YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆస్తి-పాస్తులు ఆంధ్ర ప్రదేశ్

విలీనం ఎప్పుడో..!! (పశ్చిమగోదావరి)

విలీనం ఎప్పుడో..!! (పశ్చిమగోదావరి)

విలీనం ఎప్పుడో..!! (పశ్చిమగోదావరి)
ఏలూరు, నవంబర్ 22  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వ ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో పురపాలక సంఘాల్లో సమీప గ్రామాల విలీన అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇటీవల పలువురు మంత్రులు వివిధ సందర్భాలలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ప్రస్తావిస్తుండటంతో ఓటర్లు, వివిధ పార్టీల నేతలు సైతం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. తాజాగా భీమవరం పట్టణంలో సమీప గ్రామాల విలీనం ప్రతిపాదనలు జిల్లా అధికారులకు చేరటంతో జిల్లాలోని మిగతా పట్టణాల పరిస్థితిపైనా చర్చ సాగుతోంది. జనవరి తర్వాత ఏక్షణంలోనైనా ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో పట్టణీకరణ సాధ్యాసాధ్యాలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సమీప గ్రామాల విలీనానికి సమయం సరిపోతుందా అనే పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఏలూరు కార్పొరేషన్‌లో విలీనానికి సంబంధించిన ప్రతిపాదిత గ్రామాల వివరాలను గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా తాడేపల్లిగూడెంలోని విలీన గ్రామాల వివరాలను సాధారణ ఎన్నికల అనంతరం ప్రభుత్వానికి నివేదించారు. తాజాగా భీమవరం పట్టణ పరిధిలోని రాయలం, తాడేరు, నరసింహపురం, కొవ్వాడ- అన్నవరం, చినఅమిరం, కుముదవల్లి, విస్సాకోడేరు, గొల్లలకోడేరు గ్రామాలను విలీనం చేసేందుకు భీమవరం కౌన్సిల్‌ తిర్మాన ప్రతులను జిల్లా అధికారులకు అందజేసినట్లు పురపాలక అధికారులు వెల్లడించారు. వీటిలో కొన్ని పంచాయతీలు సానుకూలతను వ్యక్తం చేయగా మరికొన్ని విలీనానికి దూరంగా ఉన్నట్టు సమాచారం. భీమవరం పట్టణ పరిధిలోని గ్రామాలను ప్రస్తుతం విలీనం చేసి ప్రభుత్వ అనుమతులు పొందడం సాధ్యమయ్యేపనేనా అని పలువురు రాజకీయ నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విలీనం చేస్తే ఆయా పట్టణాల్లోని వార్డుల సరిహద్దుల్లో మార్పులు, వార్డు ఓటర్ల జాబితాలో సవరణలు, పట్టణ కౌన్సిల్‌ ఆమోదం తెలిపినా గ్రామాల నుంచి సానుకూలత వస్తుందా వంటి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. విలీనాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థాయి నుంచి ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎదురయ్యే చిక్కులు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని కసరత్తు ప్రారంభించాల్సి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు పట్టణీకరణ ఒక మార్గమని ప్రభుత్వ ఆలోచన. ఈ నేపథ్యంలో పట్టణాల సమీపంలోని గ్రామాలను విలీనం చేయడం, మేజర్‌ పంచాయతీలకు నగర పంచాయతీలుగా హోదా కల్పించడం వల్ల పలు అంశాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆయా పంచాయతీల హోదా పెంపు, గ్రామాల విలీన ప్రక్రియకు సంబంధించి కలెక్టరు ఛైర్మన్‌గా ఉన్న కమిటీలో పట్టణ ప్రణాళిక విభాగం, పంచాయతీరాజ్, ర.భ.శాఖ, జిల్లా పరిశ్రమల కేంద్ర అధికారి, మత్స్య, ఉద్యాన, పశుసంవర్ధకశాఖల అధికారులు కన్వీనరు, సభ్యులుగా ఉంటారు.

Related Posts