YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మద్దతు లేదు.. (కృష్ణా జిల్లా)

మద్దతు లేదు.. (కృష్ణా జిల్లా)

మద్దతు లేదు.. (కృష్ణా జిల్లా)
తిరువూరు,  జిల్లాలో పత్తి దిగుబడులు మొదలయ్యాయి.  తెల్ల బంగారంపై అన్నదాతల ఆశలను అధిక వర్షాలు దెబ్బతీశాయి. ఇప్పుడు తీసిన పత్తికి ప్రభుత్వ మద్దతు ధర లభించడం లేదు. భారత పత్తి సంస్థ (సీసీఐ) కేంద్రాలు ఇంకా తెరుచుకోక పోవడంతో చేతికి వచ్చిన కొద్దిపాటి దూదిని ప్రయివేటు వ్యాపారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం దిగుబడి అయిన పత్తికి విపణిలో క్వింటాల్‌కు రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు ధర ఉంది. అదే సీసీఐ ధర క్వింటాల్‌కు రూ.5,550 ఉంది. నాణ్యత, తేమశాతం సాకుగా చూపించి దళారులు సగం ధరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసే ప్రధాన వాణిజ్య పంట పత్తి.  ఈ ఏడాది 1.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి సగటు దిగబడి ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు ఉంది. సానుకూల వాతావరణం ఉంటే 15 నుంచి 20 క్వింటాళ్ల మధ్య దిగుబడి లభిస్తుంది. పత్తి సాగు చేయాలంటే ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి అవుతుంది. అదే కౌలు భూమి అయితే మరో రూ.15 వేలు అదనంగా ఉంటుంది. కనీసం సగటు దిగుబడి లభించి ఉత్పత్తి చేసిన పంటకు ప్రభుత్వ మద్దతు ధర లభిస్తే అన్నదాతకు లాభసాటిగానే ఉంటుంది. ఇక్కడ భిన్నమైన వాతావరణ పరిస్థితులు పత్తి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత వారం రోజుల నుంచి రైతులు చేలల్లో పత్తి తీయడం ప్రారంభించారు. తొలి విడత ఎకరాకు ఒకట్రెండు క్వింటాళ్ల పత్తి చేతికందుతోంది. గత సెప్టెంబరు, అక్టోబరులో కురిసిన వర్షాలతో తెగుళ్లు, పురుగులు ఆశించి దిగుబడిని తీవ్రంగా ప్రభావితం చేశాయి.
ఈ ఏడాది జిల్లాలోని గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు, మైలవరం, కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట మార్కెట్‌ యార్డుల్లో భారత పత్తి సంస్థ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసి బయ్యర్లను నియమించారు. ఇప్పటి వరకు కేంద్రాలు తెరుచుకోలేదు. పశ్చిమ కృష్ణాలో తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నూజివీడు, నందిగామ, గన్నవరం నియోజకవర్గాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఎకరాకు సగటున పది క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసుకున్నా.. ఈ ఏడాది జిల్లాలో 13 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి లభిస్తుంది. ఏటా అయిదారు లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే సీసీఐ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన దిగుబడిని దళారులు చేజిక్కించుకుంటున్నారు. మిరప తరహాలోనే రైతు వద్ద ఉన్నపుడు తక్కువ ధర, చేజారగానే ఎక్కువకు పత్తి విక్రయాలు సాగుతున్నాయి. సీసీఐ కేంద్రాలు సకాలంలో తెరిస్తే కొంతైనా మేలు జరుగుతుంది. గతేడాది మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,450 ఉండగా ఈ ఏడాది మరో రూ.100 పెంచారు.   భారత పత్తి సంస్థ ఏర్పాటు చేసే కేంద్రాల్లో రైతులు విక్రయించే పత్తిలో 8 శాతం లోపు తేమ ఉంటే మద్దతు ధర లభిస్తుంది. ఆపైన తేమ ఉంటే ఒక్కో శాతానికి రూ.55.50 చొప్పున ధర తగ్గిస్తారు. 12 శాతానికి మించి తేమ ఉంటే కొనుగోలు చేయరు. రైతులు తెచ్చే పత్తిని నిబంధనలు సడలించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. దేశానికి వెన్నెముకగా ఉండే అన్నదాతలు పంట విక్రయించుకుంటే ఆంక్షలు విధించే పాలకులు వ్యాపారులు విక్రయించేసరికి సడలిస్తున్నారని వాపోతున్నారు.

Related Posts