YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

క్రికెటర్ అంబటి రాయుడికి బీసీసీఐ నోటీసులు

క్రికెటర్ అంబటి రాయుడికి బీసీసీఐ నోటీసులు

హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్ అంబటి రాయుడికి బీబీసీఐ నోటీసులు జారీ చేసింది. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి వారితో ఘర్షణకు దిగినందుకు గాను వివరణ కోరుతూ ఈ నోటీసులు పంపింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంటులో భాగంగా గతవారం కర్ణాటకతో మ్యాచ్ జరిగింది. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బ్యాట్స్‌మన్ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో హైదరాబాద్ ఫీల్డర్ మెహదీ హసన్ పొరపాటున బౌండరీ లైన్‌ను తాకాడు. ఫీల్డర్ బౌండరీ లైన్‌ను తాకిన విషయాన్ని గుర్తించని అంపైర్లు రెండు పరుగులు ఇచ్చారు. కర్ణాటక జట్టు నిర్ణీత ఓవర్లలో 203 పరుగులు చేసింది. ఆట ముగిశాక కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్ ఫీల్డర్ బౌండరీ లైన్‌ను తాకిన విషయాన్ని థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆ జట్టుకు మరో రెండు పరుగులు అదనంగా ఇచ్చారు. విషయం తెలిసిన హైదరాబాద్ కెప్టెన్ అంబటి రాయుడు అంపైర్లతో వాదనకు దిగాడు. అయితే రాయుడు వాదనను కొట్టిపడేసిన అంపైర్లు ఆటను కొనసాగించారు. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు కూడా 203 పరుగులు చేసింది. నిజానికి మ్యాచ్ డ్రా అయినా అదనంగా రెండు పరుగులు కలపడంతో కర్ణాటకను విజేతగా ప్రకటించారు. అయితే సూపర్ ఓవర్ ద్వారా విజేతను ప్రకటించాలని రాయుడు కోరినా అంపైర్లు నిరాకరించారు.మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా హైదరాబాద్ ఆటగాళ్లు మైదానాన్ని వీడకపోవడంతో ఆ తర్వాత జరగాల్సిన ఆంధ్ర-కేరళ మ్యాచ్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. రాయుడి తీరును తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అంపైర్ నిర్ణయాన్ని ఉల్లంఘించడానికి గల కారణాలను వారం రోజుల్లోగా తెలియజేయాలని కోరుతూ రాయుడికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ జట్టు మేనేజర్ కృష్ణారావుకు కూడా నోటీసులు అందాయి.

Related Posts