ వ్యవహార శైలిపై బీజేపీ అధినాయకత్వం ఆగ్రహంగానే ఉందంటున్నారు. పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేయడం, ఏకంగా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలతో పార్టీ హైకమాండ్ ఆయనపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నది. పార్టీ చర్యలు తీసుకునేలోగానే ఆయన ఏకంగా పార్టీకి రాజీనామా చేసేసి.. కావాలంటే తనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాసుకోండి అని సవాల్ కూడా చేశారు. దీంతో ఇంకెంత మాత్రం ఉపేక్షించకుండా రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరుతూ లేఖ రాయాలన్న నిర్ణయానికి బీజేపీ వచ్చేసిందంటున్నారు. అందుకే ఆయన రాజీనామాను ఆమోదించి, ఆ వెంటనే ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరాలని బీజేపీ భావిస్తోంది. ఇదే జరిగితే.. గోషామహల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని కోరిన వెంటనే అందుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని భావించలేం. ఒక వేళ స్పీకర్ బీజేపీ కోరిన మేరకు రాజాసింగ్ పై అనర్హత వేటు వేస్తే కనుక జూబ్లీహిల్స్ తో పాటే.. గోషామహల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి.ఇది జరగాలంటే.. జూబ్లీహిల్స్ బై పోల్ షెడ్యూల్ విడుదలయ్యే లోగా బీజేపీ రాజాసింగ్ రాజీనామాను ఆమోదించి, స్పీకర్ ను అనర్హత వేటు వేయాలంటూ లేఖ రాయాల్సి ఉంటుంది. ఆ లేఖకు స్పీకర్ సానుకూలంగా స్పందించి వెంటనే ఆమోదం తెలపాల్సి ఉంటుంది.