YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఒంటిపూట..

Highlights

  • తెచ్చుకోవద్దు తంటా..
  • కాల్వలు, చెరువుల వద్దే  ప్రమాదాలు
  • 12 నుంచి ఒక పూటే బడి
ఒంటిపూట..

బాలభానుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు పాఠశాలల విద్యార్థుల విషయంలో తగు జాగ్రత్తలు చేపట్టింది. ఈ క్రమంలోనే వేసవి బడులను నిర్వహించేందుకు సంనర్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా విద్యార్థుల తల్లిదండులు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఏంటో మేలు. ఒంటిపూట బడులు.. వేసవిలో మండుటెండల దృష్ట్యా ఉష్ణతీవ్రత పెరగక ముందే పిల్లలు బడి నుంచి ఇంటికి చేరి ఆరోగ్యం కాపాడుకునేందుకు దశాబ్దాలుగా అమలు చేస్తున్నారు. ఒకపూట బడి పూర్తవ్వగానే ఇంటికి చేరే విద్యార్థులపై అజమాయిషి కొరవడి ఆకతాయితనంగా చేసే పనులు వారి ప్రాణం మీదికి తెస్తున్నాయి. దశాబ్దకాలంగా జిల్లాలో ఇలాంటి సంఘటనలు పదుల సంఖ్యలో జరిగాయి. ఉష్ణతాపం నుంచి సేదతీరేందుకు సమీప కాల్వలు, చెరువుల్లో ఈతకు వెళ్లడం, స్నేహితులతో ఆటలకు వెళ్లి ప్రమాదాలకు గురికావడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం బడి నుంచి ఇంటికి వచ్చిన పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈనెల 12వ తేదీ నుంచి ఒంటి పూట బడులను ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలో పిల్లల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై "ఆంధ్రప్రదేశ్ పాత్రికేయులు" కథనం.

* మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి రాగానే పుస్తకాలను మూలనపడేసి సరదాగా బయటకు వెళ్లే పిల్లలు ఎంతో మంది ఉంటారు. పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిస్తే అది వారి భవిష్యత్తుపై, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటిపూట బడుల సమయంలో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఇంటికే పరిమితమవకుండా సహచరులతో కలిసి సరదాలకు అలవాటు పడతారు. తల్లిదండ్రులు ఎంత వారించినా ఇంటిపట్టున ఉండేందుకు సుముఖత చూపించరు. 
* ఇంట్లో చెప్పకుండా సరదా కోసం వెళ్లే ప్రమాదాల బారినపడుతున్న వారు ఎక్కువ మంది ఉంటున్నారు. మరోవైపు వేసవి ఎండలో తిరగడం వల్ల పిల్లలు అనారోగ్యం బారినపడే ప్రమాదం పొంచి ఉంది. ఒంటిపూట బడులనేవి పిల్లల ఆరోగ్య రీత్యా విద్యాశాఖ ఇచ్చిన వెసులుబాటుగా తల్లిదండ్రులు గుర్తిస్తే ప్రమాదాలను ముందుగానే నిలువరించవచ్చు.

అతిసారం బాధితులు ఎక్కువమందే..: ఈత సరదా పిల్లల ప్రాణాలు తోడేస్తుండగా అతిసారం వారిని ఆస్పత్రుల పాల్జేస్తోంది. వేసవిలో తల్లిదండ్రులు కళ్లు కప్పి బయటకు వెళ్లే చిన్నారులు దాహం తీర్చుకునేందుకు ఎక్కడంటే అక్కడ నీళ్లు తాగేస్తున్నారు. అతిసారంతో వేలాదిమంది చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. వాంతులు, విరేచనాలతో బాధపడే చిన్నారులు వేసవి ఆరంభమవగానే ఎక్కువ మంది ఉంటున్నారు. వీరి కోసం ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక గదులు కేటాయించాల్సిన పరిస్థితి వేసవిలో ఉంటుంది.

వాహనాలతో రోడ్డు ప్రమాదం: ప్రతి నాలుగైదు నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాద మరణం నమోదవుతోంది. వేసవిలో పిల్లలు ఇంటికి రాగానే ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కడున్నాయా అని వెతుకుతుంటారు. పిల్లల సరదాను అడ్డుకోకూడదని కొందరు తల్లిదండ్రులు వాహనాల తాళాలిస్తుండగా మరికొన్ని చోట్ల చిన్నారులు పెద్దల కళ్లుకప్పి వాటిని తీసుకెళ్తున్నారు. బైక్‌లు, సైకిళ్లపై మోజుతో వాటితో ప్రమాదాల బారిన పడుతున్నారు. అతివేగం, వాహన చోదకంపై అవగాహన లేకపోవడంతో పిల్లల మరణాలే కాకుండా క్షతగాత్రులగానూ మారుతున్నారు. కొందరు వైకల్యం బారిన పడుతున్నారు.

ఎండలో ఆటలు అనారోగ్యమే..: బడి నుంచి ఇంటికి రాగానే పుస్తకాల సంచి పక్కన పడేసి తమకు ఇష్టమైన ఆటాడేందుకు స్నేహితులతో కలిసి బయలుదేరుతారు. ఎన్ని సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత ఉన్నా వారికి ఏకోశాన పట్టదు. పిల్లల శారీరక స్థితిగతుల దృష్ట్యా 36 నుంచి 38 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత దాటితేనే ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 40 సెల్సియస్‌ డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలో ఆటలాడితే వెంటనే చిన్నారులు అనారోగ్యం బారిన పడతారు. సరదా కాస్తా వారికి ఆరోగ్యపరమైన ముప్పు తెస్తోంది. ఎండలు ముదిరే కొద్దీ వడగాలులు వస్తాయి. అవి మరీ ప్రమాదకరం. వడదెబ్బ బారినపడకుండా ఉండాలంటే ఎండలో పిల్లలు వెళ్లకూడదు. గతేడాది ఏప్రిల్‌ నుంచే 44 సెల్సియస్‌ డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం మార్చి ఆరంభం నుంచే ఎండలు మండుతున్నాయి.
జాగ్రత్తలు మేలు.. 
ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు: ఒంటి పూట బడి వదలగానే మధ్యాహ్నం వేళ పిల్లల్ని అవసరమైతే తప్పించి ఇంటి నుంచి బయటకు పంపించకూడదు. 
ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. 
ఖాళీ సమయంలో నిత్యం చదివే పుస్తకాలే కాకుండా విజ్ఞానదాయకమైన పుస్తకాల్ని చదివించేలా ప్రోత్సహించాలి. 
ఇంటి పట్టునుండే పిల్లలకు ఇంటి పనిలో సాయం చేసే అలవాటును ప్రోత్సహించాలి. 
ఇంట్లో మారాం చేస్తున్నారని వారిపై కోపం ప్రదర్శించకుండా మంచి మాటలతో సన్మార్గంలో పెట్టాలి. 
చిన్నారులు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తమకు సమాచారం తెలిసేలా చూసుకోవాలి. 
ఈత సరదా, షికార్లు, ఎండల్లో ఆటలు నిలువరించి వారిని వేరే వ్యాపకాలపై దృష్టి మరల్చేలా చూడాలి. 
 ఇంట్లో ఎక్కువ సమయం కంప్యూటరు వీడియో గేమ్‌, టీవీలకు  అతుక్కుపోకుండా పుస్తక పఠనం అలవాటును పెంచాలి.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం: ఒంటి పూట బడుల సమయంలో స్నేహితులతో కలిసి ఆటలాడుకునేందుకే పిల్లలు ఆసక్తి చూపుతుంటారు. ప్రమాదాలపై వారికి అంతగా అవగాహన ఉండదు. అందుకే ఒంటిపూట బడులు, వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటారు. సెలవు దినాల్లో పాఠ్యాంశాలు సింహావలోకనం చేసుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నాం. ఒంటి పూట బడుల సమయంలో ప్రతి విద్యార్థి ఇంటికెళ్లాక పాఠ్యాంశాలు అభ్యసించేలా హోంవర్క్‌ ఇస్తాం. తలిదండ్రులు కనిపెట్టి ఉండాలి.

Related Posts