YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న భాజపా ప్రభుత్వాలు

భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న భాజపా ప్రభుత్వాలు

ఓ పత్రిక  సదస్సులో ప్రకాశ్‌రాజ్‌, కంచ ఐలయ్య ధ్వజం 
న్యాయస్థానాలే శరణ్యం: నటుడు విశాల్‌ 
చలనచిత్రాలను ఆ కోణంలో  చూడొద్దు: దర్శకుడు శశిధరన్‌

 కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల్లోని భాజపా ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛను దారుణంగా హరిస్తున్నాయని, తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై ఎదురుదాడికి యత్నిస్తున్నాయని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌, సామాజికవేత్త కంచ ఐలయ్య ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ పత్రిక ’ సదస్సులో ‘భావప్రకటన స్వేచ్ఛ’ అంశంపై జరిగిన చర్చలో వీరితోపాటు, తమిళ నటుడు విశాల్‌, ఎస్‌.దుర్గ చిత్ర దర్శకుడు శశిధరన్‌ పాల్గొన్నారు. ఇందులో పద్మావత్‌, ఎస్‌.దుర్గ చిత్రాలతోపాటు పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్య తదితర అంశాలపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ.. పద్మావత్‌ చిత్రం విడుదల కోసం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా అమలు చేయలేకపోవడం ప్రభుత్వాల అసమర్థత అని విమర్శించారు. సినిమాపై రాజస్థాన్‌లోని రాజపుత్రులు మాట్లాడుతున్నారంటే వారికి సంబంధించిన అంశమనుకోవచ్చు. కానీ, గుజరాత్‌, హరియాణాలకేం సంబంధం? అని ప్రశ్నించారు. ‘దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నా ప్రధాని మౌనంగా ఎందుకున్నారు? ఆయన గురించి ఏదైనా మాట్లాడితే ‘నువ్వు హిందూ వ్యతిరేకివి’ అని నన్ను నిందిస్తున్నారు. నిజానికి నేను హిందూ వ్యతిరేకిని కాదు. ప్రధాని మోదీకి వ్యతిరేకిని, కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డేకి వ్యతిరేకిని, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు వ్యతిరేకిని. అనంతకుమార్‌ రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. దీనిని నేను ప్రశ్నిస్తూ ప్రెస్‌మీట్‌ పెడితే.. బీఫ్‌ తినేవాడినంటూ నా గురించి వారు మాట్లాడతారు. నేను ఇటీవల వెళ్లిన సభ వేదికను గోమూత్రంతో శుద్ధి చేశారు. ఎక్కడికి వెళ్లినా ఇలాగే చేస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు. దేవతల పేరిట మటన్‌, చికెన్‌ దుకాణాలు పెడితే భాజపా వాళ్లకు అభ్యంతరం ఉండదు కానీ, ఎస్‌.దుర్గ అని సినిమాకు పేరు పెడితే మాత్రం సహించరు.’’ అని ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తమకంటే గొప్ప నటుడని ఆయన విమర్శించారు. కంచ ఐలయ్య మాట్లాడుతూ.. ‘మోదీ ప్రభుత్వం ముమ్మారు తలాక్‌పై చూపిన శ్రద్ధ, దళితులకు అర్చకత్వ హక్కులపై చూపించడం లేదు?’ అని పేర్కొన్నారు. విశాల్‌ మాట్లాడుతూ.. వ్యక్తులు, సంస్థలు సృష్టించే వివాదాలు పరిష్కారం కావాలంటే సినిమా వాళ్లు న్యాయస్థానాలను ఆశ్రయించడమే ఉత్తమ మార్గం. అక్కడైతేనే న్యాయం దొరుకుతుందని అంతా భావిస్తున్నారు. సెన్సార్‌ బోర్డు ధ్రువీకరించిన తర్వాత చిత్రాన్ని వ్యతిరేకించడం సబబు కాదన్నారు. దర్శకుడు శశిధరన్‌ మాట్లాడుతూ.. ‘‘నేను రూపొందించిన ఎస్‌.దుర్గా సినిమాకు మతానికి అసలు సంబంధమే లేదు. సినిమాను చూడకుండానే లేనిపోనివి ఆపాదిస్తున్నారు’ అని అన్నారు. సదస్సు ప్రారంభంలో ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యలకు భాజపా తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు అభ్యంతరం చెప్పారు. హిందూ వ్యతిరేక, వామపక్ష మద్దతుదారులనే చర్చలో కూర్చోబెట్టడం వల్ల ఏకపక్షంగా మాట్లాడుతున్నారని విమర్శించడంతో కలకలం రేగింది. నిర్వాహకుల జోక్యంతో సద్దుమణిగింది.

Related Posts