YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆస్తి-పాస్తులు

ఉల్లంఘనలపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం

ఉల్లంఘనలపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం

అక్రమ నిర్మాణం, అనధికార లేఅవుట్లు, భూ ఆక్రమణ, ఆహారకల్తీ, పాదబాటల దుర్వినియోగం, లీజు ఆస్తులను అక్రమంగా అనుభవించడం, రహదారులపై వ్యర్థాలు వేయడం, చెరువుల కబ్జా, నాలాల ఆక్రమణ, నిబంధనలు పాటించని హోటళ్లు, ధ్రువీకరణ లేకుండా సాగే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల వంటి అన్ని రకాల ఉల్లంఘనలపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం మోపబోతోంది. ఉల్లంఘనుల ఆటకట్టించేందుకు ‘అమలు-విపత్తుల నిర్వహణ కేంద్రం(ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెల్‌)’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జోనల్‌, కేంద్ర కార్యాలయాల స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు పని చేస్తాయి. ఫిర్యాదులపై సకాలంలో చర్యలు తీసుకోవడం వాటి కర్తవ్యం.

అక్రమమని తేలితే... 
ప్రస్తుతం అక్రమ నిర్మాణాల విషయంలో నోటీసులు ఇస్తున్నా.. చర్యలు తీసుకోవడం కష్టంగా ఉంది. అమలు బృందాలతో ఆ సమస్య ఉత్పన్నం కాదు. సంబంధిత ప్రాంతానికి చెందిన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌తోపాటు కానిస్టేబుళ్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలతో కలిసి పనిచేయాల్సి ఉంది. వాళ్ల సాయంతో జోనల్‌ కార్యాలయం నుంచి వెళ్లే బృందాలు అక్రమ నిర్మాణమని తెలితే.. కూల్చివేతలు చేపడతాయి.

హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) నూతన సంవత్సరం ప్రారంభంలో కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీ, ముంబయి మహా నగర పాలక సంస్థల తరహాలో నిఘా-అమలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆస్తిపన్ను, ఇంజినీరింగు విభాగం చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులు మినహా మిగిలిన అన్ని విభాగాలూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ పరిధిలోకి వస్తాయి.

జోనల్‌ స్థాయిలో ఇలా.. 
ఉప కమిషనర్‌/సహాయ పట్టణ ప్రణాళికాధికారి, కార్యనిర్వాహక ఇంజినీరు(ఈఈ), డిప్యూటీ ఇంజినీరు (డీఈ), అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ), సహాయ ఆరోగ్య అధికారి(ఏఎంహెచ్‌ఓ), న్యాయవాదితోపాటు పది మంది సిబ్బందితో జోనల్‌ కార్యాలయ బృందాలు ఏర్పాటవుతాయి. ఒక్కో జోన్‌ కింద ఆరు బృందాలను ఏర్పాటు చేస్తారు. ఆ బృందాలకు సంబంధిత జోనల్‌ కమిషనర్‌ నాయకత్వం వహిస్తారు.

కేంద్ర కార్యాలయంలో... 
జోనల్‌ కార్యాలయాల్లోని బృందాలను పర్యవేక్షించేందుకు కేంద్ర కార్యాలయం ఆధ్వర్యంలో మరో బృందం పని చేస్తుంది. ఇందులో పట్టణ ప్రణాళికాధికారి (సిటీ ప్లానర్‌), సూపరింటెండెంట్‌ ఇంజినీరు (ఎస్‌ఈ), కార్యనిర్వాహక ఇంజినీరు(ఈఈ), డీఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారి, ఏఎంహెచ్‌వో, న్యాయవాది, ఎలక్ట్రికల్‌ ఇంజినీరు, సమాచార సాంకేతిక అధికారి (ఐటీ), జలమండలి అధికారి ఉంటారు. ఈ బృందానికి ఐపీఎస్‌ అధికారిని నాయకుడిగా నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు.

ప్రత్యేక యాప్‌ అభివృద్ధి 
‘అమలు-విపత్తుల నిర్వహణ కేంద్రం తీసుకునే ఫిర్యాదు వాస్తవికతను పరిశీలించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేస్తుంది. అక్రమ నిర్మాణాలు, అనుమతుల్లేకుండా అదనపు అంతస్తులు కట్టడం, చెరువుల ఆక్రమణ వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు అధికారులు ఆ యాప్‌ను ఉపయోగిస్తారు’ అని ముఖ్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారి దేవేందర్‌రెడ్డి తెలిపారు.

సమస్యలకు పరిష్కారం 
- బొంతు రామ్మోహన్‌, మేయర్‌ 
నగరంలో అక్రమ నిర్మాణాలు, భూఆక్రమణలు, నాలాలు, చెరువుల అన్యాక్రాంతం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అక్రమ లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి అనేక రకాల సమస్యల్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి పరిష్కారం చూపాలని నిర్ణయించాం. అందులో భాగంగానే అమలు-విపత్తుల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. నెల రోజుల్లో అందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తవుతుంది.

వీరుంటారు... 
న్యాయవాదులు, వైద్యులు, ఇంజినీర్లు, పట్టణ ప్రణాళిక విభాగం, తదితర శాఖల అధికారులతో ఏర్పాటయ్యే ఈ బృందాలకు ఓ ఐపీఎస్‌ అధికారి నాయకత్వం వహిస్తారని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ గురువారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. చర్యలు తీసుకోవడంలో ఆ బృందాలకు పూర్తి అధికారం, స్వేచ్ఛ ఉంటాయన్నారు.

బృందాల పని ఇదీ... 
ఫిర్యాదులను పరిశీలించడం, గడువులోపు పరిష్కారమయ్యేలా చూడటం, అక్రమ నిర్మాణాల కూల్చివేత, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, జరిమానాలు వేయడం, ఆకస్మిక తనిఖీలు, విపత్తులు, ప్రమాదాల సమయంలో సహాయక చర్యలు, సర్కిల్‌ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ వంటి విధులు ఆయా బృందాలు నిర్వహిస్తాయి. కేంద్ర కార్యాలయ బృందం అందుకు అవసరమైన ఆదేశాలు, మార్గదర్శకాలు ఇస్తుంటుంది.

Related Posts