
హైదరాబాద్, జూలై 18,
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం జరగబోతుందా? ఉప్పు, నిప్పులు కలవడానికి కారణాలేంటి? ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ రెండూ ఒకరంటే ఒకరికి పడవు. అది జగమెరిగిన సత్యం. కేసీఆర్, జగన్ కు, చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు మధ్య ఉన్న కెమెస్ట్రీ అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కేసీఆర్ వేరే పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబును తొలి నుంచి వ్యతిరేకించడంలో ముందుంటారు. అందుకే జగన్ కు దగ్గరయ్యారు. జగన్, కేసీఆర్ లు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అనేక సార్లు చర్చలు జరిగాయి. ఒకరి వద్దకు మరొకరు వెళ్లి కలుసుకుని కష్టసుఖాలను మాట్లాడుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు జాతీయ స్థాయిలో పడకపోయినా, వీరిద్దరి మధ్య సత్సంబంధాలున్నాయన్నది వాస్తవం. అందుకే ఇప్పటికే ఒకసారి హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సమావేశమై ఇరు రాష్ట్రాల మధ్య విభజన సందర్భంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిగాయి. తాజాగా ఢిల్లీలో గోదావరి, కృష్ణా నదీ జలాల వాటాపై కూడా ఇరు రాష్ట్రాల ముఖ్మమంత్రుల సమావేశం జరిగింది. ఎవరు అధికారంలో ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కలిగి ఉండటం అందరూ హర్షించదగ్గ విషయమే. కానీ ఇక్కడ అర్థం కాని విషయమేంటంటే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమావేశం అవ్వడంపైనే చర్చ జరుగుతుంది. ఇది అఫిషియల్ మీటింగ్ కాదు. డిన్నర్ మీటింగ్ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇరువురు నేతలు యువ నేతలు కలవడంతో ఖచ్చితంగా తాజా రాజకీయాలపై చర్చ జరిగి ఉంటుందన్న అంచనాలు మాత్రం వినపడుతున్నాయి. అయితే ఏ అంశంపై చర్చించడానికి కేటీఆర్, లోకేశ్ కలిశారన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలపై వీళ్లిద్దరూ మాట్లాడుకున్నారా? అంటే రెండు పార్టీలు కలసి పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి ఆ విషయం మాత్రం కాదని అందరికీ తెలుసు. కాకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే కేటీఆర్, లోకేశ్ చర్చించి ఉంటారని అంటున్నారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మృతి చెందినప్పుడు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చారు. మాగంటి గోపీనాధ్ 2014లో టీడీపీ గుర్తుపై గెలిచి తర్వాత బీఆర్ఎస్ లోకి మారారు. త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాట్లాడుకునేందుకు మాత్రమే ఈ ఇద్దరు నేతలు కలిసినట్లు ప్రచారం జరుగుతుంది. మాగంటి గోపీనాధ్ కుటుంబం నుంచి ఎవరినైనా పోటీకి దింపాలా? మరెవరైనా అభ్యర్థిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న దానిపై ఇద్దరి మధ్య చర్చ జరుగినట్లు తెలిసింది. కేటీఆర్, లోకేశ్ భేటీలో కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద మాత్రమే చర్చ జరిగి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తం మీద ఇద్దరు యువనేతల కలయిక మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తుందనే చెప్పాలి.