
హైదరాబాద్, జూలై 7,
సాయి సూర్య డెవలపర్స్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక కమర్షియల్ యాడ్ చేశారు. హీరోలు యాడ్స్ చేయడం మామూలే. అందుకు గాను వాళ్లకు కోట్ల రూపాయల పారితోషికం లభిస్తుంది. యాడ్స్ వల్ల హీరోలకు లాభం అనుకుంటే పొరపాటే. అప్పుడప్పుడు కేసుల్లో కూడా వాళ్ల పేర్లు రావచ్చు. సాయి సూర్య డెవలపర్స్ స్టార్ట్ చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం మహేష్ చేసిన యాడ్ ఆయన పేరు కేసుల్లో రావడానికి కారణమైంది.సాయి సూర్య డెవలపర్స్, అలాగే సురానా గ్రూప్ కంపెనీలలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి దాంతో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ చేపట్టింది. ఆ కంపెనీ యాడ్ చేసిన మహేష్ బాబును విచారణకు రావాల్సిందిగా ఏప్రిల్ నెలలో నోటీసులు ఇచ్చింది.సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ వెంచర్ కేసులో తాజాగా రంగారెడ్డి కన్జ్యూమర్ కమిషన్ నుంచి మహేష్ బాబుకు నోటీసులు వచ్చాయి. ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా వెంచర్ స్టార్ట్ చేశారని, డబ్బులు కట్టిన వినియోగదారులకు స్థలాలు ఇంకా ఇవ్వలేదని సమాచారం. స్థలాలకు బదులు తాము కట్టిన డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలని కస్టమర్లు కోరగా అది కూడా సాయి సూర్య డెవలపర్స్ చేయలేదు దాంతో రంగారెడ్డి కన్జ్యూమర్ కమిషన్ ను వాళ్ళు ఆశ్రయించారు. ఫిర్యాదులో మహేష్ బాబును మూడో ప్రతివాదిగా పేర్కొన్నారు. యాడ్ చేయడమే అందుకు కారణం.సాయి సూర్య డెవలపర్స్ యాడ్ చేసినందుకు మహేష్ బాబు ఐదు కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. అందులో మూడున్నర కోట్ల రూపాయలు నగదు రూపంలో, రెండున్నర కోట్ల రూపాయలను ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకున్నారట. సినిమాల విషయానికి వస్తే... దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా SSMB29 మహేష్ చేస్తున్న సంగతి తెలిసిందే.