YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా ఆంధ్ర ప్రదేశ్

 అన్న పొగడ్తలు...తమ్ముడు దీక్షలు

 అన్న పొగడ్తలు...తమ్ముడు దీక్షలు

 అన్న పొగడ్తలు...తమ్ముడు దీక్షలు
కాకినాడ, డిసెంబర్ 13,
ఒకవైపు తమ్ముడు పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాకినాడలో దీక్ష చేస్తుంటే, మాజీ కేంద్రమంత్రి, పవన్ సోదరుడు చిరంజీవి మాత్రం జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవి అంటే ఎంతో గౌరవిస్తారు. ఆయన తనకు మార్గదర్శిగా అనేక సభల్లో చెబుతారు. అలాంటి పవన్ కల్యాణ్ ఏపీలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తుంటే స్వయానా చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై పొగడ్తలు కురిపించడం జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు.పవన్ కల్యాణ్ ఈరోజు కాకినాడలో రైతు సౌభాగ్య దీక్షను చేపట్టారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఈ దీక్షకు దిగారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్నారు. ఇసుక కొరతపై ఆయన విశాఖలో లాంగ్ మార్చ్ చేసి అధికార పార్టీని తూర్పారపట్టారు. ఇక ఏపీలో ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని కూడా పవన్ కల్యాణ్ తప్పుపట్టారు. వైసీపీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని ఆరోపిస్తున్నారు.కానీ పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఏపీ రాజకీయాల్లో ఎటువంటి జోక్యం చేసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీకి దిగినప్పుడు కూడా చిరంజీవి ప్రచారంలో పాల్గొనలేదు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా? లేదా? అన్నది నేటికీ తెలియదు. రాజ్యసభ పదవీ కాలం పూర్తయిన తర్వాత చిరంజీవి కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వాన్ని కూడా తీసుకోలేదు. ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమై కేవలం సినిమాలకే పరిమితమయ్యారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఓకే ఒక స్థానాన్ని దక్కించుకుంది. చిరంజీవి మాత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సమేతంగా కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ కోసమే జగన్ ను చిరంజీవి కలిసినట్లు చెప్పారు. కానీ తాజాగా దిశ చట్టాన్ని తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందిస్తూ చిరంజీవి లేఖ రాయడం మరోసారి చర్చనీయాంశమైంది. అదీ తమ్ముడు పవన్ దీక్ష జరిగే రోజే చిరంజీవి ప్రకటన విడుదల చేయడంపై జనసేనలోనూ విస్తృత చర్చ జరుగుతోంది. అన్నదమ్ముల వ్యవహారం పార్టీలోనూ, అభిమానుల్లోనూ అయోమయం సృష్టించే విధంగా ఉంది. కాపు సామాజిక వర్గంలోనూ అన్నదమ్ముల తీరు గందరగోళంగా మారింది.

Related Posts