YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

 ‘అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని’... అన్నారో సినీ కవి.

 ‘అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని’... అన్నారో సినీ కవి.

 ‘అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని’... అన్నారో సినీ కవి.

‘భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ’ (ఇస్రో) చైర్మన్‌ కైలాసవడివు శివన్‌ జీవితం కూడా అలానే సాగింది. ఆయన ఏం కావాలనుకున్నారో అవి పొందలేకపోయారు. కానీ అందివచ్చిన అవకాశాలన్నింటిలో తానేమిటో నిరూపించుకున్నారు. పంట పొలాల నుంచి నేడు దేశమంతా చర్చ జరుగుతున్న ‘చంద్రయాన్‌-2’ అంతరిక్ష ప్రయోగాల వరకు...‘భారత రాకెట్‌ మ్యాన్‌’గా ఖ్యాతికెక్కిన 62 ఏళ్ల డాక్టర్‌ శివన్‌ అంతరంగం ఇది...
‘‘నా జీవితం అనేక మలుపుల సంగమం. సాధారణ రైతు కుటుంబం మాది. నాన్న కైలాస వడివు వ్యవసాయం చేసేవారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌ సమీపంలో మేల సరక్కలవిలై సొంత ఊరు. అక్కడ మాకు ఓ మామిడి తోట ఉండేది. నాన్న చూసుకొనేవారు. అమ్మ చెల్లమ్‌ గృహిణి. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నా విద్యాభ్యాసం. తమిళ మీడియం. సెలవుల్లో తోటకు వెళ్లి నాన్నకు సాయం చేసేవాళ్లం. ఆయన పని విషయంలో రాజీపడేవారు కాదు. నిక్కచ్చిగా ఉండేవారు. తిండికి లోటు లేకపోయినా పెద్దగా ఆర్థిక స్థోమత ఉన్న కుటుంబం కాదు మాది. ఏ పూట సంపాదన ఆ పూటకే సరిపోయేది. అయినా మాకు మూడు పూటలా భోజనం పెట్టేవాళ్లు. అప్పట్లో అది సామాన్య విషయం కాదు. చిన్నప్పటి నుంచే పొలం పని చేయడంతో నాకు కష్టపడే తత్వం, క్రమశిక్షణ అలవాటయ్యాయి
ఇంటికి దగ్గరని...
ఇక్కడో ఆసక్తికర విషయం చెప్పాలి. టెన్త్‌ అయిపోయిన తరువాత ఏ కాలేజీ బాగుందని ఆలోచిస్తున్నా. కానీ నాన్న ఆలోచన అందుకు భిన్నంగా ఉంది. ఎవరైనా పిల్లల్ని కాలేజీలో చేర్చాలంటే దాని మంచి చెడ్డలను వాకబు చేస్తారు. అయితే మా నాన్న మాత్రం ఇంటికి దగ్గరగా ఉన్న కళాశాల కోసం వెతుకుతున్నారు. అప్పుడైతే పొలం పనిలో ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటానని! అనుకున్నట్టుగానే ఇల్లు... కాలేజీ... పొలం... అలా ఇంటికి దగ్గర్లోనే ఇంటర్‌ అయిపోయింది.
అంత స్థోమత లేదన్నారు...
ఇంటర్‌ తరువాత ఇంజినీరింగ్‌ చేయాలనుకున్నా. నాన్నకు చెప్పాను. అందుకు ఆయన ‘ఇంజినీరింగ్‌ చాలా ఖర్చుతో కూడుకున్నది. నాకు అంత స్థోమత లేదు. బీఎస్సీలో చేరు’ అన్నారు. నేను ససేమిరా అన్నాను. నిరసనగా ఓ వారం పాటు ఉపవాసం చేశాను. కానీ ఆయన మనసు మార్చుకోలేదు. చివరకు నేనే నా నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది. చేసేది లేక నాగర్‌కోయిల్‌ హిందూ కాలేజీలో మేథమెటిక్స్‌తో బీఎస్సీ చదివా. మా కుటుంబంలో తొలి గ్రాడ్యుయేట్‌ను నేనే!
ఆయన మనసు మార్చుకున్నారు...
అందరిలా బీఎస్సీ పూర్తవ్వగానే ఎంఎస్సీ చేద్దామనుకున్నా. మళ్లీ నాన్న భిన్నంగా స్పందించారు. ‘అప్పుడు నీ కోరికను నేను కాదన్నాను. ఇప్పుడు చెబుతున్నా... నీకేం కావాలంటే అది చదువుకో. అవసరమైతే పొలం అమ్మి అయినా నిన్ను చదివిస్తా’ అన్నారు. అస్సలు ఊహించలేదు. దాంతో వెంటనే ‘మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (ఎంఐటీ)కి అప్లై చేస్తే సీటు వచ్చింది. అలా 1980లో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తయింది. ఉద్యోగ ప్రయత్నం చేశా. కానీ అప్పట్లో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌కు ఒకటి రెండు సంస్థల్లో మినహా అవకాశాలు ఉండేవి కావు. ఏం చేయాలి? ఉద్యోగం రాకపోతే ఏం? పై చదువులు ఎందుకు చదవకూడదు? మనసు మార్చుకున్నా. ఒక నిర్ణయానికి వచ్చా.
 ‘విక్రమ్‌ సారాభాయ్‌’లో తొలి కొలువు...
మాస్టర్స్‌ కోసం మద్రాస్‌ ఐఐటీ, బెంగళూరు ఐఐఎ్‌సలకు దరఖాస్తు చేశాను. రెండింట్లో సీటు వచ్చింది. నేను బెంగళూరు ఐఐఎస్‌ (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌)ను ఎంచుకున్నా. 1982లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పట్టా చేతికొచ్చింది. ఆ వెంటనే ఉద్యోగం. ఇస్రో ‘విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌’కు క్యాంపస్‌ ఇంటర్వ్యూలోనే ఎంపికయ్యాను. విశేషమేమంటే మాస్టర్స్‌ చేసేటప్పుడు అందులోనే ప్రాజెక్ట్‌ వర్క్‌ చేశాను. అదే సంస్థలో ఉద్యోగం రావడం ఊహించనిదే!
‘పీఎస్ఎల్‌వీ’తో ప్రయాణం మొదలు...
నా ఉద్యోగ ప్రస్థానం ఇస్రో(1982)లో పీఎ్‌సఎల్‌వీతో మొదలైంది. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో కొత్తవారిని తీసుకున్నారు. అలా యువతరానికి కూడా అవకాశాలు వచ్చాయి. ఒక రకంగా పీఎ్‌సఎల్‌వీ... నేను కలిసి ప్రయాణం చేశాం. అదే సమయంలో బాంబే ఐఐటీలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాను. నాకు 36 ఏళ్లు వచ్చేవరకు రాకెట్‌ ప్రయోగం చూడనేలేదు. కానీ ఆ తరువాత పీఎ్‌సఎల్‌వీ-డీ1 ప్రాజెక్టుల్లో భాగమవ్వగలిగాను.
అది సంతృప్తినిచ్చింది...
ఇస్రోలో చేరినప్పటి నుంచి పలు కీలక ప్రాజెక్టులకు వివిధ హోదాల్లో పని చేసే అవకాశం వచ్చింది. 2014లో ‘లిక్విడ్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌’ డైరెక్టర్‌గా ఉన్నాను. 2015లో ‘విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం’ డైరెక్టర్‌గా సేవలందించాను. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ గత ఏడాది జనవరిలో ఇస్రో చైర్మన్‌ స్థాయికి ఎదగడం సంతోషాన్నిస్తుంది. నా కెరీర్‌లో సంతృప్తినిచ్చిన వాటిల్లో పీఎ్‌సఎల్‌వీ-సీ37 ప్రయోగం ఒకటి. 2017లో ప్రయోగించిన ఈ రాకెట్‌ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించగలిగాము. ఇది ప్రపంచ రికార్డు. నిజానికి ఎంతో క్లిష్టమైన ప్రయోగాన్ని చాలా సులువుగా పూర్తిచేయగలిగాం. ఇప్పుడు మా ముందున్న మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ మానవసహిత వ్యోమనౌక... గగన్‌యాన్‌. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే ఈ ప్రాజెక్టు పదేళ్ల కిందట ప్రారంభమైంది. 2022 ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ప్రధాని సూచించారు. దాని కోసం శ్రమిస్తున్నాం’’.
అనుకున్నదొకటి... అయినదొకటి...
నా జీవితం ఆసక్తికర సంఘటనల సమాహారం. నేనేం కావాలనుకున్నానో అది ఎప్పుడూ పొందలేకపోయా! ఇంజినీరింగ్‌ చేయాలనుకున్నా... బీఎస్సీలో చేరా. తరువాత ఎంఎస్సీ అనుకున్నా... బీటెక్‌ చదివా. అది అవ్వగానే ఉద్యోగం కోసం వెతికా... కానీ బెంగళూరు ఐఎ్‌సఎ్‌సకు వెళ్లా. మాస్టర్స్‌ కాగానే శాటిలైట్‌ సెంటర్‌లో పని చేద్దామనుకున్నా... వీఎ్‌సఎ్‌ససీలో చేరా. అక్కడ ఏరోడైనమిక్స్‌ విభాగంపై ఆసక్తి చూపించా... అనూహ్యంగా పీఎ్‌సఎల్‌వీ ప్రాజెక్ట్‌లో సభ్యుడినయ్యా. అలా ప్రతిచోటా... ప్రతిసారీ నేను అనుకున్నదేదీ జరగలేదు. కానీ... ‘ఒకటి దక్కలేదంటే మరొకటి నీ కోసం వేచి చూస్తుంది’ అని నమ్ముతాను నేను. అందుకే ఎందులో అవకాశం వస్తే అందులో రాణించడానికి పూర్తిస్థాయిలో శ్రమించాను. దలైలామా చెప్పారు... ‘కొన్నిసార్లు కోరుకున్నది దక్కకపోవడం కూడా అద్భుతమైన అదృష్టం’ అని! బహుశా నా విషయంలో అదే జరిగిందనుకుంటాను.
చెప్పులు లేకుండా తిరిగా...
మంచి అవకాశం రాలేదని బాధపడేకంటే వచ్చినదాంట్లోనే అత్యుత్తమ ఫలితాలు రాబట్టడానికి ప్రయత్నించాలనేది నా విధానం. నా కుటుంబం... నేను పెరిగిన నేపథ్యం... ఇవే నాకు జీవిత పాఠాలు నేర్పించాయి. ఊళ్లో చదువుకొనే రోజుల్లో సంప్రదాయసిద్ధమైన ధోవతి, చొక్కాతోనే విద్యాలయాలకు వెళ్లేవాడిని. నేను మొట్టమొదట కాళ్లకు చెప్పులు వేసుకుంది ఎప్పుడో తెలుసా..! మద్రా్‌సలో ఇంజనీరింగ్‌ చేసేటప్పుడు. అప్పటి వరకు బడికైనా... ఏ శుభకార్యానికైనా వట్టి కాళ్లతోనే వెళ్లేవాడిని. నాకు స్ఫూర్తి ఎవరని చాలామంది అడిగారు. నిజానికి నేను పెరిగింది, చదువుకున్నది ఓ చిన్న పల్లెలో. మా ఊరు, మా స్కూలు, మా గోల తప్ప బయటి ప్రపంచమే తెలిసేది కాదు. మేమూ బయటి ప్రపంచానికి తెలియదు. బంధువులు, స్నేహితులు... పరిమిత సర్కిల్‌. ఇలాంటి పరిస్థితుల్లో ఎవర్నో చూసి స్ఫూర్తి పొందే అవకాశం అప్పట్లో మాకు అసలు లేదు. కానీ ఈ ప్రయాణంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు... ఇస్రో సాధించిన అనేక విజయాల్లో నేనూ ఒకడిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘చంద్రయాన్‌-2’ ఆశించిన ఫలితం పూర్తిగా ఇవ్వలేదు. అయినా నిరాశ పడకుండా ముందుకు సాగుతా.
నిగర్వి
హార్వార్డ్‌లో చదవలేదు... స్టాన్‌ఫోర్డ్‌కు వెళ్లలేదు. అయినా ఓ సాధారణ రైతు బిడ్డయిన శివన్‌ ఇస్రో చైర్మన్‌ కాగలిగారంటే అది ఆయనలోని అకుంఠిత దీక్షకు, నిబద్ధతకు నిదర్శనం. ఇప్పుడు చంద్రయాన్‌-2 ప్రయోగంతో ఆయన పేరు ప్రపంచమంతా మారుమోగిపోతోంది. కానీ ఆయనలో కించిత్‌ కూడా గర్వం కనిపించదు. జీవన శైలిలో, ఆహార్యంలో ఆడంబరం ఉండదు. చిన్నప్పటి నుంచి ఏవైతే తింటున్నారో ఇప్పుడూ అవే తింటున్నారు... అన్నం, పప్పు, రసం, అప్పడం! దక్షిణాది వంటకాలనే ఇష్టపడతారు. ఇప్పుడాయన ఇస్రో చైర్మన్‌. కానీ టీమ్‌ సభ్యులందరితో కలిసి కూర్చొంటారు. సరదాగా మాట్లాడతారు. భోజనం చేస్తారు.
పని రాక్షసుడు
శివన్‌ది ఎంత ఎదిగినా ఒదిగివుండే లక్షణం. అదే పని విషయం వచ్చేసరికి ఆయన అంతే కఠినంగా ఉంటారు. ప్రతిదీ పక్కాగా ఉండాలంటారు. ఆఖరికి ప్రజెంటేషన్‌లో చిన్న తప్పు ఉన్నా ఉపేక్షించరు. ఆయన పని రాక్షసుడు. అదే స్థాయి ప్రదర్శన తన బృందం నుంచి కూడా ఆశిస్తారు. పనిని అంతగా ప్రేమిస్తారు కాబట్టే చంద్రయాన్‌-2 ఆఖరి నిమిషంలో గమ్యానికి దూరమైన వేళ శివన్‌ ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీటిపర్యంతమైన ఆయన్ను ప్రధాని మోదీ ఓదార్చడం యావత్‌ దేశాన్నీ కదిలించింది. ప్రతిష్ఠాత్మక ‘డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ అవార్డు’తో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్న శివన్‌ ప్రతి భారతీయుడిలో స్ఫూర్తి రగిలించిన అసామాన్యుడు.

Related Posts