YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

విత్తన వెతలు (కడప)

విత్తన వెతలు (కడప)

విత్తన వెతలు (కడప)
కడప, : రబీ సీజన్‌ ప్రారంభం నుంచి వరుణుడి కరుణ కురిసింది. నింగి నుంచి మేఘం దిగొచ్చింది. దుర్భిక్ష సీమలో సగం మండలాల్లో కరవుతీరా వానలు కురిశాయి. జలాశయాల్లోకి నీరు చేరింది. పంటలు సాగు చేసేందుకు రైతులు సేద్యం పనులను ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు నూనెగింజల్లో ప్రధాన పంట వేరుసెనగ సాగు చేసే రైతుల కోసం విత్తన కాయలను ఇప్పటికీ సిద్ధం చేయలేదు. సేకరణ ప్రక్రియ ఊపందుకోలేదు. ఆయా మండలాలకు సరఫరా చేయలేదు. పంపిణీకి ముహూర్తం కుదరలేదు. అదిగో.. ఇదిగో అనేలోపు ఐదు వారాల కాలం కరిగిపోయింది. ఇంతవరకు ఒక గింజ కర్షకుల చెంతకు చేరలేదు. రాయితీ వంగడాలు ఎన్నడు ఇస్తారని రైతులు ఆశగా ఎదురుచూసేకొద్దీ నిరాశే మిగిలింది.  జిల్లాలో ఈ సీజన్లో వేరుసెనగ పంట సాధారణ విస్తీర్ణం 15,429 హెక్టార్లు. వ్యవసాయ శాఖ ద్వారా 10,200 క్వింటాళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈసారి కె-6 రకం ఒక్కటే ఇచ్చేందుకు అనుమతిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థకు సేకరణ, సరఫరా బాధ్యతలను అప్పగించారు. ఈసారి వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం అమలుపై దృష్టి సారించారు. గ్రామసభల నిర్వహణ, అన్నదాతల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదుపై నిమగ్నమయ్యారు. నల్లరేగడి భూములు ఉన్న ప్రాంతాల్లో శనగ విత్తనాలను 98,901 క్వింటాళ్లు ఇవ్వాలని అనుమతివ్వగా 73,853 క్వింటాళ్లు అందజేశారు. వేరుసెనగను మాత్రం విస్మరించారు. పంపిణీ ఆలస్యం కావడంతో ప్రైవేటు వర్తకుల చెంతకు రైతులు వెళ్తున్నారు. సొంత డబ్బులు వెచ్చించి విత్తన కాయలను కొనుగోలు చేసి తెచ్చుకొని విత్తనం వేస్తున్నారు. ఇప్పటికే 1,037 హెక్టార్లలో వేశారు. 
జిల్లాలో జలవనరుల ఆధారంగా అన్ని మండలాల్లో వేరుసెనగను సాగు చేయనున్నారు. ఒంటిమిట్ట 14 హెక్టార్లు, నందలూరు 26, రాజంపేట 61, చిన్నమండెం 260, ప్రొద్దుటూరు 286, వల్లూరు 335, రామాపురం 351, సిద్దవటం 353, వేంపల్లె 370, తొండూరు 371, చింతకొమ్మదిన్నె 381, సింహాద్రిపురం 386, లక్కిరెడ్డిపల్లె 421, రాయచోటి 424, చక్రాయపేట 556, సుండుపల్లి 574, లింగాల 602, వేముల 663, సంబేపల్లె 798, పెండ్లిమర్రి 825, కమలాపురం 884, గాలివీడు 1,112, చాపాడు 1,202, దువ్వూరు మండలంలో సాధారణ విస్తీర్ణం 1,435 హెక్టార్లు. ఇక్కడే కాకుండా మిగతా మండలాల్లోనూ ఈ పైరును వేయనున్నారు.  ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో క్వింటా పూర్తి ధర రూ.7,100. అందులో ప్రభుత్వం 40 శాతం రాయితీ (క్వింటాకు రూ.2,840) ఇస్తున్నారు. కొనుగోలు చేసే కర్షకులు మిగతా 60 శాతం (రూ.4,260) చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. జిల్లాలో కడప, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, ప్రొద్దుటూరు, పులివెందుల, ముద్దనూరు డివిజన్లలోని 17 మండలాలకే విత్తనాలను కేటాయించారు. మరో ఆరు డివిజన్లకు మంజూరు చేయలేదు. ఇక్కడ రైతులు వద్దన్నారా, ఏవో, ఏడీఏలు ప్రతిపాదనలు పంపలేదా అనేది పక్కన పెడితే సాధారణంగా ఇక్కడ సాగు చేస్తారని  వివరాలను లెక్కల్లో చూపారు. విత్తనాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇదే పెద్ద చర్చనీయాంశమైంది.  జమ్మలమడుగు మండలానికి 90 క్వింటాళ్లు, లింగాల 100, పెండ్లిమర్రి 150, పులివెందుల 150, ప్రొద్దుటూరు 200, తొండూరు 500, చక్రాయపేట 500, వీరబల్లి 500, రామాపురం 550, వేంపల్లె 560, లక్కిరెడ్డిపల్లె 700, మైలవరం 700, రాయచోటి 800, సుండుపల్లె వెయ్యి, సంబేపల్లె 1,200, వేముల 1,200 గాలివీడు మండలంలో 1,300 క్వింటాళ్లు ఇవ్వాలని ఇటీవల అనుమతిచ్చారు. ఇవన్నీ ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా తెప్పించాల్సి ఉంది.

Related Posts