YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాళేశ్వరం ఇంజనీర్ల దగ్గరే 1000 కోట్లా...

కాళేశ్వరం ఇంజనీర్ల దగ్గరే 1000 కోట్లా...

హైదరాబాద్, జూలై 18, 
విపక్షాల మధ్య మాటల యుద్ధం, ఇంకో పక్క కాళేశ్వరంకు పనిచేసిన అధికారుల ఆస్తులు బయటపడుతున్న అవినీతి బాగోతం… ఇవన్నీ చూస్తుంటే, నిజంగా ఈ వ్యవస్థకు న్యాయం చేసే శక్తి ఉందా అనే అనుమానం తలెత్తడం సహజం.ఇంత పెద్ద కుంభకోణంలో మొదటగా పట్టుబడిన వారు ఇద్దరు ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు (ఈఎన్‌సీలు), ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ). వీరు కేవలం ఉద్యోగస్థులే కావడంతోనే ఇలా పట్టుబడ్డారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. వీరిలో మురళీధర్ రావు (రిటైరైన ఈఎన్‌సీ), హరిరామ్ నాయక్ (కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీగా పనిచేశారు), నూనె శ్రీధర్ (సాగునీటి శాఖలో ఈఈగా పనిచేశారు) ఉన్నారు. ఇవాళ ఈ ముగ్గురి ఆస్తుల విలువ రూ.1000 కోట్లు దాటుతుందని అంచనా. లగ్జరీ విల్లాలు, వాణిజ్య సముదాయాలు, ఎకరాల కొద్దీ భూములు, విదేశాల్లో పెళ్లిళ్లు… ఇవన్నీ చూస్తుంటే అవినీతికి కొలమానమే మిగిలేది కాదు. కేవలం ఉద్యోగస్థులైన వీరు ఇంత సంపాదించారంటే, వీరి వెనుక ఉన్న పెద్ద కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల అక్రమార్జన ఇంకెంత భారీ స్థాయిలో ఉంటుందో ఊహించడమే కష్టం.ఈ కేసును ఈడీ చాలా తీవ్రమైన కోణంలో చూస్తోంది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు నివేదికలు, ఎఫ్‌ఐఆర్‌లు, కస్టడీ నివేదికలు అడిగింది. విదేశాల్లో ఖర్చులు, కంపెనీల్లో పెట్టుబడులు, కుటుంబ సభ్యుల ద్వారా కాంట్రాక్టుల కేటాయింపులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా నూనె శ్రీధర్ కుమారుడి థాయ్‌లాండ్ వివాహం, మురళీధర్‌రావు కుమారుడు అభిషేక్‌రావు పెట్టుబడులపై ఈడీ దృష్టి పెట్టింది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయడం ద్వారా, ఈ అక్రమ సంపాదనకు మూలాలను, అది ఎలా దారి మళ్లించబడింది అనే అంశాలను బయటపెట్టాలని ED ప్రయత్నిస్తోంది.గతంలో అవినీతి చేసిన అధికారుల్లో పట్టుబడినవాళ్లు ఎవరైనా జైలుకెళ్లారా? కేసులు ఏదైనా తుది తీర్పుకు వచ్చాయా? అంటే ఏదీ జరగలేదు. ఇవన్నీ చూస్తుంటే, అవినీతిపై జరుగుతున్న విచారణలు కూడా ఓ నాటకంగా మారిపోతున్నాయేమో అనిపిస్తుంది. ఈ ముగ్గురిని శిక్షించలేని స్థితిలో ఉంటే, వారి వెనుకనున్న పెద్ద కాంట్రాక్టర్లు, రాజకీయ నేతల బాగోతాలపై ఏం చేయగలరు? గతంలో జరిగిన అనేక పెద్ద అవినీతి కేసుల్లో నిందితులు శిక్షించబడకపోవడం, లేదా ఆలస్యంగా తీర్పులు రావడం వంటివి ప్రజల్లో విచారణ వ్యవస్థపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి.సీఎం రేవంత్ కు  నిజంగా చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులపై సిట్ కాదు, ప్రత్యేక న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఎక్స్‌టెన్షన్, రాజకీయ ప్రమేయం లేని నిజమైన న్యాయం జరగాలంటే అదే సరైన నిర్ణయం. లేకపోతే… రేవంత్ కూడా ఆ తాను ముక్కే అన్న అపప్రద ప్రజల గుండెల్లో మిగిలిపోతుంది. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఈ ప్రభుత్వం నిజంగానే అవినీతిపై యుద్ధం చేస్తుందా? లేక ఇది కూడా ఒక రాజకీయ నాటకమేనా అనేది కాలమే నిర్ణయించాలి.

Related Posts