YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ప్రభుత్వ ఉద్యోగార్జనకు తెలుగు భాషాపరిజ్ఞానాన్ని ముడిపెట్టాలి

Highlights

  • జె.ఎన్.యులో తెలుగు శాఖను ఏర్పాటు చెయ్యాలి
  • సంస్కృతీ సాంప్రదాయాల ఉనికికి 
  • భాష యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి
  • వివిధ వర్సిటీల తెలుగు ఆచార్యులతో ఉపరాష్ట్రపతి మాటామంతీ
ప్రభుత్వ ఉద్యోగార్జనకు తెలుగు భాషాపరిజ్ఞానాన్ని ముడిపెట్టాలి

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగార్జనకు తెలుగు భాషాపరిజ్ఞానాన్ని ముడిపెడితే తెలుగు భాషాభివృద్ధి సాధ్యం అవుతుందని ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు గారు అన్నారు. అలాగే మన సంస్కృతీ సాంప్రదాయాలను నిలబెట్టుకోవడంలో భాష యొక్క ప్రాధాన్యతను గుర్తించి దానిని కాపాడుకోవడానికి అందరూ కృషి చెయ్యాలని అన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి నివాసంలో తనను కలిసిన వివిధ విశ్వవిద్యాలయాల తెలుగు ఆచార్యులతో మాటామంతీ సాగించారు. ఢిల్లీలోని సుప్రసిద్ధ జె.ఎన్.యు లో తెలుగు భాషకు శాఖను ఏర్పాటు చెయ్యాలని, జె.ఎన్.యు లో ఇతర భాషలకు శాఖలు ఉన్నాయని, తెలుగు భాషకు శాఖను ఏర్పాటుచేసి దానికి సిబ్బందిని నియమించాలని కోరారు. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. 

తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గిపోతోందని, పరభాషను నేర్చుకోవడం తప్పుకాదు గాని మాతృభాషను అశ్రద్ధ చేయకూడదని అన్నారు. నాటి ఆంగ్లేయులు ఆంగ్ల భాషను ప్రాత్సహించి దాని అభివృద్ధికి కృషి చేసారని, అలాగే నిజాం కాలంలో అప్పటి నిజాం ఉర్దూ భాషను ప్రోత్సహించి ఉర్దూ భాషకు ఎనలేని గుర్తింపునిచ్చారని అన్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు భాషకు ప్రాధాన్యతనిచ్చి తెలుగు భాషాభివృద్ధికి కృషిచెయ్యాలని అన్నారు. ఇప్పటికే హైస్కూలు వరకు తెలుగు భాషను తప్పనిసరి చేసి కొంత కృషి చేసినా అది సరిపోదని, తెలుగు భాషాపరిజ్ఞానాన్ని రాష్ట్రప్రభుత్వ ఉద్యోగార్జనతో ముడిపెడితే మంచి ఫలితాలు వస్తాయని శ్రీ వెంకయ్యనాయుడు గారు అభిప్రాయపడ్డారు. 

తెలుగు భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తి లభించినప్పటికీ, మైసూరులోని భారతీయ భాషా కేంద్రానికి డైరెక్టర్ స్థాయి అధికారి నియమితులు కాకపోవడంపై స్పందిస్తూ, దీనికి అధికారి లేకపోవడం వలన దీని ఉద్దేశ్యం నెరవేరడం లేదని, అలాగే నిదులు వినియోగం కాక మురిగి పోతున్నాయని అన్నారు. దీనిపై కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు చేపట్టేలా చూస్తానని అన్నారు. 

ఉపరాష్ట్రపతిగానిరి కలిసిన వారిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ప్రొ. బి. వెంకటేశ్వర్లు, ప్రొ. బి. విశ్వనాథ్; హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి ప్రొ. పి. రామనరసింహం మరియు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ప్రొ. జి.వి.ఎస్.ఆర్ కృష్ణమూర్తి, ప్రొ. సంపత్ కుమార్ ఉన్నారు. వీరంతా ఒక కార్యాచరణను తయారుచేసి తెలుగు భాషాభివృద్ధికి చేపట్టవలసిన చర్యలను శ్రీ వెంకయ్యనాయుడు గారితో చర్చించారు. ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు గారు దేశవ్యాప్తంగా మాతృభాషా పరిరక్షణకు చేపడుతున్న చర్యలకు, అలాగే తెలుగు భాషాభివృద్ధిపై వారికున్న మమకారానికి వీరంతా ఆయనను అభినందించారు. 

Related Posts