YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

గుత్తాకు మండలి ఛైర్మన్

గుత్తాకు మండలి ఛైర్మన్

గుత్తాకు మండలి ఛైర్మన్
హైద్రాబాద్, సెప్టెంబర్ 11  
ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో చోటివ్వకపోయినా కీలక పదవి కట్టబెట్టారు. శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్‌ స్థానానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాత్రమే నామినేషన్‌ దాఖలు చేయడం వల్ల ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌సహా పలువురు విపక్షాల సభ్యులు గుత్తా సుఖేందర్‌ రెడ్డిని చైర్మన్‌ చైర్‌ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గుత్తాకు సుదీర్ఘ అనుభవం : కేటీఆర్ శాసన మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మండలి ఛైర్మన్‌గా గుత్తా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'గుత్తా సుఖేందర్‌రెడ్డికి అన్ని వ్యవస్థల్లో ఉన్న సుధీర్ఘ అనుభవం రాష్ర్టానికి ఉపయోగపడుతుంది. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు నాతో పాటు ఇక్కడున్న కొంతమంది సభ్యులు ఇంకా పుట్టనేలేదు. మా వయసు కన్నా ఎక్కువ రాజకీయ అనుభవం కల్గిన వ్యక్తి గుత్తా సుఖేందర్‌రెడ్డి. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కల్గిన వ్యక్తి గుత్తా' అని వివరించారు.'వార్డు మెంబర్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడిగా, ఎంపీగా వివిధ హోదాల్లో గుత్తా పనిచేశారు. సహకార వ్యవస్థ, డెయిరీ రంగంలో విశేష సేవలందించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడిన నాయకులు గుత్తా. సీఎం కేసీఆర్, మండలి ఛైర్మన్ గుత్తా ఆకాంక్షించిన ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు వచ్చిన రోజునే ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం యాదృశ్చికం. ఏ పార్టీలో ఉన్నా అజాతశత్రువుగా అందరితో సఖ్యతతో ఉన్నారు. పార్టీలకతీతంగా కలిసిమెలసి నడిచిన సందర్భాలెన్నో ఉన్నాయి. సభ హుందాగా జరిగేలా ఛైర్మన్ హోదాలో గుత్తా సహకరిస్తారని ఆశిస్తున్నా. శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలిలో ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇద్దరు రైతు బిడ్డలు ఉండటం రాష్ట్ర రైతులు సంతోషించాల్సిన విషయం. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన చర్చకు పెద్దపీఠ వేస్తారని ఆశిస్తున్నాని' కేటీఆర్ పేర్కొన్నారు. పదవికి వన్నె తెస్తారు : సత్యవతి శాసనమండలి చైర్మన్‌గా ఈ సభకు గుత్తా సుఖేందర్‌ రెడ్డి వన్నె తెస్తారని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా 
సుఖేందర్‌ రెడ్డికి మంత్రి సత్యవతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండలిలో ఆమె ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో తొలి గిరిజన మహిళగా తాను మంత్రి కావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కడియం శ్రీహరి చెప్పినట్లు తెలంగాణ పట్ల చంద్రబాబు నాయుడు వైఖరి నచ్చక నాడు మీరు పార్టీ మారినప్పుడు.. నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలోని నాయకులంతా మీ వెంట రావడం ఆరోజు పార్టీ నియోజకవర్గం ఇంచార్జిగా తాను చూశానని ఆమె గుర్తు చేసుకున్నారు. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో పార్టీ ఇంచార్జిగా రెండేళ్లు మీతో కలిసి పని చేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. ఆదర్శవంతంగా సభను నిర్వహిస్తారని, భవిష్యత్‌లో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు, రైతాంగానికి మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నానని మంత్రి సత్యవతి పేర్కొన్నారు.

Related Posts