YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

పచ్చదనం పరమితమే.. (పశ్చిమగోదావరి)

పచ్చదనం పరమితమే.. (పశ్చిమగోదావరి)

పచ్చదనం పరమితమే.. (పశ్చిమగోదావరి)
ఏలూరు, : పల్లెల్లో పచ్చదనం పరిఢవిల్లాలనే ఉద్దేశంతో జిల్లా అధికారులు గాంధీజయంతి రోజున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అటవీ శాఖ ద్వారా మొక్కలు తెప్పించి పల్లెల్లో పంపిణీ చేశారు. ఆచరణలో చిన్నచిన్న లోపాలు ఆశయానికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. దీంతో గ్రామాల్లో వదిలేసిన మొక్కలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఉన్నతమైన లక్ష్యం.. క్షేత్రస్థాయిలో అమలు సక్రమంగా లేక నిర్లక్ష్యం పాలైంది. కాళ్ల మండలంలో 3,150 మొక్కలు పంపిణీ చేశారు. వీటిలో 2,005 పండ్ల మొక్కలు, మరో 1,145 మొక్కలు నీడనిచ్చే జాతులకు చెందినవి ఉన్నాయి. 21 గ్రామ పంచాయతీల్లో 150 మొక్కలు కూడా నాటని పరిస్థితి. ఇలా ప్రతీ పంచాయతీ ఆవరణలోనూ మొక్కలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. 150వ గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని ప్రతి పంచాయతీలో 150 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం ద్వారా అటవీ శాఖ నర్సరీల్లో ఉన్న లభ్యత బట్టి అధికశాతం నీడనిచ్చే మొక్కలు గ్రామీణ ప్రాంతాలకు చేరాయి. పంచాయతీల నుంచి మాత్రం జామ, నేరేడు, ఉసిరి, దానిమ్మ వంటి పండ్ల మొక్కలతోపాటు వేప, గానుగ, తురాయి, తెల్లమద్ది, బొగడ వంటి నీడనిచ్చే మొక్కలను అందించేందుకు అధికారులు జాబితాలు రూపొందించారు. తొలుత నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. దీన్ని జిల్లా అంతటా అమలు చేయాలనే ఉద్దేశంతో కలెక్టరు రేవు ముత్యాలరాజు ఆ మేరకు ఆదేశాలు జారీచేశారు. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఆయా నియోజకవర్గాలకు సమీపంలోని ప్రభుత్వ నర్సరీల నుంచి ప్రతి పంచాయతీకీ 150 మొక్కల చొప్పున పంపిణీ చేసింది. పంచాయతీలు రవాణా బాధ్యతను తీసుకుని మొక్కలను ఆయా పంచాయతీ కార్యాలయాలకు తీసుకువచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా అక్టోబరు 2న గాంధీజయంతి రోజు ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఎంతో ఆర్భాటంగా సాగిన గ్రామసచివాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద పది నుంచి ఇరవై మొక్కల వరకు నాటారు. పంచాయతీకి 150 మొక్కలు నాటాలన్నది లక్ష్యం. 10-20 మొక్కలను మాత్రమే నాటడంతో మిగిలినవి నిరుపయోగంగా మిగిలాయి. కార్యక్రమం ప్రారంభించి నెల దాటినా గడుస్తున్నా మిగిలినవి నాటే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. మొక్కలు సంరక్షించే నాథుడే కరవయ్యారు.

Related Posts