YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

యూనివర్శిటీలలో రాజకీయ జోక్యం తగదు

యూనివర్శిటీలలో రాజకీయ జోక్యం తగదు

యూనివర్శిటీలలో రాజకీయ జోక్యం తగదు
ఎమ్మెల్సీ  అశోక్‌బాబు  
గుంటూరు అక్టోబర్ 22  (న్యూస్ పల్స్)
వైకాపా ప్రభుత్వ కుట్రలో భాగంగానే ఎన్జీ రంగా వర్శిటీ వీసీ దామోదర్‌ నాయుడు అరెస్ట్‌ జరిగిందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. గుంటూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైస్‌ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దామోదర్‌నాయుడు విద్యాపరంగా, పరిపాలనపరంగా యూనివర్శిటీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారన్నారు. అవి నచ్చకనే కొందరు ఆయనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో యూనివర్శిటీలలో రాజకీయ జోక్యం ఉండేది కాదని.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వీసీలపై బెదరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. మాటవినని వీసీలను తొలగించి తమ అనుయాయులకు పోస్టింగ్‌ ఇచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. దామోదర్‌నాయుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే వ్యక్తి అని.. అతనిపై అవినీతి ముద్ర కూడా లేదని అశోక్‌బాబు అన్నారు. యూనివర్శిటీలో పోస్టులను వైకాపా వారికి ఇవ్వలేదనే అక్కసుతోనే దామోదర్‌నాయుడిపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిందన్నారు. పదవీ విరమణ చెంది ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ముందు నుంచి సేవలు అందిస్తున్న వారందరినీ తక్షణం తప్పించాలని.. అలాగే మార్చి 31కి ముందు పేపర్‌ నోటిఫికేషన్‌ ద్వారా కాకుండా నియమితులైన రూ.40 వేల పైబడి వేతనం ఉన్న కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని జీఓ ఇచ్చిన వైకాపా ప్రభుత్వం.. సాక్షి కార్యాలయ సిబ్బందికి ఇచ్చిన పోస్టులను ఏ జీఓ ప్రకారం ఇచ్చారో సమాధానం చెప్పాలని అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం తాలూకా నీడ కూడా ఈ ప్రభుత్వంలో ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వారందరినీ తొలగిస్తోందన్నారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని హామీనిచ్చిన వైకాపా ప్రభుత్వం.. ఇప్పుడు మరలా వారికోసం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఒక వైస్‌ ఛాన్సలర్‌ను తొలగించడం కోసం క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ఒక మహిళ రిపోర్టర్‌పై ఫిట్‌జీ కళాశాల యాజమాన్యం దాడి చేసినా.. వారంతా వైసీపీ సానుభూతిపరులు కావడంతోనే యాజమాన్యంపై చర్యలు తీసుకోలేదన్నారు. వీసీ వ్యవహారంలోనూ ఫిర్యాదుదారుడు మురళీకృష్ణ వైసీపీ సానుభూతిపరుడని.. ఎన్నికలలో సోషల్‌మీడియా ద్వారా పార్టీ తరపున ప్రచారం చేశాడని తెలిపారు. ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్న వైకాపా ప్రభుత్వం త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అశోక్‌బాబు హెచ్చరించారు.        

Related Posts