YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కళింగ వివాదం...

కళింగ వివాదం...

శ్రీకాకుళం, జూలై 14, 
బరిలో నిలిచిన తొలిసారి ఎమ్మెల్యే.. ఆపై మంత్రి.. మరి ఆ నేత ఎలా ఉండాలి? ఎలా నిలదొక్కుకోవాలి? అరుదైన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి?.. కానీ సదరు నేత తనకంటూ ఒక సొంత టీం ను ఏర్పాటు చేసుకోవాలని భావించారు. తన గెలుపు కోసం కృషి చేసిన సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు అవకాశం ఇచ్చారు. ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయినా సరే ఓటమి ఎదురయింది. ఇప్పుడు అదే ఓటమి నుంచి అతనిపై తిరుగుబాటు ప్రారంభం అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ నేతను తప్పించాల్సిందేనన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. పతాక స్థాయికి చేరుతోంది. ఇంతకీ ఎవరు ఆ నేత? ఏంటా కథ అంటే?.. శ్రీకాకుళం జిల్లాకు( చెందిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో పలాస నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. 2009లో ఆవిర్భవించింది ఈ నియోజకవర్గం. ఇప్పటివరకు నాలుగు ఎన్నికలు జరిగాయి. రెండుసార్లు గౌతు కుటుంబీకులే ప్రాతినిధ్యం వహించారు. 2009 వరకు సోంపేట నియోజకవర్గం గా ఉండగా.. పునర్విభజనతో పలాస నియోజకవర్గంగా అవతరించింది. అయితే సోంపేట నియోజకవర్గంలో వరుసగా దశాబ్దాల కాలం గౌతు కుటుంబం హవా నడుస్తూ వచ్చింది. సర్దార్ గౌతు లచ్చన్న కుమారుడు శివాజీ సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. కానీ 2009లో పలాసలో గౌతు శివాజీ హవాకు బ్రేక్ పడింది. మత్స్యకార వర్గానికి చెందిన జుత్తు జగన్నాయకులు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.2014లో మాత్రం తిరిగి శివాజీ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తాను తప్పుకొని కుమార్తె శిరీష కు అవకాశం ఇచ్చారు. కానీ ఆమె ఓటమి చవి చూశారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యువ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజు అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు.2018లో సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో అధినేత దృష్టిలో పడ్డారు ఈ యువ డాక్టర్ అప్పలరాజు. మత్స్యకార వర్గానికి చెందిన అప్పలరాజు అయితే గౌతు కుటుంబ హవాకు చెక్ చెప్పవచ్చని పలాస నియోజకవర్గంలోని వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జగన్మోహన్ రెడ్డి అప్పలరాజును సాదరంగా ఆహ్వానించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు కట్టబెట్టారు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ ఏపీ క్యాబినెట్లో కొనసాగుతుండగా ఆయనకు రాజ్యసభకు పంపించారు జగన్మోహన్ రెడ్డి. అదే సామాజిక వర్గానికి చెందిన అప్పలరాజు దూకుడును గుర్తించిన జగన్ క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అంతవరకు కథ బాగానే నడిచింది. కానీ అక్కడి నుంచే అప్పలరాజు ఆలోచనలు మారాయి.పలాస నియోజకవర్గంలో తన గెలుపునకు, తన ఉన్నతికి సహకరించిన సీనియర్లను పక్కన పెట్టారు అప్పలరాజు. యువ నేతలతో సొంత టీం ఏర్పాటు చేసుకున్నారు. సోషల్ మీడియా సైన్యాన్ని నమ్ముకున్నారు. ఒంటెద్దు పోకడలతో చాలామంది సీనియర్లను దూరం చేసుకున్నారు. అప్పట్లోనే సీనియర్లు తిరుగుబాటు చేసి అప్పలరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అప్పలరాజు పై నమ్మకం పెట్టుకుని టికెట్ ఇచ్చారు. తీవ్ర వ్యతిరేకతతో 42 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అప్పలరాజు. అందుకే ఇప్పుడు సామాజిక స్లోగన్ తో ముందుకు వస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు. 2029 లో పలాస నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ను కళింగ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు నేతృత్వంలో మూడు మండలాల సీనియర్ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. సొంతంగా వారే వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అప్పలరాజును ఎట్టి పరిస్థితుల్లో తప్పించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. చూడాలి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..!

Related Posts